🚩."గతానుగతికో లోకః"

🚩."గతానుగతికో లోకః"


🔻అని పెద్దలు అంటూండగా వింటూంటాం.


అది ఈ క్రింది శ్లోకంలోని పాదమే.


శ్లో. గతానుగతికో లోకః న లోకః పారమార్థికః |


గంగాసైకతలింగేన నష్టం మే తామ్రభాజనమ్|🔻


ఒక బ్రాహ్మణుడు గంగానదిలో స్నానము చేద్దామని గంగ ఒడ్డుకు వెళ్ళాడు అతని దగ్గర ఒక రాగి చెంబు ఉన్నది. అదే అతని విలువైన వస్తువు కనుక తను గంగలో స్నానం చేసి వచ్చేసమయానికి యెవరైనా దానిని దొంగిలించుకొని పోతే ఎలాగ? కాబట్టి చెంబును భద్రంగా దాచాలి అనుకున్నాడు.


మంచి ఆలోచనొకటి తట్టింది. అప్పటికి గంగ ఒడ్డున ఎవరూలేరు. జాగ్రత్తగా బ్రాహ్మణుడు ఒడ్డున ఉన్న ఇసుకలో ఒక గొయ్యి త్రవ్వి , అందులో తన రాగి చెంబు యుంచి గొయ్యి పూడ్చివేశాడు. మరి అనుమానం వచ్చింది. అంత పెద్ద నదీ తీరములో తాను చెంబు యెక్కడ పెట్టాడో కనుక్కోవడం ఎలా??


మరొక దివ్యమైన ఆలోచన మెదిలింది. వెంటనే చెంబు ఉంచిన చోట పైన ఇసుకతో ఒక లింగము చేసి గుర్తుగా పెట్టుకున్నాడు. అతడు స్నానమునకు వెళ్ళగానే మఱికొందరు గంగా స్నానానికై వచ్చారు.


వారు ఈ లింగమును చూచి , స్నానము చేయటానికి ముందు గంగ ఒడ్దున తప్పక ఒక ఇసుకతో శివలింగము చేసి స్నానము చేయాలి కాబోలు, అలాంటి నియమం ఉండబట్టే ఇక్కడ ఇసుక లింగము చేసినట్లున్నారని, ఒక్కొక్కరు ఒక్కొక్క లింగము చేసి ఉంచారు. ఇంతలో మరో బృందము స్నానానికై వచ్చింది.


వారు కూడా ఈ తంతు గమనించి తలా ఒక లింగాన్ని తీరములో చేసి స్నానానికి వెళ్లారు. స్నానమాచరించిన బ్రాహ్మణుడు ఒడ్డుకు వచ్చేసరికి తీరమంతటా ఎన్నోలింగాలు కనిపించాయి. తను చేసిన లింగము, తను చెంబు నుంచిన ప్రదేశము కనిపెట్టలేని ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ ఈ శ్లోకం చెప్పాడు


విషయము తెలిసికోకుండా ఒకరాచరించిన పనిని ఒకరి తరువాత ఒకరు గ్రుడ్డిగా అనుకరించడం వలన ఈ బ్రాహ్మణుడు తన చెంబును కోల్పోవడానికి కారణమైనది. ఇలాంటి ప్రవర్తన సర్వసామాన్యము. వెతికినకొద్దీ ఉదాహరణలు కనిపిస్తాయి లోకంలో.🙏🏿


🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!