మనుచరిత్రము. .....పిస్కా సత్యనారయణ గారి విశ్లేషణ..

పిస్కా సత్యనారయణ గారి విశ్లేషణ..


ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత, భాగవతముల తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము, ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి అద్వితీయ ప్రబంధం మనుచరిత్రము. ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది. 


మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ, మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి. ఆ 2 పాత్రల్లో మొదటిది - ప్రవరుడు; రెండవది - వరూధిని. 


ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్ని గడుపుతున్న ఒక ఆదర్శ గృహస్థు. ....ఇక - వరూధిని ఒక అప్సరస. అద్భుత సౌందర్యరాశి, అపురూప లావణ్య వారాశి. 


విధివైచిత్రి వలన వీరిద్దరూ అనూహ్యమైన రీతిలో, మనోహరమైన మంచుకొండల మధ్యలో, అనగా మనోజ్ఞమైన హిమగిరుల సుందరసీమలో పరస్పరం తారసిల్లుతారు. అతిలోకసుందరియైన ఆ అచ్చర ప్రవరాఖ్యుని సౌందర్యవిభవం చూసి, అతనిపై మనసుపడుతుంది..... ప్రవరుడు అందములో ఆమెకు ఏమాత్రమూ తీసిపోడు మరి! 


ప్రవరుణ్ణి మనకు పరిచయం చేసే ప్రారంభపద్యములోనే పెద్దనగారు అతణ్ణి ఆలేఖ్య తనూవిలాసుడు అనీ, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనీ వర్ణిస్తారు. ఆలేఖ్య తనూవిలాసుడు అంటే లిఖించడానికి లేదా చిత్రించడానికి అలవికాని రూపసంపద కలవాడని అర్థం. ఇకపోతే, మకరాంకుడంటే మన్మథుడు; శశాంకుడంటే చంద్రుడు. వారిద్దరితో సరితూగగల సుందరాకారుడని అర్థం. కనుకనే వరూధిని అతణ్ణి చూసి ఎక్కడివాడొ ! యక్షతన యేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలినవాడు ! అనుకుని, అతనిపై మరులుగొంటుంది. ( యక్షతనయుడు అనగా యక్షులకు రాజైన కుబేరుని పుత్రుడు నలకూబరుడు. ఇతడు చాలా సౌందర్యవంతుడని ప్రసిద్ధి. ఇందుడంటే చంద్రుడు. జయంతుడు దేవేంద్రుని కుమారుడు. ఇతడు సైతం చాలా అందగాడని చెప్తారు. వసంతుడు మదనుని చెలికాడు. ఇక కంతుడంటే సాక్షాత్తూ మన్మథుడే ! )


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!