వైష్ణవమాయ

వైష్ణవమాయ ............ By - Kameswara Sarma Sriadibhatla


ఒకసారి అగస్త్య మహర్షి శ్రీకృష్ణ దర్శనార్ధమై ద్వారకకు వెళ్ళి యమునకు ఆవలి దరి ఉండి తానొచ్చినట్టుగా కృష్ణమూర్తికి వర్తమానం పంపేరట. 


కబురందిన కృష్ణయ్య హడావుడిగా సత్య భామను పిలిచి భామా యమునకు ఆవలి వొడ్డున అగస్త్యుల వారు విడిసి ఉన్నారు వారికి తగు ఉపచారములుకావించి నగరిలోనికి తీసుకురా, ఆఁ అన్నట్టు ఎప్పుడు భోంచేసేరో ఏమో వారికోసం భోజన సామగ్రికూడా వెంట తీసుకు వెళ్ళుమా అని చెప్పగా, అలాగే అని బయలుదేరిన సత్య భామ వెంఠనే వెనుదిరిగి వచ్చి నాధా యమున ఉద్రుతముగా ప్రవహిస్తునాది దాటి పోవుట కష్టముగా ఉన్నాది ఎలా అంటూ చెప్పిందిట. 


అందుకు నల్లనయ్య నవ్వి, అస్కలిత బ్రహ్మచారి నన్ను పంపాడు, యమునమ్మా నా దారి తొలగుమా అని చెప్పు నీ పని ఐపోతుంది అని చెప్పేడట. అది విన్న సత్యభామ పక్కున నవ్వుతూ అదేమిటి స్వామీ అష్టకళత్రములు అఫిషియల్గా కాక మరో పదహారువేలమంది అనఫిషియల్ భార్యలు ఉన్న మీరా అస్కలిత బ్రహ్మచారి? చాల్లెద్దురూ మీ పరాచికాలూ అందిట. 


మాధవుడు మంద్స్మిత వదనుడై, చెప్పి చూడరాదా సత్యా అన్నాడట, సరేలెమ్మనుకున్న సత్య పరివారం వెంట రాగా మొత్త సరంజామా అంతా తీసుకుని యమున వొడ్డున నిలిచి అమ్మా యమునా నన్నొక అస్కలిత బ్రహ్మచారి పంపేడు, కార్యార్ధినై ఆవలి వొడ్డుకు వెళ్ళాలి నాకు దారినొసగుమా అందిట, అంతే ఆశ్చర్యం కలిగించే విధంగా యమున రెండుగా చీలి సత్యభామకు దారి ఇచ్చిందిట, భామ ఆవలిదరి చేరుకోగానే మళ్ళీ మామూలుగా ప్రవహించసాగిదిట. 


సత్య భామ అగస్త్య మహర్షికి సపర్యలు చేసి కడుపు నిండా భోజనం పెట్టి స్వామీ మా నగరికి దయ చేయండి నా భర్త శ్రీకృష్ణుడు మిమ్ము వెంటబెట్టుకు రమ్మనారు అని చెప్పిందిట. అది విన్న ఆ మహర్షి అమ్మా నేను వేరే పని మీద ఇంకో చోటుకు వెళ్ళవలసి ఉన్నాది అందువల్ల ఇప్పుడు కుదరదు మరో సారి వస్తాను కనుక నీవు వెనుదిరిగి వెళ్ళు అన్నాడట. 


యమునా ప్రవాహం చూస్తే చాలా ఉద్రుతంగా ఉన్నాది స్వామీ నేను వెనుకకు ఎలా పోగలను అని అడిగిందిట సత్య, అందుకా ముని చిరునవ్వు నవ్వుతూ నిత్యోపవాసి పంపగా వచ్చాను దారినిమ్ము అని అడుగు యమున నీకు దారి ఇస్తుంది అని చెప్పేడట. సత్యభామ మరోసారి ఆశ్చర్యపోయి అదేమిటి స్వామీ ఇప్పుడేగా నా చేత్తో వడ్డించి మరీ మీకు భోజనం తినిపించేను మీరు నిత్యోపవాసి ఎలా అవుతారు అని ప్రశ్నించిందట. 


అందుకా ముని నవ్వి నీవలా చెప్పి చూడు తల్లీ అనగా సత్యభామ యమునా నదితో అలా చెప్పడం, యమునా మళ్ళీ రెండుగా చీలిపోయి సత్యభామకు దారినివ్వడం జరిగిందిట. 


ఈ వింతకు ఆశ్చర్యపడుతున్న సత్యభామను చూసి కృష్ణుడు తనదైన స్టైల్లో నవ్వుతూ దేవీ నీకనులకు గోచరిచేదంతా నిజం కాదు, నీ మనసుకు తోచినదల్లా యదార్ధమూ కాదు సుమా అన్నాడట. 


ఓహో ఇదే గాబోలు వైష్ణవమాయ అనుకుందట సత్య.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!