మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ...

మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ...

శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.


హీరాకానీ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.


కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. “అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం ఆఱవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.


మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.


ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.


శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందఱూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!