నన్నయ్యగారి గడుసుదనం..

నన్నయ్యగారి గడుసుదనం..

సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క

నెంతయును సంతసంబున గుంతిదేవి

రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి

కెలన నుండె, నున్మీలితనలిననేత్ర

ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం! 

"కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. 

బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొంది. అంచేత పాపం వాళ్ళు తమ పుత్రుల విద్యా ప్రవీణతని కళ్ళారా చూడలేరు. చూడగలిగింది కుంతి మాత్రమే. కుంతి సంతోషానికి అది కూడా కారణమేమో కూడానూ! ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని చూస్తోంది అని నొక్కి చెప్పడం ద్వారా, పాపం ఆ చూడలేని వారి దుస్థితిని వెక్కిరించినట్టు లేదూ! పైగా, అదెక్కడా పైకి తేలకుండా, పోలీసువాళ్ళ దెబ్బల్లాగా, కేవలం పద్యనిర్మాణం ద్వారా, చివర్న వేసిన విశేషం ద్వారా ధ్వనింపజేసారు నన్నయ్యగారు. అద్గదీ ఆయనగారి గడుసుదనం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!