మహావీరుడు కానీ మహనీయుడు కాడు..

కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు..

(Vanam Venkata Varaprasadarao)

' యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్' అన్న మహాభారత /ఇతిహాస కథనము గురించి ప్రస్తావిస్తూ మహాభారతంలోని ప్రతి పాత్రకు ఈ ట్రాజిక్ ఫ్లా ఉన్నది. ఎన్నో మంచి గుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం ఆ పాత్రను, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది అని మానవ చరిత్ర మనకు చెప్తున్నది, ఒక అసూయ అనే గుణాన్ని తీసేస్తే దుర్యోధనుడు ధర్మరజుకంటే , భీముడికంటే ఏమీ తీసిపోడు, అదే గుణం కర్ణుడిలో లేకుంటే అర్జునునికన్నా ఏమీ తీసిపోడు ఎందులోనూ, ఒక్క పరస్త్రీ వ్యామోహం లేకుంటే వీడి ముందు ఎవడూ సరిపోదు అని సాక్షాత్తో ఆంజనేయుడే రావణుడి గురించి అన్నాడు అని నేను అంటే మా క్లాస్ మేట్స్ ఒకటే చప్పట్లు! యిది స్వోత్కర్ష కోసం కాదు, ఆ అంశం భారతీయులకు, వాల్మీకికి, వ్యాసులవారికి కొత్త విషయము కాదు అని చెప్పడం కోసమే అప్పుడు నా భావాలను చెప్పింది, ఇప్పుడు మిత్రులకు చెప్తున్నది కూడా.

దుర్యోధనునికోసం తన సర్వస్వాన్ని అర్పించిన కర్ణుడికి తను చేతున్న దానముల ఫలితం దుర్యోధనునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది అని తెలిసీ ఆ దానాలు చెయ్యడం దుర్యోధనుడిని వంచించడం, తానూ ఆత్మ వంచన చేసుకోవడమే తప్ప మరేమీ కాదు. ఒక ఇతిహాసముగా పరిశీలించినా కేవలం ఒక కవి కల్పనగా పరిగణించినా ఇది సత్యము. అన్నీ ఒక ఎత్తు, యుద్ధం మొదలైతే భీష్ముని మీది కోపంతో, అయన యుద్ధరంగంలో ఉన్నంత కాలం నేను యుద్ధ భూమిలో అడుగుబెట్టాను అని 'సహాయ నిరకరణం' చేయడం మరీ స్వామిద్రోహమే!

వంచనతో విద్యనూ నేర్చుకున్నాడు, అదీ పనికిరాకుండా పోతుంది అన్న విషయము తెలిసీ దుర్యోధనుడిని ఎగేశాడు. ఆ తర్వాత కూడా తన దానముల పరంపరను కొనసాగించాడు, ఆ సహజ కవచ కుండలాలు ఉన్నంత కాలము తను అజేయుడు అని తెలిసికూడా! చివరికి యుద్ధసమయం వచ్చినప్పుడు తోడు లేకుండా పోయాడు దుర్యోధనునికి.

ఉత్తర గోగ్రహణం సమయంలోనూ, చిత్ర రథునితో యుద్ధ సమయంలోనూ దుర్యోధనుని ప్రక్కనే ఉన్న కర్ణుడు అర్జునుని ఏం చేయగలిగాడు? యతో ధర్మస్తతో జయః అదీ కాలము నేర్పిన నీతి.

చివరికి ఒక స్త్రీని నిండు సభలో దుస్తులు లాగేసి అవమానిస్తున్నప్పుడు కూడా వారించలేదు సరికదా, తన తొడ చూపించి దుర్యోధనునికి సైగ చేసి, వాడు తన ఎడమ తొడ చరిచి ద్రౌపదిని వచ్చి కూర్చోమని సైగ చేసి, ఆ తొడ విరిగి యుద్ధభూమిలో పొర్లేదాకా తీసుకొచ్చాడు.

'పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః' అన్న ఆ(క)ర్షవాక్యం సమిత్రుడి లక్షణాలను చెప్తుంది. తెలిసీ తెలియక చేతున్న పాపాలను వారించేవాడు, హితమును ఆలోచించేవాడు, తన రహస్యాలను దాచిపెట్టేవాడు, తన మంచి గుణములను అందరికీ తెలియజెప్పి ఆ గుణములను పెంచుక్నేలా ప్రోత్సహించేవాడు, ఆపద వచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్ళని వాడు, అవసర సమయములో తోడు, నీడ, సూచన, సహాయం, ప్రోత్సాహములనిచ్చి ఆదుకునేవాడు... వాడు మిత్రుడు అని మిత్రలక్షణములను చెప్పారు పూర్వీకులు. వీటిలో ఏ ఒక్క లక్షణమూ లేనివాడు కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!