కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల?

పోతన గారి.....భాగవత పద్యాలు

సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే

పడియుండుటకు దూది పరుపులేల?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే

భోజన భాజన పుంజమేల?

వల్కలాజిన కుశావళులు లేకున్నవే

కట్టదుకూల సంఘంబులేల?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే

ప్రాసాద సౌధాది పటల మేల?

తే. ఫలరసాదులు కురియవే పాదపములు

స్వాదుజలముల నుండవే సకల నదులు

పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు

ధన మదాంధుల కొలువేల తాపసులకు

నిజంగా చూస్తే జీవితాన్ని ఆనందించడానికి కావలసినవన్నీ పుష్కలంగా ఇచ్చాడు

పరమాత్మ . పచ్చని గడ్డి మైదానాలు మనకిస్తే , దూది పరుపుల మీద పడుకోవాలనే కోరిక మనది . అన్నం నోటికందించడానికి చేతులు ( కరాంజలులు ) ఉన్నాయి .

అయినా కంచాలూ గరిటల మీద మోజు . శరీరాన్ని కప్పుకోవడానికి నార బట్టలున్నాయి . అయినా పట్టుపుట్టాలంటే పరమ ప్రీతి . 

నివసించడానికి పృకృతి సిధ్ధమైన గుహలున్నాయి ( తాపసులకు మాత్రమే ) . కానీ కావాలి మేడలూ మిద్దెలూ .ఫలాలను వర్షిస్తున్నాయి..

స్వాదుజలాలను అందిస్తున్నాయి సకలనదులు . అడగకుండానే అన్నపూర్ణ లాగా అన్నం పెడుతున్నారు పుణ్య సతులు .కానీ కోరికలు చావడం లేదు . 

ధనంతో మదమెక్కిన వారిని సేవిస్తున్నారు .ఏమి బాముకొందామనో ?

పరమ భోగాలు అనుభవిస్తూ పడతుల పొందులో పాపాలు చేస్తూ , వేలకొలది ఎకరాలలో ఆశ్రమాలు కట్టుకొని మననాకర్షిస్తూ సాధువులమంటున్న వారు నిజమైన సాధువులు కారనీ , వారి కుతంత్రాలకు దూరంగా ఉండమనీ చెబుతుందీ పద్యం .

ఇంకో విషయం . అన్నీ ఉన్నా ఇంకా ఏమేమో కావాలనే కోరికతో పృకృతిని పాడు చేసే కాలంలో మనమున్నాం . సుఖమైన జీవితాన్ని గడపడానికి అన్నీ భగవంతుడమర్చిపెట్టాడు .” సింప్లిసిటీ ” లో అనిర్వచనీయమైన ఆనందముందని మనం తెలుసుకోవాలి . ఆ విధంగా నడుచుకోవాలి . అదీ ఈ పద్యానికి పరమార్థం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!