మాగాయ పచ్చడి పసందు : భాగవతం

మాగాయ పచ్చడి పసందు : భాగవతం

కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో

స్వర్ణభ్రాజిత వ్రేత దండకముతో సత్పింఛదామంబుతో

బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో

దూర్ణత్వంబున నేగె లేగలకునై దూరాటవీవీథికిన్.

.

పోతన భాగవతంలోని పద్యమిది . అందమైన కొలను . దాని నిండా తామర పూలు . చల్లని గాలి . ఆ గాలికి కొలనులోని నీరు తుంపరలుగా మారి గోపకుమారుల మీద పడుతోంది . తుంపరల తాకిడికి ఒళ్ళంతా గగుర్పాటుతో జలదరిస్తున్నది . కొలను చుట్టూ ఫలవృక్షాలు . వాటినిండా ఫలాలు . సేద తీరడానికి చెట్టు నీడ . ఆటలతో అలసిపోయిన శరీరాలు . విపరీతంగా ఆకలి వేస్తున్నది . లేగదూడలను పచ్చిక బయళ్ళలో స్వేచ్ఛగా వదలి వేసారు గోపబాలకులు .

లోకపాలకుడు గోపబాలురతో — చల్దులు తినడానికి అనువైన స్థలమూ , సరియైన సమయమూ కనుక తినడం మొదలు పెడదామని అన్నాడు . కొలనులోని తామర ఆకులే వారికి కంచాలైనాయి . తను తెచ్చుకున్న ఊరగాయలు పక్కవాడికి చూపించి ఊరిస్తూ తినే వాడొక్కడైతే , పక్కవాడి కంచంలోనిది తీసుకొని తినేవాడొకడు . వేళాకోళాలతో , తమకున్నది ప్రక్కనున్న స్నేహితులతో పంచుకుంటూ చద్ది ఆరగిస్తున్నారు ఆ గొల్లలు . గోపబాలకులలో తానూ ఒకడై చల్దులారగిస్తున్నాడు లోకపాలకుడు .

కవి సార్వభౌముడైన శ్రీనాథుని ఈ దృశ్యాన్ని వర్ణించమంటే

మిసిమి గల పుల్ల పెరుగుతో మిళితమైన:

ఆవపచ్చళ్ళు చవి చూచి రాదరమున:

జుఱ్ఱుమను, మూర్థములు తాకి,

యొఱ్ఱ దనముపొగలు వెడలింప నాసికాపుటములందు

అని అంటాడు .

చల్దులారగిస్తున్న కన్నయ్యను కనుల ముందు నిలుపుకోగలిగితే ధన్యులమవుతాము .

ఇంతలో గోపాలకులకు తము తీసుకొచ్చిన ఆవులు కనిపించలేదు . మిగిలిన వారిని అక్కడే ఉండమని తను గోవులను వెదకడానికి బయలు దేరాడు పరమాత్మ . అలా బయలుదేరిన కృష్ణపరమాత్మను వర్ణించే పద్యమిది .చెవులవరకూ వేలాడే జులపాలు . మెరుస్తున్న బంగారు హారాలు . అదే బంగారు రంగులో చేతిలోని వెదురుకఱ్ఱ . తనదైన ట్రేడ్ మార్క్ నెమలి పింఛం . చల్ది తింటూ లేచాడు కనుక హస్తభూషణంగా మారిన ఎరుపు రంగు మాగాయ ముద్ద . అమాయకులయిన గొల్లపిల్లల మధ్యన అల్లరి చేస్తున్నాడు కనుక అనూహ్యమైన ఉత్సాహం . పద్యంలో తను ఊహించిన కృష్ణుని మన కనుల ముందు పెట్టాడు కవిత్వంలో సాటిలేని కవీశ్వరుడు . దీనిని దృశ్యంగా మలుచుకొని కృష్ణున్ని చూడండి . కరుణామయుడు తప్పక కనులముందు తారాడుతాడు .

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ

బంగరు మొలత్రాడు పట్టుదట్టి

సందిట తాయతలును సరిమువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు

అనే పద్యం జ్ఞాపకం రావడం లేదూ . అలాగే

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష:స్ధలే కౌస్తుభమ్

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్

సర్వాంగే హరి చందనం చ కలయం , కంఠే చ ముక్తావళీ 

గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ

అనే శ్లోకం చిన్ని కృష్ణుని రూపాన్ని మన కంటిముందు నిలబెడతాయి .

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!