అన్నమాచార్య కీర్తనలు.!

అన్నమాచార్య కీర్తనలు

ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది

యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!!


ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది

యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది

యీ పాదమే కదా యెలమి( బెంపొందినది

యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!!


యీ పాదమే కదా యిభరాజు దల(చినది

యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది

యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది

యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!!


యీ పాదమే కదా యిహపరము లొసగెడిది

యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది

యీ పాదమే కదా యీక్షింప దుర్లభము

యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!!



బ్రహ్మ కడిగిన –పాదము

బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!!


1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము

బలితలమోపిన పాదము

తల(కక గగనము దన్నిన పాదము

బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!!


2.కామిని పాపము గడిగిన పాదము

పాము తలనిడిన పాదము

ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము

పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!!


3.పరమ యోగులకు( బరిపరి విధముల

పరమొస(గెడి నీ పాదము

తిరువేంకటగిరి తిరమని చూపిన

పరమ పదము నీ పాదము


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!