కాకికి కాకీక కాక కాకికి కోక కైకు?

కాకిగోల.!

నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు మాష్టారు 'కాకి - కోకిల' ల మధ్య కనిపించే సారూప్య, వ్యత్యాసాలని వివరిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పేవారు:

కాకః కృష్ణః పికః కృష్ణః 

కో బేదః పిక కాకయో: 

వసంత కాలే సంప్రాప్తే 

కాకః కాకః పికః పికః

దీని అర్థం ఏంటంటే : కాకి నల్లగా ఉంటుంది . కోకిల కూడా నల్లగా ఉంటుంది . కానీ వసంత కాలంలో కాకి గొంతు లోని కాఠిన్యం, కోకిల గొంతులోని మాధర్యం సులువుగా గుర్తించ వచ్చు .

ఆ రోజుల్లోనే మా స్నేహితులు ఈ క్రింది వాక్యానికి అర్థం చెప్పమనేవారు:

కాకికికాకీకకాకకాకికికోకేల ?

పై వాక్యాన్ని అర్థవంతంగా విడగొడితే ఈ విధంగా వ్రాయ వచ్చు:

కాకికి కాకీక కాక కాకికి కోకేల ?

అంటే దీని అర్థం: కాకికి దాని తాలూకు ఈకలే చీరగా (కోక) ఉపయోగ పడినప్పుడు, ఆ కాకికి వేరే చీర (కోక) అవసరం ఏముంది?

నేను హైదరాబాదీయుడిని కాబట్టి పై వాక్యానికి కాస్త ఉర్దూ మిలాయించి ఇలా రాసాను:

కాకికి కాకీక కాక కాకికి కోక కైకు? 'కైకు' అంటే అర్థం చెప్పక్కర లేదనుకుంటా. ఎలా ఉంది?

పోతే, (ఎవరూ అని అడక్కండి) మన పట్టణ వాసులకి కాకుల కలకలారావాల తోటే తెల్లారుతుందని నా అభిప్రాయం . ఎందుకంటే , ఇక్కడ కోళ్ళూ కనిపించవూ, వాటి కూతలూ వినిపించవూ కాబట్టి .

మళ్ళీ బాల్యం లోకి వెళ్తే , ఒకే జామ కాయని 'కాకి ఎంగిలి' చేసి మిత్రులతో పంచుకోవడం మనకి అనుభవమే కదా !

'అనగనగా ఒక కాకి . ఆ కాకికి దాహం వేసింది , ఎక్కడా నీళ్ళు లేవు , ఒక్కచోట ఒక కుండలో అడుగున కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, కాని అవి కాకికి అందలేదు , అప్పుడు కాకి అలోచించి కొన్ని గులకరాళ్ళు తెచ్చి కుండలో వేసింది , అప్పుడు నీళ్ళు పైకి వచ్చాయి , అప్పుడు ఆ కాకి అ నీళ్ళు తాగేసి హాయిగా ఎగిరిపోయింది .' ఈ కధ మన చిన్నప్పుడు మన అమ్మమ్మలూ , నాయనమ్మలూ చెప్తే, లాజిక్కులు అడక్కుండా విని ఆనందించాము . అదే ఇప్పటి కాకి అయితే గులకరాళ్ళ కోసం చూడకుండా ఒక స్ట్రా తీసుకొని కుండ లోని నీళ్ళని తాగుతుందని ఈ మధ్య ఎవరో ఇంటర్నెట్ లో సచిత్రంగా వివరిస్తే చూసి తరించాను . వీటిని బట్టే 'కాకమ్మ కధలు' పద ప్రయోగం వాడుక లోకి వచ్చిందేమో!

సర్కారు వారు చేస్తున్న అభివృద్ధి వివరిస్తూ, వాళ్ళు మనకు చెప్పే అంకెల గారడీలు 'కాకుల లెక్కలు' కాదంటారా?

'కాకుల లెక్కలు' అంటే చిన్నప్పటి మరో విషయం గుర్తుకొస్తోంది:

ఒక అబ్బాయిని మరో అబ్బాయి ఇలా అడిగాడు - ఒక చెట్టు మీద పది కాకులు కూర్చున్నాయి. అందులో ఒక కాకిని తుపాకీ తో కాల్చావనుకో . ఇంకా ఆ చెట్టు మీద ఎన్ని కాకులు ఉంటాయి?

ఈ ప్రశ్నకి ఆ మొదటి వాడు 'తొమ్మిది' అని చెప్తే వాడ్ని ఓ అట పట్టించకుండా వదలరు కదా . ఇప్పుడు అటువంటి అమాయకపు పిల్లలు లేరనుకోండి.

'పంచతంత్రం లో కూడా ఈ 'కాకమ్మ' కథల ప్రస్తావన ఉంది. ఇది పిల్లలకి సుపరిచితమే .

సుమతీ శతకం లో కూడా కాకుల ప్రస్తావన ఉందండోయ్ !

'అల్లుని మంచితనంబును 

గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ 

బొల్లున దంచిన బియ్యము 

దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ'

సుమతీ శతక కారుడు పై నాలిగింటినీ అరుదైనవిగా చెప్పుకొచ్చాడు. ముగింపుగా కాకులన్నీ నల్లగానే ఉంటాయని తేల్చి చెప్పాడు .

పోచికోలు కబుర్లతో కొందరు కాలక్షేపం చేస్తుంటారు . ''ఏమిటర్రా మాట్లాడుకుంటున్నారు?' అంటే , 'ఏముందీ , ఏవో కాకమ్మ కబుర్లు' అన్న జవాబు వస్తుంది.

బయటి వాళ్ళకి అనిపించినా , అనిపించక పోయినా , ఎవరి పిల్లలు వాళ్ళకి నచ్చుతారు కదా . 'కాకి పిల్ల కాకికి ముద్దు' కాదూ ?

తన, మన అనే వాళ్ళు లేకుండా ఒంటరి జీవితం గడిపే వాళ్ళని 'అతనికి ఎవ్వరూ లేరు, అతను 'ఏకాకి' అంటాము కదా .

ఒక వ్యక్తి గురించో, అతని వ్యక్తిగత సమస్యల గురించో చుట్టుపక్కల వాళ్ళు పలు రకాలుగా మాట్లాడుతూంటే 'లోకులు కాకులు' అనడం మామూలే .

ఏదో సాయం కోరుతూ మనం ఎవరింటికైనా వెళ్ళామనుకకోండి. వాళ్ళేమంటారో తెలుసా? మీకెందుకండీ శ్రమ, కాకితో కబురెడితే నేనే వచ్చే వాడ్ని కాదూ - అని.

రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవలు ఉంటే, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు - అంటారు కదా . 

'కాకి దొండ' అని ఓ కూరగాయ కూడా ఉందిట . కాని నాకు దాన్ని చూసే అవకాశం రాలేదు.

జిలుగు వెలుగులతో ధగధగా మెరిసిపోయే వస్త్రాభరణాలని 'కాకి బంగారం' అని చెప్పడం మనకు తెలుసు. 

ఒక కాకికి ఏదైనా ఆపద కలిగితే మిగతా కాకులన్నీ అరిచి గోల పెడుతూ వాటి సమైఖ్యతని చాటుకుంటాయి . 

ఇంట్లోనో , స్కూల్లోనో పిల్లలు బాగా గోల చేస్తుంటే, ' ఆపండి మీ కాకి గోల ' అంటాము కదా .

ఏ జంట అయినా ఈడు జోడు సరిగ్గా లేకపోతే వాళ్ళని కాకి ముక్కుకు దొండపండులా ఉన్నారని అంటాము . 

మన పురాణాల్లో కాకిని శని దేవతకు వాహనముగా వర్ణించడం మనకు తెలుసు.

కాకిలా కలకాలం బతికే కన్నా హంస లా ఆర్నెల్లు బతికినా చాలు - అనే ప్రయోగం మనం తరచూ వాడుతుంటాం కదా .

ఎవరికైనా ఆకస్మిక మరణం సంభవిస్తే దాన్ని 'కాకి చావు' అంటారని ఓ నిఘంటువులో వివరించారు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!