పాండురంగ మాహాత్మ్యము!..... ....తెనాలి రామకృష్ణకవీంద్రుడు .!


పాండురంగ మాహాత్మ్యము!..... ....తెనాలి రామకృష్ణకవీంద్రుడు .!

.

ఈ చిగురాకు నీప్రసవ మీపువుఁ దేనియ యెంత యొప్పెడిన్

జూచితిరే యటంచుఁ దనచుట్టు శుకాదులుఁ గొల్వగాఁ గప

ర్థాంచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖ వే

దాచల మంత్రికీర్తి కలశాబ్ధిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్.

.

శివుడు తన కృతిభర్తను పాలించు గాక యన్న యాశీర్వచనము.

శివుడు కల్పవృక్షము. శుకమహర్షి మొదలైనవారీ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు.

శివుని జుత్తు – జడముడి – చివురాకు. చంద్రుడు పువ్వు. గంగ తేనియ.

.

ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా

విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యానల ప్రౌఢి నీ

కెదురేరీ? సరసార్థ బోధఘటనాహేల పరిష్కార శా

రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా!

.

తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణ సముద్రము, ఉత్తరాన హిమాలయ పర్వతం – ఈ నాలుగు ఎల్లల మధ్య గల యావద్భారతదేశంలో మహాంధ్ర కవితా విద్యలో, ఓ రామకృష్ణకవీంద్రా, నీ అంతటి మహాకవి వేరొకరు ఎవరు? ఎవరూ లేరు. సరసమైన అర్థబోధ ఘటించెడి ఒయ్యారపు నగలు గల సరస్వతీ దేవి నీ రూపము! అని విరూరి వేదాద్రి మంత్రి అన్నాడని పాండురంగమాహత్మ్యము అవతారికలో రామకృష్ణకవీంద్రుడు చెప్పుకున్నాడు. కృతి స్వీకరించే సందర్భంలో వేదాద్రి మంత్రి మహాకవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైన పద్యంలో వర్ణిస్తున్నాడు.

.

పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చె

క్కులఁ బోలుం దెలనాకులయ్యువిద పల్కుల్వంటి కప్రంపుఁ బ

ల్కులతోఁ గూడిన వీడియంబొసఁగు నాకుం బద్మనాభార్చనా

కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్

.

సరస్వతీదేవి (పలుకుల తొయ్యలి) పెదవుల (మోవి) కాంతికి సమానమైన (ఎనయౌ) పోకచెక్కలు (బాగాలు); [మౌళి కాంతి కెనయౌ - అనే పాఠాంతరం కూడా ఉంది.

సర్వశుక్లాం సరస్వతీ అన్నారు; ఆవిడ ఆపాదమస్తకం తెలుపేనట!] 

ఆ ఇంతి చెక్కులను పోలే పండుతమలపాకులు (తెలనాకులు); [తమలపాకుల్లో కవటాకులెంత భోగమో పండుటాకులు అంతకంటే భోగమట] 

ఆమె పలుకులవంటి పచ్చకర్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాడట. ఏ చేతులతో అయితే పద్మనాభస్వామిని నిత్యం అర్చిస్తాడో ఆ చేతులతో – 

కంకణాలు ఝణఝణ ధ్వనులు చేస్తున్న ఆ హస్తాలతో ఈయనకి తాంబూలం అందించాడట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!