రావణ సంహారము:

రావణ సంహారము:

అనఘుం డుజ్జ్వల చాప దండమున బ్రహ్మాస్త్రంబు సంధించి యొ

య్యనఁ గర్ణాంతముగాఁ గడున్ దివిచి ప్రత్యాలీఢ పాదస్థుడై

దనుజాధీశ్వరు బాహుమధ్యము వడిం దాకంగ లక్ష్యంబుగాఁ

గొని బిట్టేసె నదల్చి తీవ్రతరమౌ కోపంబు దీపింపగన్.

(అనఘుండు = అఘములేనివాడు, పుణ్యాత్ముడైన శ్రీరాముడు; ఉజ్జ్వల చాప దండము = ప్రకాశిస్తున్న ధనుస్సు; కర్ణాంతముగా కడున్ దివిచి = చెవులవరకు వింటినారిసి సారించి; ప్రత్యాలీఢ పాదస్థుడై = శరసంధానము చేయునప్పటి భంగిమ; దనుజాధీశ్వరు = రాక్షసేశ్వరుడైన రావణుని; బాహుమధ్యము = రెండుచేతుల మధ్యన గల నాభిప్రదేశము; వడిన్ = వేగముగా; లక్ష్యంబుగా గొని = గురిచూసి; బిట్టేసె = బాణముతో కొట్టెను; తీవ్రతరమౌ = తీక్షణమైన; దీపింపగన్ = ప్రజ్వలిస్తుండగా)

భావము: రాఘవుడు తీవ్రమైన ఆగ్రహం ప్రజ్వలిస్తుండగా, ప్రకాశించే తన కోదండమునందు బ్రహ్మాస్త్రమును ఎక్కుపెట్టి, ప్రత్యాలీఢభంగిమలో నిలబడి, ఆకర్ణాంతము నారి సారించి, దశకంఠుని నాభిప్రదేశమునకు గురిచూసి, వేగముగా వెళ్ళి తాకేటట్లుగా బాణమును వదలినాడు.

ఆ వ్రేటు వడిగ నాటిన

రావణు డతివివశు డగుచు వ్రాలె ధరిత్రిన్;

దేవతతి పొగడి యప్పుడు

పూవులవర్షంబు గురిసె భూవరు మీదన్.

(వ్రేటు = దెబ్బ; నాటిన = తాకిన; వివశు డగుచు = తనను తాను నిలువరించుకోలేక సోలిపోయి; వ్రాలె = పడిపోయెను; దేవతతి = సురల సమూహము; భూవరుడు = రాముడు)

భావము: బ్రహ్మాస్త్రపు వ్రేటునకు గురియైన రావణుడు వివశుడైపోయి, ధారుణిపై వ్రాలి, అసువులు వదిలినాడు. అప్పుడు దేవతలందరు శ్రీరాముణ్ణి స్తుతించి, ఆయనపై పుష్పవర్షమును కురిపించినారు.

(రామాయణము, యుద్ధకాండము - మొల్ల.....వివరణ ..Satyanarayana Piska గారు..)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!