చాయాదేవి శాపం !

చాయాదేవి శాపం !

శ్రీమతి శారద పోలంరాజు గారికి కృతజ్ఞలతో.)

.

విశ్వకర్మ కూతురు సంజనకు (సంఙ్ఞ) సూర్యునితో వివాహం జరుగుతుంది. ఆమెకు మొదట మనువు, తరువాత యమ యమున అనే కవలలు జన్మిస్తారు.

ఆమె సూర్యుని కాంతి వేడిమి భరించ లేకపోతుంది. ఆమె శరీరము కూడా మసిబారినట్టు అయిపోయి సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఉండే చీకటి రంగులోకి మారిపోవడం చేత దేవతలు ఆమెను సంధ్య అని అన్నారు.

బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణాల ప్రకారం.........

సంధ్యకు వైవశ్వంతమనువు తరువాత యమున యముడు కవలలుగా జన్మిస్తారు.

ఏ విధంగానైనా ఆ వేడిమిని తప్పించుకోవాలనుకున్న సంధ్య తన అంశతో ఛాయ అన్న మరో రూపం సృష్టించి తాను తిరిగి వచ్చే వరకు తన బిడ్డలను చూసుకుంటూ సూర్యుడిని ఏ మాత్రమూ వదలకుండా వెన్నంటి తిరగమని ఆఙ్ఞాపించి తన ముగ్గురు పిల్లలను ఆమెకు అప్పగించి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది.

ఛాయకు ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. మొదటివాడు శ్రుతశ్రవుడు అతను సావర్ణి మనువుగాను, రెండవవాడు శ్రుతకర్మ శనిగ్రహంగానూ ప్రఖ్యాతి చెందుతారు.

సంధ్యముగ్గురు పిల్లలని సరిగ్గా చూడక ఛాయ సవతి బుద్ది చూపించుకుంటుంది.

పెద్దవాడైన మనువు పట్టించుకోడు కాని యముడు కోపం తో ఆమెను కాలితో తంతాడు.

ఛాయ కోపంతో "తల్లినైన నన్ను ఏ కాలితో తన్నావో ఆ కాలు పడిపోతుంది." అంటుంది.

ఆమె శాపానికి బాధపడ్డ యముడు తండ్రి వద్దకు వెళ్తాడు. "తన్నటానికి కాలు ఎత్తాను కాని నా కాలు ఆమెకు తగల లేదు." అని మొరపెట్టుకుంటాడు.

అంత వరకు సంధ్య ఛాయల వృత్తాంతము తెలియని సూర్యుడు భార్య వద్దకు వెళ్ళి, "సంతానం అందరినీ సమానంగా చూడవలసిన తల్లివి ఈ విధంగా ఒకరిని ఎక్కువగానూ ఒకరిని తక్కువగానూ చూడదగునా? ఏమిటి కారణము?" అని నిలేసి అడిగేటప్పటికి అసలు రహస్యం బయటకు వస్తుంది.

యముడిని ఓదార్చి, "తల్లి నోటి నుండి వచ్చిన శాపం అనుభవించక తప్పదు. విరిగి కింద పడ్డ పాదము క్రిములచేత తినబడ్డ తరువాత శాప విమోచనము అవుతుంది. ఎవరు చేసుకున్న కర్మఫలము వారు అనుభవించాల్సిందే." అంటాడు సూర్యుడు.

తండ్రి మాటలకు వైరాగ్యం కలిగిన యముడు గోకర్ణం వద్దకు వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు.

ఆ తపస్సుకు సంతసించి శివుడు ప్రత్యక్షమైతాడు. పరమేశ్వరుని నుండి లోకపాలకుడుగా ఉండి ప్రజల ధర్మాధర్మములకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించే వరము పొంది శాపం నుండి విముక్తి పొందుతాడు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!