భర్తృహరి ! - విక్రమార్కుడి కథలు......5


భర్తృహరి !

-

విక్రమార్కుడి కథలు......5


చాందోగ్యరుషి ఇచ్చిన దివ్య ఫలం భర్తృహరి తన పట్టపురాణి మోహనాంగికి ఇచ్చాడని చెప్పుకున్నాము కదా.......

తరువాత ఏమయిందో తెలుసుకుందామా?


తాను అమితంగా ప్రేమిస్తున్న మోహనాంగి అసలు గుణము రాజుకు తెలియదు. 

ఆమె అతను అనుకున్నంత ఉత్తమురాలు కాదు. ఆమెకు సాహిణి అనే రధ సారధితో రహస్య సంబంధం ఉంటుంది.


మరునాటి ఉదయం మోహనాంగి, రహస్యంగా సాహిణికి ఆ పండునిచ్చి అతనిని తినమంటుంది.


తన అవసరాలకు రాణిని వాడుకుంటున్న ఈ రధసారధి సాహిణికి రాజ ప్రసాదంలో రాజాంతఃపురాన్ని శుభ్రం చేసే పరిచారికతో రహస్య సంబంధం ఉంటుంది. సాహిణి పరిచారికకి పండునిచ్చి, దాని ప్రత్యేకతని చెప్తాడు.


ఆ పరిచారిక "సరే! ఇంటికెళ్ళి స్నానం చేశాక, ఈ పండు తింటాను" అని పండును తీసుకుంటుంది.


పేడ గంప మీద పెట్టుకొని, గంప నెత్తిన పెట్టుకుని, ఇంటికి బయలు దేరిన ఆమె రాజవీధిలో నడిచి పోతుండగా రాజ ప్రాసాదపు మీద చల్లగాలిని ఆస్వాదిస్తూ, పచార్లు చేస్తూ ఉన్న భర్తృహరి పరిచారిక నెత్తి మీది గంపలో పేడ మీద దివ్యఫలం చూస్తాడు.


మరుక్షణమే దాన్ని అతడు గుర్తు పడతాడు. అతడికి చాలా ఆశ్చర్యం కలిగింది. తాను పట్టపు రాణి కిచ్చిన దివ్యఫలం ఈ పేడ గంపలోకి ఎట్లా వచ్చింది? భర్తృహరి వెంటనే భటులని పిలిచి, ఆ పరిచారికని తన రప్పించమని అజ్ఞాపిస్తాడు.


భర్తృహరి ఆమెను "చూడమ్మా! ఈ పండు నీకెక్కడిది?" అని అడుగుతాడు.


పరిచారిక గడగడ వణుకుతూ "మహారాజా! క్షమించండి! అంతఃపుర రధసారధి సాహిణి నాకీ పండునిచ్చాడు. అతడికిది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు" అంటుంది.


రాజు సాహిణిని పిలిపిస్తాడు. అక్కడున్న పరిచారికనీ, దివ్యఫలాన్ని చూసే సరికే, సాహిణికి పైప్రాణాలు పైనే పోతాయి. అతడికి అంతా అర్ధమయ్యింది.


ఇంక రహస్యం దాచిపెట్టి లాభం లేదని గ్రహించి భయంతో వణుకుతూ రాజు పాదాలపై పడతాడు. "మహారాజా! దయ చేసి నన్ను క్షమించండి. మహారాణి మోహనాంగీ దేవి నాకీ పండునిచ్చింది" అంటాడు.


రథసారధి వాలకాన్ని బట్టి, భర్తృహరికి నిజం తెలిసి పోతుంది. రధసారధినీ, పరిచారికనీ మన్నించి పంపించి వేస్తాడు.


పరిచారిక నుండి పండుని తీసుకొని దాచిపెట్టుకొని రాణీ వాసానికి వెళ్తాడు. 

జరిగినవేమీ తెలియని మోహనాంగి ‘వేళ కాని వేళ ఎందుకు వచ్చాడా?’ అని మనస్సులో ఆలోచిస్తూ రాజుకు స్వాగతం పలికింది. 

భర్తృహరి "మోహనాంగీ! నిన్న నీకు నేనొక దివ్య ఫలాన్ని ఇచ్చాను కదా? అది ఎక్కడ?" అని అడుగుతాడు.


మోహనాంగి "ఇంకా ఎక్కడి పండు మహారాజా. నిన్ననే దానిన ఆరగించాను మహాప్రభూ!" అంటుంది.


భర్తృహరి "అయితే మరి ఇది నా చేతికి ఎలా వచ్చింది?" అని దాచి ఉంచిన పండు బయటకు తీస్తాడు. భర్త చేతిలో పండుని చూసి మోహనాంగికి ఏం జరిగి ఉంటుందో, ఏం జరగ బోతోందో అర్థమయిపోతుంది. 

నిజం దాచి ప్రయోజనం లేదనిపించి భర్త పాదాల మీద వ్రాలి క్షమించమని ప్రార్దిస్తుంది.


భర్తృహరి స్వయంగా పండితుడు. జ్ఞాని. ఎవరి మీదా కోపం రాలేదు. ఇహలోకం మీద మాత్రం విరక్తి కలిగింది. అతడు తన భార్యల నందరినీ పిలిచి, "నేను అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోవాలని నిశ్ఛయించుకున్నాను. ఈ క్షణమే మిమ్మల్ని త్యజిస్తున్నాను. మీరు మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. మీ నగలను, ఇతర సంపదను తీసుకుని, మీకు ఇష్టమైన వారిని వివాహమాడి, సుఖంగా ఉండండి" అంటూ రాణీ వాసపు స్త్రీలందరికీ అనుమతి నిచ్చి, విక్రమాదిత్యుని రాజు గానూ, భట్టిని మంత్రిగానూ పట్టాభిషిక్తులని చేసి, సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. దివ్యఫలం భుజించి, తపస్సుకై అడవులకు వెళ్ళిపోతాడు.


ఆ మహనీయుడు రచించిన సుభాషితాలు ఈ నాటికి మనం చదువుకుంటూనే ఉన్నాము.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!