----------------స్త్రీ స్వేచ్చ ----------------------- ... ..చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట)..

----------------స్త్రీ స్వేచ్చ -----------------------

... ..చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట)..


-


స్త్రీల సామాజిక దుస్థితి గురించి,వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలని గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం.(చలం అనే పేరు తో ప్రాచుర్యం).


చలం సాహిత్య ప్రభావం బలమైనది.

తెలుగు సాహిత్యం లో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరు.స్త్రీ పురుష సంబందాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించ లేదో,ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత 

చలం.పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహు ముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి మరీ చూపినవాడు చలం.


పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగిన వాడు చలం. సాహిత్యం లో శశిరేఖ,అరుణ,వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను చిరస్థాయిగా ఉంచిన వాడు చలం.

అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం "మైదానం". ఈ మైదానం నవలని చలం 1925 లో రాశారు.మైదానం నవల చాలా చర్చలను రేపింది.ప్రతికూల విమర్శల నెదుర్కొన్నది.స్త్రీ స్వేచ్చ మీదా,స్త్రీ పురుషుల సంబందాల మీదా కొత్త సిద్ధాంతాలు చేసింది

.ఈ నవల వివాదాస్పదంగా మారడానికి కారణాలేమిటి?


ఒక సంప్రదాయ బ్రాహ్మణ గృహిణి ఒక ముస్లింతో కలిసి 

వెళ్లిపోవడం మాత్రమేనా? కాదు ..

తనకి నచ్చిన మనిషితో వెళ్లిపోయి మైదానం కధానాయిక 

రాజేశ్వరి ఎలా బతికి ఉన్నా ఇంత గొడవ జరిగేది కాదు.

ఆమె తన చర్య తోపాటు అభేద్యమైనదని సంప్రదాయ వర్గాలు అనుకుంటూ ఉన్న వివాహ వ్యవస్థ ఎంత లొసుగులతో ఉందో 

వివరం గా మాట్లాడుతుంది.

పవిత్రమైనవంటూ ప్రచారం చేసే దాంపత్య సంబంధాలలోని 

బోలు తనాన్ని నిగ్గదీసి అడుగుతుంది. 

ఇందుకూ- ఈ పుస్తకం సమాజాన్ని ఎక్కువ కలవరపరచింది.



ఎన్ని విప్లవాలు నడచినా పర్వాలేదు కానీ ,

కుటుంబ వ్యవస్థ కూలిపోతుంటే మాత్రం ...దాన్ని ఆధారం గా 

చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుష ప్రభుత్వాలకు 

విపరీతమైన భయం పుడుతుంది.

అందువల్ల తమ మధ్య ఉండే సైద్ధాంతిక విభేదాలన్నీ 

కూడా వదిలేసి ఈ విషయంలో అన్ని వర్గాలకు చెందినవారూ 

ఏకమై ముక్తకంఠంతో ఇటువంటి రచనల పట్ల వ్యతిరేకతను కనబరుస్తారు.సంప్రదాయానికి ఉనికిపట్టులైన  యునివర్సిటీ 

వాళ్ళు మైదానం పుస్తకానికి బహుమతి ప్రకటించడానికి భయపడ్డారు.

.

చలం మైదానానికి సమాధానంగా 


1933 లోవిశ్వనాథ సత్యనారాయణ "చెలియలికట్ట" అనే నవల రాశారు.

60లలొ గోపీచంద్ కూడా చలం భావజాలం మీదనే స్పందించి

 "గడియ పడని తలుపులు","మెరుపులమరకలు","గతించని గతం" వంటి పుస్తకాలు రాశారు. 

చెలియలికట్ట లో నాయిక రత్నావళి, ఆమె మరిది

 (చలం భావాలకు ప్రేరేపితుడై జీవించిన) రంగారావూ 

నవల చివరిలో ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రం లోకి కలిసికట్టుగా పోతారు.

.

గోపీచంద్ రాసిన గడియపడని తలుపులు నవలలో కూడా ఆధునిక వేషం తో స్వేచ్చగా సంచరించినట్టు రచయిత చిత్రించిన నాయిక కోటేశ్వరమ్మ నవల చివరిలో పశ్చాత్తాపంతోనే సనాతన ధర్మం వైపు మల్లి కృశించి చచ్చిపోతుంది.


మైదానం లో చలం కధానాయిక రాజేశ్వరి విసిరిన 

సవాళ్ళకు బదులుగా ఒక రత్నావళిని తయారు చేసిన

 బహు దిట్టమైన రచన విశ్వనాథ వారి చెలియలికట్ట మాత్రమే.


అందుచేత చలం మైదానాన్ని,విశ్వనాథ చెలియలి కట్టనీ 

రెండింటినీ తీసుకుని, అవి రెండూ స్త్రీ స్వేచ్చ కోసం చూపిన మార్గాల బలాబలాలను ఇక్కడ చర్చిద్దాం. 


మధ్య తరగతి వర్గం అతి ముఖ్యమైనవిగా స్త్రీలకి నూరిపోసిన

 "పరువు-ప్రతిష్ట " ఈ రెంటినీ గంగలో కలిపి బ్రాహ్మణ గృహిణి రాజేశ్వరి - సంసారంలో తనకి అన్ని హంగులూ అమర్చగలిగిన లాయర్ భర్తనీ,తన కుటుంబాన్నీ,తాను జీవించే సమాజాన్నీ వదిలి పెట్టి ,సమాజం లో గౌరవించగలిగే అర్హతలేవీ లేని అమీర్ అనే డబ్బులేని తక్కువ రకం తురక వాడితో పురుష సమాజ పరిభాషలో "లేచిపోతుంది".


సరిగ్గా ఈ వాక్యం తోనే మైదానం నవల మొదలవుతుంది.

అలా తాను కలిసి వచ్చేసిన అమీర్ తననెంత ఘాడంగా ప్రేమిస్తాడో ..... తామిద్దరూ కలిసి మైదానంలో ఏ మిధ్యా గౌరవాలకూ ప్రాధాన్యత లేని చిన్న గుడిసెలో... దాని పక్క నదీ తీరంలో స్వేచ్చగా అనుభవించిన శృంగారానుభావాలన్నీ నవల ఆసాంతం రాజేశ్వరి తన స్నేహితురాలితో కధగా చెప్తుంది. 

అంతే కాకుండా స్త్రీ మనసులో కూడా ఏకకాలంలో ఒకరి కన్నా ఎక్కువ మంది మీద ఇష్టం కలిగే అవకాశం ఉందంటూ తాను అమీర్ తోపాటు మీరా అనే మరొక ముస్లిం కుర్రాడిని అభిమానించిన విషయం,దానితో తన జీవితం లో ఎదురైన కల్లోలమూ.... దాని పర్యవసానమూ కధలో వివరిస్తుంది.ఇదీ మైదానం నవల.

.

ఇక చెలియలికట్టలో సీతారామయ్య రెండో భార్య రత్నావళి 

ముందు భార్య రత్నమ్మ చనిపోతే రత్నావళితో అతనికి మళ్ళీ 

పెళ్లి జరుగుతుంది. సీతారామయ్య తమ్ముడు రంగారావు (రంగడు) ను అతికష్టం మీద డబ్బులు పంపి లక్నోలో చదివిస్తుంటాడు.

ఈ రంగారావు ఆధునిక భావాలను పెంచుకుంటూ అటు పాశ్చాత్య రచయితలనీ,ఇటు పాశ్చాత్య భావాలు పలికే (చలం వంటి)

 తెలుగు రచయితలనీ చదివి ఆ స్త్రీ స్వేచ్చా భావాలన్నీ 

కెక్కించుకుని సనాతన ధర్మాలకు దూరం కావడమే కాకుండా, 

తన అన్న భార్య అయిన రత్నావళికి కూడా తాను చదివే పుస్తకాలిచ్చి, తన భావాలన్నీ నూరిపోసి ఆమెలో విప్లవ భావాలను నాటుతాడు.

వీటన్నిటి మూలంగానే ఆమె సీతారామయ్య పట్ల విముఖురాలై రంగడితో మదరాసు "లేచి" వచ్చేస్తుంది.ఇక ఇక్కడి నుంచి రత్నావళి రంగడి సిద్ధాంతాలు ఎలా తప్పుల తడకలో నిరూపించడం కోసం పేజీ పేజీ లోనూ వాదనలను పెంచుకుంటూ పోతుంది.

చివరికి ఆమెకి చదువు చెప్పడానికిసాక్షాత్తూ

విశ్వనాధసత్యనారాయణ గారే ముకుందరావు అనే పాత్ర గా ప్రవేశించి రత్నావళి లో రంగడి సిద్ధాంతాల పట్ల ఏర్పడిన చులకన భావాలకు నీరు పోసి,మరింతగా పెంచి తన వాదనాపటిమతో, బోధనా గరిమతో రత్నావళిని తిరిగి సనాతన ధర్మం వైపు మళ్ళించి తనంత దానిగా తయారు చేస్తారు.

రత్నావళి నవలలో చివర్లో మాట్లాడినవన్నీ ఈ ముకుందరావు మాటలే.చేసిన నిర్ణయాలన్నీ ముకుందరావు చూపిన మార్గానికి నడవడం కోసం చేసినవే.ఒకసారి వివాహవ్యవస్థ కాదని కాలు బయటపెట్టిన ఆడదానికి మరణం లో తప్ప నిష్కృతి లేదు కనుక, రత్నావళి నవలచివర్లో ఈ సంగతి మిగతా పాత్రలతోనూ

(పాఠకుల తోనూ) చెప్పి మరీ చనిపోతుంది. 

చనిపోయే ముందు ఆమె తాను విడిచివచ్చిన సీతారామయ్య

 కాళ్ళ మీద పడుతుంది.

మద్రాసులో విదుషీమణి (తెలుగు టీచరు రత్నావళి)తాను సంపాదించిన డబ్బును ,తన భర్త మూడవ భార్య (రత్నావళి వెళ్ళిపోయాక సీతారామయ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు) 

రాజ్యలక్ష్మికి పుట్టిన కొడుకు పేర రాసి వాడు తనకి తద్దినాలు పెట్టేట్లుగా వాగ్దానం చేయించుకుని అప్పుడు చచ్చిపోవడానికి వెళ్ళిపోతుంది.

చివరికి ఆమె తోపాటు రంగారావు (చలం భావజాలాన్ని నమ్మినవాడు)కూడా తన తప్పులన్నీ ఒప్పుకుని రత్నావళితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఉప్పెన ముంచుకొస్తున్న 

సముద్ర తీరానికి వెళ్ళిపోతాడు.


క్లుప్తంగా ఇదీ కధ.



..................................................................................................

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!