వహీదా రెహమాన్‌!

వహీదా రెహమాన్‌!

-

వహీదా రెహమాన్‌ తెలుగమ్మాయి అంటారు కానీ

ఒరిజినల్‌గా తమిళనాడు ముస్లిము. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా

ఆంధ్రలో చాలాకాలం గడిపారు. ''రోజులు మారాయి'', ''జయసింహ'' సినిమాల నాటికి ఆయన విజయవాడలో మునిసిపల్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు.

తెలుగు ప్రాంతాల్లో పెరగడం వలన వహీదాకు తెలుగు బాగా వచ్చు. ''రోజులు మారాయి'' సినిమాలో 'ఏరువాక సాగారోయ్‌' పాటలో నర్తించింది. ఎన్టీయార్‌ ఆమెకు ''జయసింహ''లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర యిచ్చి నటింపజేశారు. ''మిస్సమ్మ'' సినిమాను హిందీలో తీయడానికి వీలుపడుతుందేమో చూద్దామని హైదరాబాద్‌ వచ్చిన గురుదత్‌ వహీదాను మెచ్చారు. ప్రత్యక్షంగా కలిసి తన

సినిమా ''సి ఐ డి''లో హీరోయిన్‌గా వేయడానికి హిందీ రంగానికి ఆహ్వానించారు. ఇది 1955లో జరిగింది.


''బాజ్‌'' తర్వాత గురుదత్‌ స్వంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ''ఆర్‌ పార్‌'' (1954), ''మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55''(1955) సినిమాలు హిట్‌ కావడంతో ''సి.ఐ.డి'' (1956) దేవ్‌ ఆనంద్‌, షకీలాలతో ప్లాను చేసి దాని దర్శకత్వాన్ని తన శిష్యుడు రాజ్‌ ఖోస్లాకు అప్పగించి తను పర్యవేక్షించాడు.

ఈ సినిమాలోనే గురుదత్‌ వహీదా రెహమాన్‌ను హిందీ తెరకు పరిచయం చేశాడు. 

అంతకుముందు ఆమె నటించిన ''జయసింహ'', ''రోజులు మారాయి'' తెలుగులో వచ్చాయి కాబట్టి దేశంలో ఎవరికీ ఆమె గురించి పెద్దగా తెలియదు. ఈ సినిమా నిర్మాణంలోనే అప్పటికే వివాహితుడైన గురుదత్‌ వహీదాతో ప్రేమలో పడ్డాడు. ఇస్తానన్న పారితోషికంతో బాటు ఆమెకు ఒక కారు బహుమతిగా యిచ్చాడు.


ఆమె హిందీ సినిమాలో ప్రసిద్ధ నటి అయ్యాక ఓ సారి మద్రాసు ఎయిర్‌పోర్టులో అన్నపూర్ణా నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఎదురైంది. 1951లో తెనాలిలో డాన్సు ప్రోగ్రాం యిచ్చిన రోజులనుండి యీయనకు తెలుసు. 'పెళ్లి చేసుకోబోతున్నానండి'' అందామె. 'శుభం, పెళ్లి చేసుకోబోయేముందు ఓ తెలుగు సినిమాలో నటించ కూడదా?'' అన్నారీయన. ''మీరు తీస్తానంటే నేను వేయనంటానా?'' అందామె సమాధానంగా.


యద్దనపూడి సులోచనారాణి రాసిన ఓ సీరియల్‌ ఆధారంగా ''బంగారు కలలు'' సినిమా తీస్తూ మధుసూదనరావుగారు నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌ వేషం ఆఫర్‌ చేశారు వహీదాకు. ఆమె సరేనంది. ఆ సినిమాలో ముఖ్యమైన చెల్లెలు పాత్రను లక్ష్మికి యిచ్చారు. కానీ అదే సమయంలో చలం నిర్మించిన మరో సినిమాలో కూడా లక్ష్మిది యిలాటి పాత్రే! పోలిక వస్తుందని భయపడి, హీరోయిన్‌గా లక్ష్మిని పెట్టుకుని చెల్లెలు పాత్ర వహీదాను వేయమంటే... అనుకున్నారు అన్నపూర్ణావారు.


అంత పెద్ద స్టార్‌ దిగివచ్చి వేషం వేస్తానంటే యిలా చెల్లెలు పాత్ర వేయమంటే ఏం బాగుంటుంది? అని జంకారు. ఏమైతే అది అయిందని ఆమెను కలిసి విషయం చెప్పారు. ఆమె కొద్దిసేపు ఆలోచించి ''నేను ఆర్టిస్ట్‌ను. చేసేది మంచి పాత్రా? కాదా? అని తప్ప హీరోయిన్‌గానే వేయాలన్న పట్టుదల నాకేమీ లేదు. నేను రెడీ'' అందామె.


ఆమె ఔదార్యం అంతటితో ఆగలేదు. తనతో బాటు మందీమార్బలం ఎవరూ లేకుండా ఓ టచప్‌ వుమన్‌ను తెచ్చుకున్నారామె. పాత్రకు కావలసిన కాస్ట్యూమ్స్‌, మేకప్‌ మెటీరియల్‌ బొంబాయినుండి తానే తెచ్చుకున్నారు. రిట్జ్‌ హోటల్‌లో రూము బుక్‌ చేస్తే ''ఎందుకండీ దండగ! నేను కూడా సారథీ స్టూడియోలో వుంటాను'' అంది. చివరకు ఆమెను ఒప్పించి 'బ్లూ మూన్‌' హోటల్లో బస ఏర్పాటు చేశారు. తెలుగు నటీనటులతో కూడా ఏపాటి భేషజం లేకుండా నటించారామె.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!