శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 051218)

శ్రీకృష్ణ శతకం🌹

(రోజుకు ఒక పద్యం 051218)


🏵️

ఆదివరాహుడవయి నీ

వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్

మోదమున సురలు పొగడఁగ

మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!

🏵️

భావం: 

మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో 

మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు.

ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; నీవు అంటే నువ్వు; ఆదివరాహుడవు అంటే విష్ణుమూర్తి అవతారంగా వరాహ రూపం ధరించి; ఆ దనుజున్ అంటే రాక్షసుడయినటువంటి ఆ; హిరణ్యనేత్రున్ అంటే హిరణ్యాక్షుడిని; హతున్ అంటే చంపి; తగన్ అంటే ఒప్పుగా; మోదమునన్ అంటే సంతోషంతో; సురలు అంటే దేవతలు; పొగడగన్ అంటే ప్రశంసించగా; మేదినిన్ అంటే భూమిని; గొడుగున్ + ఎత్తి అంటే గొడుగులాగ పెకైత్తి; మెరసితి అంటే ప్రకాశించావు. సకలజీవరాసులూ నివసించటానికి అనువైన భూమి నీటిలో మునిగి ఉన్నందున, దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు.


ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది.

ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.


🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏


Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!