🙏శ్రీ . గుర్రం జాషువా గారు.🙏

🌹మన సాహితీ ప్రముఖులు (18)🌹


🙏శ్రీ . గుర్రం జాషువా గారు.🙏


👉ఇచ్చోట; నే సత్కవీంద్రుని కమ్మని

కలము, నిప్పులతో గఱిగిపోయె

యిచ్చోట ; నేభూములేలు రాజన్యుని

యధికార ముద్రికలంతరించె

యిచ్చోట ; నేలేత ఇల్లాలి నల్లపూసల

సౌరు, గంగగలసిపోయె

యిచ్చోట ; నెట్టి పేరెన్నికంగొన్న

చిత్రలేఖకుని కుంచియనశించె

ఇది పిశాచులలో నిటలేక్షణుండు

గజ్జెగదలించి యాడురంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయ

నవని పాలించు భస్మ సింహాసనంబు


' కఠిన చిత్తుల దురాగతములు ఖండించి

కనికారమొలగించుకలమునాది '


అని ఎలుగెత్తి చాటారు


" నిమ్మజాతుల కన్నీటి నీరదములు

పిడుగులై దేశమును కాల్చివేయునని " హెచ్చరించారు


అస్పృశ్యులు పండించే ధాన్యం ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కాని ఆ ధాన్యం పండించే కృషికులకు ఆలయ ప్రవేశం కూడా లేదు అంటూ:

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని

దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్

మెతుకువిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే

వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులార్తురే '


అంటూ ధనవంతుల అపవ్యయాన్ని ఎండగట్టారు.

జాషువా కవి 1895 అక్టోబర్ 28 న వినుకొండలో జన్నించారు.

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:


గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.


1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.


1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.


కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు మున్నగు సత్కారాలెన్నో అందుకున్నారు. భారత ప్రభుత్వం ' పద్మ భూషణ ' తో గౌరవించింది. 1970 లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ' కళాప్రపూర్ణ ' ప్రశస్తినిచ్చింది. కవికోకిల కవితావిశారద, నవయుగ కవి చక్రవర్తి మున్నగు బిరుదములనిచ్చి సత్కరించారు రసజ్ఞులు.


ఆనాటి ఆస్థానకవి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి కవిగారు స్వయంగా గండపెండరము తొడగటంతో జాషువాగారెంతో సంతోషించారు.


సమకాలీన కవితాలోకంలో అందరి మన్ననలందుకొన్న జాషువా మహాకవి 24-7-1971న కన్నుమూశారు

🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!