🙏శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు . 🙏

🌹మన సాహితీ ప్రముఖులు (16)🌹


🙏శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు . 🙏


👉 కృష్ణ శాస్త్రి పాట అంటే ఆయన మాటల పాటలతోనే కూర్చిన ఈ గజ మాల. 

మావిచిగురు తిన్న కోయిల తీయగా పాడే పాట!


ఆకులో ఆకుగా , పువ్వులో పువ్వుగా ఒదిగి పోవాలనుకునే ప్రకృతి మమేకం


ప్రతి రాత్రిలోనూ వసంత రాత్రిని చూసే శృంగా రం


ఆకాశం లో హాయిగా విహరించే మేఘం ద్వారా పంపే ప్రేయసీ ప్రియుల సందేశం


తెలుగు ఆడపడుచు జీవితంలో కార్తీక దీపం


కన్నె పిల్ల అరచేత ఎర్రగా పండిన గోరింటాకు


మామిడి చిగురు లోని ఎరుపు, మంకెన పువ్వులోని ఎరుపు, మాణిక్యం లోని ఎరుపు


మనస్సు నిలుపోలేక కుశలమా అంటూ అడిగే క్షేమ సమాచారం


నిదుర రాని నిశి రాత్రుల్లో, నోరు లేని ఆవేదనల్లో తోడుగా నిలిచేది


అడుగడుగునా, అందరిలోనూ గుడి ఉందంటూ దైవానికి చెప్పే నిర్వచనం


అప్సరసలు పేరంటా ళ్ళుగా, దేవతలు పురోహితులుగా, నక్షత్రాలు తెచ్చే తలంబ్రాలతో ఆకాశ పందిరిలో జరిగే పెళ్లి


హరి పూజకు సమర్పించే పువ్వు


రావమ్మా మహాలక్ష్మీ అంటూ పిలిచే హరిదాసు పిలుపు


కన్నెపిల్ల చెదిరే ముంగురులు, కాటుకలు , నుదురంతా పాకేటి కుంకుమలు


అందీ అందని సత్యాలేమో అనిపించే సుమధుర స్వప్నాలు


తేట నీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట ఆ పాట


కోవెల గంటల గణ గణ, గోదావరి తరగల గలగల


మనసున ఊగే మల్లెల మాల


చక్కర మాటల మూట చిక్కని తేనెల ఊట


దేవులపల్లి ఎప్పుడూ మీగడ తరక లాంటి తెల్లని బట్టలు ధరించేవారు. నిత్యం చెరగని చిరు ధరహాసం ఆయన అలంకారం. ఆయన పాటల్లగానే ఆయన ప్రవర్తన పారదర్శకంగా, నిజాయితీ మరియు ప్రేమ నిండుకుని ఉండేది. మనం గత సంచిక లో కేవలం ఆయనను ఓ సినీ కవి గానే చూసాం. సినిమాలు ఆయన జీవితంలోకి ఆలశ్యం గా ప్రవేశించాయి, బి.ఎన్. రెడ్డి గారి ప్రోత్సాహంతో. కేవలం 170 పాటలే రచించినా ఒక్కొక్క పాట ఓ ఆణిముత్యం. ఒక్కొక్కపాట ఓ కవితా ఝురి. ఎందుకంటే సాహిత్యం ఆయనకు జన్మ తో సిద్ధించిన వరం. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు.


భావ కవులు అనేకమంది ఉండొచ్చు కానీ భావ కవిత్వమంటే కృష్ణ శాస్త్రి…. కృష్ణ శాస్త్రి అంటే భావ కవిత్వం! 

తన్మయత్వం తో. “నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? నా యిచ్చయే గాక నాకేటి వెరపు ? కాలవిహంగమ పక్షముల దేలియాడి తారకా మణులలో తారనై మెరసి మాయమయ్యెదను నా మధురగానమున! నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?” అంటూ తిరుగుబాటూ చేసాడు కృష్ణ శాస్త్రి తన “కృష్ణ పక్షం” లో.


1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు.


11929లో “ఊర్వశి” కావ్యం వ్రాశాడు. ఊర్వశి ఒక పద్య కృతుల సంపుటి. ఆ పద్యాల్లో కళావంతుల జీవితాలను ప్రతిబింబింప చేసాడు కృష్ణ శాస్త్రి. సామజిక ప్రయోజనం లేని కవిత్వం తావి లేని పువ్వే కదా. “ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు! ఆమె నవసాంధ్య సమయ మల్లీ మనోజ్ఞ కుసుమకామిని; ఎదొ వింతకోర్కె తీయదనపు వేదన నా జీవితమున రేపు!” అంటాడు కృష్ణ శాస్త్రి ఊర్వశి లో.


ఓ గొప్ప దేశ భక్తుడు దేవులపల్లి. జన్మ భూమి పై తన అభిమానాన్ని ప్రేమను నేటికీ విఖ్యాతమైన ఓ గీతం ద్వారా

“జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! 

జయ జయ జయ…..జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల! జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా! 

జయ జయ జయ……. జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ! జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ! 

జయ జయ జయ…..” అంటూ తెలియ చేసాడు. 

ఈ గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విధ్యార్థుల కోసం వ్రాసా డు.


కృష్ణ శాస్త్రి విశిష్ట రచనల్లో ఊర్వశి కావ్యము ,అమృతవీణ – 1992 – గేయమాలిక,అమూల్యాభిప్రాయాలు – వ్యాసావళి,బహుకాల దర్శనం – నాటికలు,కధలు,ధనుర్దాసు – నాలుగు భక్తీ నాటికలు ,కృష్ణశాస్త్రి వ్యాసావళి – 4 భాగాలు,మంగళకాహళి – దేశభక్తి గీతాలు,శర్మిష్ఠ – 6 శ్రవ్య (రేడియో) నాటికలు,శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993, మేఘమాల – సినిమా పాటల సంకలనం – 1996, శ్రీ విద్యావతి – శృంగార నాటికలు, యక్షగానాలు – అతిథిశాల – సంగీత రూపకాలు, మహతి, వెండితెర పాటలు – 2008 ఉన్నాయి.


గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు (1975 – ఆంధ్ర విశ్వవిద్యాలయం – కళాప్రపూర్ణ, 1978 -సాహిత్య అకాడమీ అవార్డు,1976 – పద్మ భూషణ్) లభించాయి. అభ్యుదయ కవిత్వానికి మార్గదర్శియై, ఆధునిక మహా భారతం వంటి మహా ప్రస్థానం రచించిన శ్రీశ్రీ కూడా కృష్ణ శాస్త్రి కవిత్వ ప్రభావానికి గురెైన వాడే! తర్వాత తర్వాత చలం ‘కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచపు బాధ శ్రీశ్రీది’ అన్నప్పటికీ ఆయన కవిత్వంలో పదాల అల్లిక, భావచిత్రాలు, ఇమేజినేషన్‌, పదలాలిత్యం పఠితల హృదయాల్లో ముద్రించుకు పోయాయి!


1980 ఫిబ్రవరి 24న దేవులపల్లి వారు కన్ను మూస్తే మహాకవి శ్రీ శ్రీ ‘షెల్లీ మళ్ళీ మరణించాడు’ ‘తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది’ ‘వసంతం వాడి పోయింది’ అని అశ్రు తర్పణం చేసారు. ‘అచ్చంగా వసంత మాసం వచ్చే దాక’ ఆగక ‘తొందర పడి కోయిల ముందే కూసింది’ అంతకు పదేళ్ళ క్రితమే ‘రానిక నీ కోసం సఖీ, రాదిక వసంత మాసం’ అనీ. కానీ ఈ భావ గడసరి కోయిలకు తెలుసు, ఎప్పటికీ తను వేసినది చిక్కు ప్రశ్న గానే మిగిలి పోతుందనీ- ‘మావి చిగురు తినగానే కోవిల పలికేనా? కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?’ అన్నదే ఆ ప్రశ్న. ఆ సమాధానం దొరికేంత వరకూ తనను మరచి పోరనీ ఆయనకు తెలుసు. “ఎన్నడో మీరు పాడిన దీ వసంత మధుర జీవనగీతి! హేమంత దీర్ఘయామినీ మధ్యవేళయే యైన, నేడుకూడ, నా యెద, త్రుళ్ళింత లాడుచుండు” “ఏ మనోహర సీమలం, దే పవిత్ర విమల తేజోమయ విశాల వీథులందు,అక్ష రామోద సంభరి తాంతరంగులగుచు, విహరించుచున్నారొ”. – మురళీ కృష్ణ జీ.


🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!