🚩 చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి !

🚩 చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి !

(తిరుపతి వెంకట కవులు.)


చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ-


కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్


పచ్చని కొంప మాపితివి బాపురే? కౌరవనాథ! నీ సగం


బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్


ఆ..ఆ..ఆ..

-


పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత, దుర్యోధనుడు ద్వైపాయనహ్రదంలో


దాగి ఉన్నాడని బోయల ద్వారా తెలుసుకున్న తర్వాత ధర్మరాజు తమ్ములతో,


బంధువర్గంతో, శ్రీకృష్ణసమేతంగా వివిధ వాద్యాల ధ్వనులు అన్ని దిక్కులూ


వ్యాపిస్తూ వుండగా, ఆ సరోవరాన్ని సమీపించాడు.


దుర్యోధనా! నీళ్లలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? అంతమాత్రాన చావు


నీకు తప్పుతుందా? లోకంలో ఇట్టి నీచస్థితి నీకు తగునా? శూరుడవేనా?


నీ అభిమానం ఎక్కడికి పోయింది? నీ కీర్తిని, గొప్పతనాన్ని వదలి


శత్రుసమూహం నవ్వేటట్లు ఈ విధంగా చేయతగునా? రాజు ధర్మం వదిలితే


ఇహపరాలుంటాయా?


యుద్ధంలో కుమారులు, తమ్ములు భయంకరంగా చనిపోగా, చూచినా,


నీ బుద్ధి, నీ శరీరాన్ని కాపాడుకొనటం కొరకు ఎట్లా ఒప్పుకున్నావు?


రారాజు, పాండురాజకుమారుల భుజబల విజ్రుంభణానికి తట్టుకొనలేక


మడుగులో దాగినాడట! అని ప్రజలు ఛీ కొట్టరా?


చచ్చేటప్పుడు భుజబలదర్పం కూడా తొలగిపోయిందా?


"తెంపు జేసి మా మీద కురుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు


పురుషుడవేని దీని ననుష్ఠింపు మనిన" - సాహసంతో మా మీదికి


యుద్ధానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం. దీన్ని ఆచరించు.


మగటిమి కలవాడివైతే దీన్ని చేయుమని పలుకగా, దుర్యోధనుడు


ధర్మరాజుతో, 18 రోజుల యుద్ధంలో అలసట చెంది, విశ్రాంతి కైకొన్నాను తప్ప


యుద్ధభీతి కాదు. తనవారితో కలిసి అనుభవించదగు సుఖమే సుఖం


గానీ, అదిలేనిచో రాజుకు అది రాజ్యమూ కాదు, ఆ సుఖము సుఖమూ


కాదు. నీ సోదరులు, సేవకులు అందరూ బ్రతికే ఉన్నారు.


ప్రపంచాన్నంతటినీ నీవే ఏలుకొమ్ము. "ఏనింక సమర మొల్లను


మహీనాయక, నీక యుర్వినెల్ల నిచ్చితి శాంతిం, గానకు జని


వల్కలపరిధానుడనై తపమొనర్చెదను మునుల కడన్" అంటాడు.


"ఓడివచ్చినాడ నుద్ధతి నాకేల? యుడుకు మాని నీవ యుర్వియేలు


గుర్రములను ఏనుగులు లేని బయలు నీ తలనె కట్టికొనుము ధర్మతనయ!"


నాకిక యుద్ధం వద్దు. ఓ రాజా, ఈ భూమిని నీకిచ్చాను. శాంతంగా


అడవులకు వెళ్లి మునుల సన్నిధిని నారచీరలు కట్టుకొని తపస్సు


చేసుకొంటాను. ఓడిపోయి వచ్చాను, నాకెందుకయ్యా గర్వం?


ఈ భూమిని నీవే పాలించుకొమ్ము. గుర్రాలూ, ఏనుగులూ లేని


ఈ బీడును నీ నెత్తి మీదే కట్టుకొమ్ము.


దానికి ధర్మరాజు, ఈ ప్రలాపనలెందుకు గాని, ధర్మం ఎంచి యుద్ధానికి


లెమ్ము. నీ ఈ దానమును రాజైన నేను అంగీకరించను. యుద్ధంలో నిన్ను


చంపి భూమిని పాలిస్తాను. వైరులకు సంపదనిస్తాననే వెర్రివాడుంటాడా?


అంటాడు.


దీనికి దుర్యోధనుడు మీ ఐదుగురు సేనలతో, బంధువులతో,


అఖిలాస్త్రశస్త్రాలతో ఉన్నవారు. నేనా ఒక్కడను, తోడు లేనివాడను,


అనేకులు ఒక్కడితో యుద్ధం చేయటం న్యాయమా? అని అడుగుతాడు.


ఇందుకు ధర్మరాజు దుర్యోధనా! యుద్ధంలో నిన్ను మా పక్షం నుండి ఒక్కడే


ఎదిరిస్తాడు. అతడి గర్వాన్ని నీవు అణచగలిగితే ఈ రాజ్యాన్నంతా నీవే


గ్రహించి దాని వైభవాన్ని అనుభవించుము. చివరి మాటగా,


"ధర్మసుతు డాతనితో గద నొక్కరుండ నే గొనియెద నీదు


ప్రాణములకుంఠితబాహువిలాసభాసినై" అని రెచ్చగొట్టాడు.


దుర్యోధనా! అకుంఠితభుజశక్తితో ప్రకాశిస్తూ గద గొని, నేనొక్కడినే నీ ప్రాణాలు


తీస్తానని పలుకగా, "బుట్ట లోపలి మహాభుజగేంద్రుడు రోజునట్ట రోజె నధిప!


యవ్విభుండు తన చిత్తము నప్పలుకుల్ గలంచినన్"- తన మనసును


ధర్మరాజు మాటలు కలతపెట్టగా, దుర్యోధనుడు పుట్టలోని పెనుబాము


బుసకొడుతూ రోజినట్లుగా బుస కొట్టాడు.


వెంటనే దుర్యోధనుడు జలస్తంభస్థితిని వదిలి నీటిమడుగు అల్లకల్లోలం


కాగా, కులపర్వతం వలె ఒప్పారి, భయంకరాకారుడై గదాదండాన్ని తన


భుజపీఠం మీద పెట్టుకుని వెడలి వచ్చాడు.


*****

👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!