సుత్తి వీరుడు సినిమాలు, వాటిలోని పాత్రలు, ఆ పాత్రలు పలికే కొన్ని ప్రత్యేకమైన పదాలు జన బాహుళ్యంలోకి ఎలా చొచ్చుకుపోతాయో చెప్పడానికి విజయ వారి చిత్రాల్లో పింగళి నాగేంద్రరావు గారు సృష్టించిన ' డింగరి ', ' గురూ ' లాంటి పదాలు ఉదాహరణగా చెబుతుంటాం ! ఆ తర్వాత అలాంటి విచిత్రమైన, కొత్తరకమైన పదాల్ని సృష్టించడంతో బాటు కొన్ని పదాల్ని,,,, వాటి అసలు అర్థమే మారిపోయేలా చేసిన రచయిత జంధ్యాల. అంతేకాదు. మన చుట్టూ కనిపించే కొన్ని విచిత్రమైన, ప్రత్యేకమైన మనస్తత్వం గల వ్యక్తులను తన చిత్రాల్లో పాత్రలుగా మలచిన దర్శకుడు కూడా జంధ్యాలే ! ఆయన సృష్టించిన వాటిల్లో ఇప్పటికీ, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయిన, నిలిచిపోయే పదం ' సుత్తి ' . నిజానికి సుత్తి అనే పదానికి మనకు తెలిసిన అర్థం కాకుండా మరో అర్థాన్ని జంధ్యాలగారు ఆపాదిస్తే ఆ పాత్రలో జీవించి, ఆ పాత్రకు శాశ్వతత్వాన్ని కల్పించడమే కాకుండా ' సుత్తినే ఇంటి పేరుగా మార్చేసుకున్న నటుడు వీరభద్రరావు. మామిడిపల్లి వీరభద్రరావుగా కోనసీమలోని అయినాపురం గ్రామంలో జన్మించిన ఈయన చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడ చేరారు. చదువు, ఉద్యోగం, నాటకాలు వగైరా అన...