పి.బి.శ్రీనివాస్

P B శ్రీనివాస్ గారికి నివాళులర్పిస్తూ:
విభిన్న స్వరం పి.బి శ్రీనివాస్‌

'పూవూ గులాబీ బాలా..' అంటూ మలయమారుతంలా వినిపించే ఆ స్వర మాధుర్యానికి పులకించని మది ఉండదు. ఆ పాత మధురాల అభిమానులెందరికో ఈ స్వరం సుపరిచితమే! 'స్వరములు ఏడైనా.. రాగాలెన్నో..' అని ఓ సినీకవి అన్నట్లు గాయకులెందరున్నా.. 'గాన సామ్రాట్‌' మాత్రం పి.బి.శ్రీనివాసే. ఆయన స్వర ప్రవాహం దక్షిణాదిన మొదలై.. ఉత్తరాదిని తాకింది. సంగీతం నేర్చుకోకుండానే.. స్వరజ్ఞానం పొందిన మహాసాధకుడు. అంతేకాదు కర్ణాటక సంగీతంలో 'నవనీత సుధ' అనే రాగాన్ని సృష్టించిన విద్వాంసుడు. ఆయన గొంతులో మెలోడి ఒద్దికగా ఒలికి హొయలుపోతుంది. స్వరమే కాదు ఆహార్యంలోనూ, అలవాట్లలోనూ ఆయనలో ప్రత్యేకత కనిపిస్తుంది. చేతినిండా పుస్తకాలు, జేబులో రకరకాల పెన్నులు, తలమీద టోపీతో సాదాసీదాగా కనిపిస్తారు. రికార్డింగ్‌ లేని సమయాల్లో ఏదో ఒక చెట్టుకింద కుర్చీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకుంటారు. లేదా తనకు తట్టిన ఆలోచనో, కవితో రాసుకుంటుంటారు.
పి.బి.శ్రీనివాస్‌ సెప్టెంబర్‌ 22, 1930 తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. వీరి ఇంటిపేరు ప్రతివాద భయంకర. తల్లిదండ్రులు శేషగిరమ్మ, లక్ష్మణ ఫణీంద్ర స్వామి. తల్లివైపు వారందరూ సంగీతంలో విజ్ఞులు. తల్లి శేషగిరమ్మ వల్లే శ్రీనివాస్‌కు సంగీతం పట్ల మక్కువ కలిగింది. వీరి సోదరి, మణిరఘునాథ్‌ వీణా విద్వాంసురాలు. తండ్రిది మాటి మాటికి బదిలీ అయ్యే ఉద్యోగం. దీంతో కాకినాడలో ఉన్న మేనమామ వద్దే పి.బి. చదువుకున్నారు. కాకినాడలో బి.కామ్‌ చదివి, మద్రాసు లా కాలేజీలో చేరారు. చిన్నప్పటి నుంచి అన్ని భాషలకు చెందిన చిత్రాలు పదేపదే చూడడం, పాటలు విని స్వరాలు రాసుకుని, సాధనం చేయడం వల్లే ఈయన సంగీతం పదును తేలిందని ఆయనే చెప్తుంటారు. హరనాథ్‌కు పాడిన పాట పి.బి. సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసింది. 'చౌద్వీ కా చాంద్‌' హిందీ చిత్రంలో గురుదత్‌, వహీదారెహమాన్‌కు మహ్మద్‌రఫీ ఆలపించిన 'చౌద్వీ కా చాంద్‌ హౌ' గీతాన్ని తెలుగులో (మధనకామరాజు) హరినాథ్‌, రాజశ్రీకి 'నీలి మేఘమాలవో.. నీలాల తారావో..' అంటూ అచ్చు అలానే పాడి చరిత్ర సృష్టించారు. మహ్మద్‌రఫీ, పి.బి. జుగుల్స్‌ ఆయన సంగీత జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
మద్రాసులో ఉన్నప్పుడు 'ప్రియాంక, ప్రియభాషి, విశ్వసాక్షి, త్రిలోక సంచారి' వంటి కలం పేర్లతో పత్రికలకు రచనలు చేసేవారు. ప్రముఖ వైణిక విద్వాంసులు ఈమని శంకరశాస్త్రి ప్రోత్సాహంతో సినీరంగానికి పరిచయమయ్యారు. తెలుగులో వీరి తొలి చిత్రం నటుడు ఆర్‌.నాగేంద్రరావు నిర్మించిన 'జాతకఫలం' (1954), ఆ తర్వాత 1956లో 'భలే రాముడు' సినిమాకు, ఎస్‌.రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో రేలంగికి 'బంగరు బొమ్మా, భలే జోరుగా పదవే పోదాము', అన్న నేపధ్యగీతం, 'భయమేల ఓ మనసా' అన్నవి పాడారు. అప్పటి నుంచి ఎందరో కథానాయకులకు, సహ నాయకులకు, హాస్యనటులకి గొంతును అనుకరించి పాడి మంచి పేరు తెచ్చుకున్నారు. అనేకమంది సంగీత దర్శకులు ఆయన స్వరంలోని ప్రత్యేకతకు మురిసి అవకాశాలను ఇచ్చి, ప్రోత్సహించారు.
పి.బి.శ్రీనివాస్‌ ఎనిమిది భాషల్లో (సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు) ప్రవీణుడు. ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కవితలల్లిన ప్రజ్ఞావంతుడు. అసాధారణమైన ప్రతిభతో ఎనిమిది భాషల్లో వివిధ ఇతివృత్తాలతో చేసిన రచనలను 'ప్రణవం' పేరుతో గ్రంథంగా ప్రచురించారు. 'షాబాష్‌' అనే పేరుతో ఉర్దూలో గజల్స్‌ రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాల్లో పలు తెలుగు, తమిళ గీతాలు ప్రసారమయ్యాయి. ఆయన రచించి, గానం చేసిన 'పాలవెల్లిరా నా పిల్లనగ్రోవి, నీల గగనమే నా మోవి' అని కృష్ణునిపై రాసిన పాట ఆయనకిష్టమైన వాటిల్లో ఒకటి. నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలిడిన సందర్భంలో ఇంగ్లీషులో 'మేన్‌ హాజ్‌ సెట్‌ హిజ్‌ ఫుట్‌ ఆన్‌ ది మూన్‌' అనే పాట రాసి కంపోజ్‌ చేశారు. రవీంద్రనాథ్‌ శతజయంతి సందర్భంగా శాంతినికేతన్‌ నుంచి శాంతిదేవ్‌ ఘోష్‌ మద్రాసు వచ్చి పి.బి.శ్రీనివాస్‌చే రవీంద్ర గీతాలు కొన్ని రికార్డు చేయించుకున్నారు. అదో అరుదైన గౌరవంగా శ్రీనివాస్‌ ఎప్పుడూ చెప్తుంటారు. సంస్కృతంలో శ్రీనివాస వృత్తమ్‌, గాయత్రీ వృత్తాలు రచించారు. తమిళ సినీరంగానికి పి.బి.శ్రీనివాస్‌ను పరిచయం చేసింది సంగీత దర్శకులు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌. ఆయనచే 'స్వరం రాసుకుని సరిగ్గా పాడేది పి.బి.శ్రీనివాసే' అని ప్రశంసలందుకున్నారు. పావమన్నప్పు (1962) అనే చిత్రం ద్వారా శ్రీనివాస్‌ పాడిన 'కాలం గళిల్‌ అవళ వసంతం' అనే పాట సూపర్‌ హిట్‌ అయింది. అలాగే ఈ చిత్రం రజతోత్సవాలు చేసుకుంది. తమిళనటులు జెమినీ గణేశన్‌కు ఈయన పాడిన పాటలన్నీ విజయం సాధించినవే. కన్నడ హీరో రాజకుమార్‌కు పాడిన పాటలన్నీ సుప్రసిద్ధమైనవే. మలయాళం, తుళ్లు, కొంకణి భాషల్లో చాలా పాటలు పాడారు. హిందీలో శ్రీనివాస్‌ పాడిన 'చందాసే హౌగా ప్యార్‌' (మై లడ్కీ హూ) పాట మంచి పేరు తెచ్చిపెట్టింది. లతా మంగేష్కర్‌తో ఎన్నో పాటలు పాడారు. సినిమాల్లో మ్యూజిక్‌ డైరక్షన్‌ చేయలేదు. కానీ ప్రైవేటుగా తాను రాసిన పాటలకే కాక, ఇతరుల పాటలూ కంపోజ్‌ చేశారు. ఎం.ఎస్‌.శ్రీరామ్‌ నిర్మించిన 'పెళ్లిరోజు' చిత్రానికి కొంత మ్యూజిక్‌పార్టు కంపోజ్‌ చేశారు. 'జమున'తో కలిసి 'పెళ్లివారమండి' పాట పాడారు. చిత్తూరు నాగయ్యకు 'శాంతి నివాసం' చిత్రంలో పాడిన 'శ్రీరఘురాం, జయ రఘురాం' పాట అప్పట్లో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎన్టీఆర్‌, అక్కినేని, కాంతారావు, జగ్గయ్య, శోభన్‌బాబు, రామకృష్ణ, చలం, కృష్ణ వంటి మహానటులెందరికో తన గానమాధుర్యాన్ని అందించి, సంగీతరసజ్ఞులను అలరింపజేశారు. వారందరికీ పాడిన పాటల్లో కొన్ని తనొక్కడే పాడితే, మరికొన్ని ఘంటసాల తదితర సంగీతజ్ఞులతో కలిసి పాడారు.
పాటలే కాదు.. పద్యాలను పాడడంలోనూ పి.బి. గొప్ప నేర్పరి. 'ఇనుప కచ్చడాల్‌' (సీతారామకల్యాణం), 'నల్లనివాడు' (శ్రీకృష్ణపాండవీయం), 'మామ మీసాల మీద సీసా' (కులగోత్రాలు) మంచి పేరు తెచ్చుకున్న వాటిల్లో కొన్ని. అపస్వరం ఎరుగని పిబి శ్రీనివాస్‌ 'వయస్సు శరీరానికే గానీ తన స్వరానికి కాదనీ, కళాకారుడు విశ్రాంతి తీసుకోరాదని' అంటుంటారు. ప్రజలు అభిమానంతో 'గానసామ్రాట్‌, గానకళా సార్వభౌమ' అనే బిరుదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం 'కలైమామణి' బిరుదుతో సత్కరించింది. 'ఘంటసాల సినీ ప్రపంచంలో పార్థసారథుడు. సంగీతంలో అన్ని స్వరమాధుర్యాలు తడిమిన వాడు. ఆయన్ని అధ్యయనం చేయడం వల్లే సంగీతంలో ఎన్నో తెలుసుకున్నాను' అన్న పి.బి.మాటలు ఆయనలోని సుగుణాన్ని తెలియజేస్తాయి.
(courtesy:సవ్వడి డెస్క్ - శాంతిశ్రీ Sun, 18 Sep 2011, IST)
Shesasai Sharma gari soujanyamtho..


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!