Posts

Showing posts from May, 2015

అన్నమాచార్య.!........ఉయ్యాలా బాలునూఁచెదరు కడు.(శృంగార సంకీర్తన)

Image
. . అన్నమాచార్య.!........ఉయ్యాలా బాలునూఁచెదరు కడు.(శృంగార సంకీర్తన) . శంకరాభరణం. పల్లవి: ఉయ్యాలా బాలునూఁచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు చరణములు: బాలయవ్వనలు పసిఁడివుయ్యాల బాలుని వద్దఁ బాడేరు లాలి లాలి లాలి లాలెమ్మ యెల్ల లాలి లాలి లాలనుచు తమ్మిరేకుఁ గనుఁదమ్ముల నవ్వుల పమ్ముఁ జూపులఁ బాడేరు కొమ్మలు మట్టెల గునుకుల నడపుల ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు చల్లుఁ జూపుల జవరాండ్లు రే పల్లె బాలునిఁ బాడేరు బల్లిదు వేంకటపతిఁ జేరి యందెలు ఘల్లు ఘల్లు ఘల్లనుచు

శ్రీకృష్ణ శతకం.!........( 1 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
                శ్రీకృష్ణ శతకం.!........( 1 /6/15)... (శ్రీ నరసింహ కవి.) . వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా! . కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! . ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. . వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్త...

కృష్ణ శతకం .!.....(31/5/15.)

Image
కృష్ణ శతకం .!.....(31/5/15.) . (కృష్ణ శతకం లోనిదీ పద్యం . కృష్ణ శతకం తిక్కన రాసిన దని కొందరి అభిప్రాయం . ఈ శతకం ఇప్పుడు లభించడం లేదు .) . అరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై గుబ్జపై నరుపై ద్రౌపదిపై గుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై బరగం గల్గు భవత్కృపారసము నాపై గొంత రానిమ్ము నీ చరణాబ్జమ్ములె నమ్మినాడ జగదీశా ! కృష్ణ భక్తప్రియా !. . భక్తులు ఎంతమందో ! గాంగేయుడు , విదురుడు , అకౄరుడు , కుబ్జ , ద్రౌపది , కుచేలుడు , నందుని పరివారమంతా ,చెప్పుకుంటూ పోతే ఎంతమందో . జగన్నాటక సూత్రధారి దయకు పాత్రులైనవారు లెక్కకు మించి ఉన్నారు . . భక్తుడు భగవంతునికి కొందరు భక్తుల పేర్లను జ్ఞాపకం చేసి , పరమాత్మా నేనుకూడా నీ శ్రీచరణాలను ఆశ్రయించిన వాడినే . ఇతర భక్తులమీద చూపిన కృప నా మీద కూడా కొంతైనా ప్రసరింపజేయవా ! అని దీనంగా అర్థిస్తున్నాడు . నేను నీ భక్తుణ్ణేనని చెబుతూ , కృష్ణా భక్త ప్రియా అని సంబోధించి ఆ స్వామి దయకు డవుతున్నాడు . ” శరణం నీ దివ్య చరణం ” అని భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు కరిగిపోడా

శ్రీకృష్ణ శతకం.!........( 30 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
        శ్రీకృష్ణ శతకం.!........( 30 /5/15)... (శ్రీ నరసింహ కవి.) . కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా! . నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.  . భావం: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. . హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు......

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(30/5/15.)

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(30/5/15.) . ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేఁడెల్లియో కడ నేడాది కొ యెన్నడో యెరుగమీ కాయంబు లీ భూమిపై బడగా నున్నవి , ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో ? శ్రీ కాళహస్తీశ్వరా ! . ఈశ్వరా ! ఘడియకో ,రెండు ఘడియలకో ,మూడు ఘడియలకో కాకపోతే రేపో , ఎల్లుండో మరి ఏడాదికో ఈ శరీరాలు భూమిపైన పడబోతున్నాయన్న విషయం తెలిసి కూడ ఈ మానవులు ధర్మమార్గాన్ని అనుసరించడం లేదు. మూర్ఖులైన వీరు నీ పాదాలను సేవించడం వలన కలిగే ప్రయోజనం కూడ తెలుసుకోలేకపోతున్నారు . అయ్యో.. .

బాలకృష్ణుని ...సంభాషణా చాతుర్యం.!

Image
బాలకృష్ణుని ...సంభాషణా చాతుర్యం.! . (పోతనామాత్యు ని భాగవతం.) . గోప కాంతలు యశోదతో మొరపెట్టుకొన్న విధం. నీ కొడుకు ఆగడాలతో వేగలేకపోతున్నామమ్మా అని. . ఓ యమ్మ: నీ కుమారుడు మాయిండ్లను బాలుబెరుగు మననీడమ్మా: పోయెద మెక్కడి కైనను మాయన్నల సురభులాన మంజులవాణీ! . కిట్టయ్యను యశోద ఇలా నిలదీసింది. మన్నెందుకు తిన్నావురా కన్నా అని. . మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ యన్నయు సఖులును జెప్పెద రన్నా! మ న్నేల మఱి పదార్ధము లేదే? . ఎబ్బే నేనెందుకు మన్ను తింటాను? వాళ్ళూరికే చాడీలు చెబుతున్నారు. అన్నాడు బాలకృష్ణుడు .

ప్రేయసీ నువ్వో చిన్న కురంగం.!

Image
ముళ్ళపూడి వెంకట రమణ సాహితీ సర్వస్వం..కధారమణీయం..లోనుంచి. "ప్రేయసీ నువ్వో చిన్న కురంగం పాపం నీది నిర్మలాంతరంమంచి వాడుగం నేనుతప్పమిగతావాళ్ళు నీకు చేస్తారుశృoగభంగం అందుకే నాకు తప్పఅందరికీ తిప్పు తారంగం" వీడున్నాడే--వీడు (అంటే '' నేను ''అనే వాడు ) వీడుబహు మంచి వాడు అందరి లాంటి వాడూకాడు వీడిలాటివాడు.వీడే ప్రేయసీ తారరంపం...తారరంపo తరరంపం నీ కోసం నాపాలిటి రంపం జింపం.జిగిజింపం..జిగిజింపం వస్తోందదుగో భూకంపం కానీనాకు ఎంత మాత్రం రాదు కంపం నిత్యం చేస్తాను నీ నామజపం పాడకు పాడకు తారంగం నా పాలిటి ముద్దుల కురంగం భరిస్తాను నీ పరాకు కానీ వొద్దుబాబోయ్ చిరాకు ఇది కేవలం నిన్నటిఎంగిలాకు.'' x

సత్యభామ .!

Image
. సత్యభామ .! . "వేణిన్ జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ  శ్రేణిన్ దాల్చి ముఖేందు మండల మరీచీజాలముల్ పర్వగా  పాణిం బయ్యెద చక్కగా దురిమి శుంభద్వీరసంరంభయై  యేణీలోచన లేచి నిల్చె తన ప్రాణేశాగ్రభాగంబునన్." . అందమైన పద్యాలకు ఆలవాలం పోతన భాగవతం . . సత్యభామ యుధ్ధం చేసే ఘట్టం . యుధ్ధం చేసే సత్యభామ ” తన బారెడు జడను ముడి వేసుకున్నదట . చీర ముడి కూడా బెగించింది . నగలూ గట్ర్రా అడ్డం రాకుండా వాటిని సరి చేసుకున్నది . పైట బిగించింది . చంద్రబింబాన్ని మించిన అందమైన మోము కాంతులు వెదజల్లుతూ పోతన్నకు కనిపించింది . ఈ పనులన్నీ నిమేష మాత్రంలో ముగించుకొని తన ప్రాణేశుని అగ్ర భాగంలో నిలుచున్నది లేడికన్నుల సత్యభామ . . ఎంత అందమైన వర్ణన . ఈ పద్యం రాయాలంటే తలపులో సత్యా కృష్ణులను ఊహించుకోవాలి . యుధ్ధం చేయడానికి ఏనుగుల గుంపుల సహాయం తో పైన పడుతున్న నరకాసురుడూ కనిపించాలి . శృగారానికి ప్రతిరూపంగా నిలిచే సత్యభామ జడా , పయ్యెదా , కడుతున్న చీర ముడీ , కదిలే ఆభరణాలూ , నేను యుధ్ధం చేస్తానంటూ ముందుకు రావడం లాంటి దృశ్యాలు కనుల ముందర కదలాలి . వీటన్నిటినీ నిశితంగా పరిశీలించి అందమైన పద్య...

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి-శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి.. గీతం.!

Image
. శ్రీ దేవులపల్లి  కృష్ణ శాస్త్రి గారి.. గీతం.! . శిథిలాలయమ్ములో శివుడు లేడోయి ప్రాంగణమ్మున గంట పలుకదోయి . దివ్యశంఖము గొంతు తెరువ లేదోయి-  పూజారి గుడి నుండి పోవలేడోయి . చిత్ర చిత్రపు పూలు చైత్ర మాసపు పూలు- ఊరూర నిటింట ఊరకే పూచాయి . శిథిలాలయమ్ము లోశిలకెదురుగా పూలు-  పూజారి కొకటేని పూవు లేదోయి . వాడవాడల వాడె జాడలన్నిట వాడె- ఇంటి ముంగిట వాడె ఇంటింటి లో వాడె . శిథిలాలయమ్ము లో శిలను సందిట బట్టి-  పూజారి వాని కై పొంచి ఉన్నాడోయి

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(28/5/15.)

Image
. శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(28/5/15.) . జలజశ్రీ గల మంచినీళ్లు గలవే చట్రాతిలో , బాపురే వెలివాడ న్మరిబాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా నలి నారెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ ఏ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా ! . శ్రీ కాళహస్తీశ్వరా !  ఎక్కడైనా బండరాతి లోపల పద్మాలతో కూడూన మంచినీరు ఉంటాయా ! వెలివాడ లో ఎక్కడైన విప్రగృహం ఉంటుందా ! ఇవి ఉండవనే విషయం నీకు తెలిసి కూడ వేషాలు కాకపోతే నాలో మంచి గుణాలు కన్పించడం లేదని నీవు నన్ను దూరంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది . ఏమైనా సరే నాలో ఉన్న గుణాలలో నీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని నన్ను రక్షించవలసినది కాని విడిచి పెట్టవద్దని కవి అభ్యర్ధన. తనకు మోక్షాన్ని పొందే అర్హత ఏ ఒక్కటి లేకపోయినా ,ఉన్న గుణాల్లో శంకరునికి నచ్చిన గుణాన్ని తీసుకొని తనకు మోక్షమివ్వమని కవి ప్రార్ధన . అంటే కవి దృష్టి లో తన వద్ద నున్న ఏకైక గుణం కవిత్వమే. దాన్ని ఏనాడో మహాదేవునకు అంకితం చేశాడు. కాబట్టి తాను కైలాస వాసానికి అర్హుడననే కవి వాదన.

దాసు శ్రీరాములు...(కీర్తన)..........కట్టివైతునా పడకింటిలో ..!

Image
దాసు శ్రీరాములు...(కీర్తన)..........కట్టివైతునా పడకింటిలో ..! . కాంభోజి - త్రిపుట  . పల్లవి:  కట్టివైతునా పడకింటిలో వాని బట్టి పైట కొంగున ॥కట్టి॥  అనుపల్లవి:  ఇట్టివాడు వంట - ఇంటి కుందేలాయె ఎక్కడ బోయే ననుకో రాదమ్మ ॥కట్టి॥  చరణ:  విడచితినా సామి - వీధివీధి తిరిగి - వేగత్తెల గుడునే తడబాటులేక చే - తను జిక్కినప్పుడే చెడనీక పదిలము - చేసుకోవలెనమ్మ ॥కట్టి॥  ఏమరి నేనూరకుంటినా - ఈ రాత్రి - ఏవేళ కేబుద్ధియో కోమలమున నింత - గోవగొన్నవాడు వామాక్షి మనవాడ నమ్మరాదమ్మా ॥కట్టి॥  మోస పోతిని వేణు - గోపాల దేవుని - బాస నిజము గాదే దాసు శ్రీరామదాసుని - హృదయము బాసి గడియయైన - నిలువ నొల్లడమ్మా ॥కట్టి॥

నీ పాద కమల సేవ .!

Image
నీ పాద కమల సేవ .! నీ పాద కమల సేవయు ,  నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూత దయయను , తాపస మందార నాకు దయసేయగదే . సుదాముడు మధురానగరంలో మాలాకారుడు అంటే పూలు అమ్ముకునే వాడు . మధురా నగరిలో ప్రవేశించిన బలరామ కృష్ణులు సుదాముని ఇంటికి వెళ్ళారు . వారిని చూచిన వెంటనే తత్తరపాటుతో తన ఆసనాన్నుండి లేచి నమస్కారం చేసాడు సుదాముడు . అర్ఘ్య పాద్యాలను , తాంబూలాలను , పూలు , గంధము మొదలైన వస్తువులను ఆనందభరితుడై వారికి ఇచ్చాడు . పరిమళాలు వెదజల్లే పూలమాలలతో వారి గళసీమను అలంకరించాడు . . మీ రాకతో నా ఇల్లు పావనమయ్యింది , తపస్సు పండింది , నా ఇల్లు సిరి సంపదలతో నిండింది , నా కోరికలన్నీ తీరినాయి . నేను ఏ పనులు చేయాలి ? అని వారితో పలికాడు . సంతోషించిన బలరామకృష్ణులు ఏం కావాలో కోరుకొమ్మన్నారు . . ఆ సందర్భంలో సుదాముని నోటినుండి వచ్చిన మాటలు పద్య రూపంలో మన కందించాడు పోతన్న . పద్యానికి అర్థం చెప్పదం అవసరం లేదనుకుంటాను . సులభంగా లేదూ ? భగవంతుడు కనబడి నీకేమి కావాలని అడుగుతే , అడగడానికి ఏమీ ఉండదు . ఆ ముగ్ధమోహన మూర్తి దర్శనంతో కోరికలన్నీ నశిస్తాయి . ఆ మహాత్ముని పాదాలకు సేవ చెయ్యాలనే కోరి...

పుష్పక విమానం (Pushpaka Vimana).!

Image
. పుష్పక విమానం (Pushpaka Vimana).! . భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం. పుష్పక విమానం రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు. సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించ బడింది. సితాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. వాల్మీకి రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించ బడింది. . (సుందర దాసు .. ఏం.ఎస్. రామారావు గారివర్ణన.) . యమకుబేర వరుణ దేవే0ద్రాదుల / సర్వస0పదల మి0చినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది / బ్రహ్మవరమున కుబేరుడ0దినది  రావణు0డు కుబేరుని రణమ0దు / ఓడి0చి ల0కకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది. . నేలను తాకక నిలచియు0డునది /రావణ భవన మద్య0బుననున్నది వాయు పథమున ప్రతిష్టితమైనది / మనమున తలచిన రీతి పోగలది దివిను0డి భువికి దిగిన స్వర్గమది / సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది పుష్పకమను మహా విమానమది / మారుతి గా0చెను అచ్...

నిర్మలమ్మ.!

Image
x . నిర్మలమ్మ.! . షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం. — అక్కినేని నాగేశ్వరరావు . కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సంధర్భాల్లో గుర్తు చేసుకునేది. . ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ. . నిర్మలమ్మ ఆడపెత్తనం లో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది. .

శ్రీకృష్ణ శతకం.!........( 26 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
. శ్రీకృష్ణ శతకం.!........( 26 /5/15)... (శ్రీ నరసింహ కవి.) . అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా! . ప్రతిపదార్థం: మాధవా! అంటే మౌనం, ధ్యానం, యోగం అనే మూడు మార్గాలద్వారా భక్తులను అనుగ్రహించేవాడా లేదా లక్ష్మీదేవి భర్తయైనవాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; సురలును అంటే దేవతలు; దనుజులు అంటే రాక్షసులు; అందరు అంటే వీరందరూ; పొందుగ అంటే ఒకరితో ఒకరు కలిసి; క్షీర + అబ్ధిన్ అంటే అంటే పాలసముద్రాన్ని; తఱవన్ అంటే కవ్వంతో చిలుకగాచిలుకగా;పొలుపునన్ అంటే నేర్పుతో; నీవు + ఆనందముగ అంటే సంతోషం కలిగేటట్లు నువ్వు; కూర్మరూపునన్ అంటే తాబేలు ఆకారంలో; మందరగిరి అంటే కవ్వంగా ఉన్న మందరగిరి అనే పేరుగల పర్వతాన్ని; ఎత్తితివి + ఔర అంటే పైకి ఎత్తటం ఎంత ఆశ్చర్యం! . భావం: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం.  . విష్ణుమూర్తి అవతారాలలో రెండ...

అప్పటి మాటలకు.! . కీర్తన........ దాసు శ్రీరాములు.

Image
. అప్పటి మాటలకు.!  . కీర్తన........ దాసు శ్రీరాములు . తోడి - త్రిపుట పల్లవి: అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని అప్పటి గప్ప నిచ్చెనటే చెలి ॥అప్పటి॥ అనుపల్లవి: తప్ప నే నితరుల - దరి జేరనని యెన్నో చెప్పిన తలచు కొంటినే ఓ చెలి ॥అప్పటి॥ చరణ: తొలినాటి వగలే యా - మరునాటి పగలు మా చెలిమి కాకియు కో - వెల చందమాయెనే ॥అప్పటి॥ పడతి మగవారి బారు - పడకింట మితిమీరు గడప దాటిన వెనుక - కారు మన వారు బడిబడి నాడు వారు - బ్రతిమాలి పాదముల బడి వేడు కొన్నగాని - పలుకే మేల్మి బంగారు ॥అప్పటి॥ కాసు వీసము లిచ్చి - గోస గూసల మసి బూసి నేరేడు గాయ - జేసెనే చెలి వేసాలమారి మా - వేణుగోపాల మూర్తి దాసు శ్రీరామకవి - డాసి యేలుచుండెనే ఓ చెలి ॥అప్పటి॥

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25/5/15.)

Image
. శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25/5/15.) . జాతుల్సెప్పుట , సేవజేయుట ,మృషల్ సంధించుట న్యాయాప ఖ్యాతిం బొందుట , కొండెగాడవుట , హింసారంభకుండౌట , మి థ్యాతాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి , యా శ్రీ తానెన్ని యుగంబు లుండగలదో ? శ్రీ కాళహస్తీశ్వరా ! . ఈశ్వరా ! ఈ జనం డబ్బు సంపాదించడంకోసం జాతకాలు చెప్పడం , రాజుల అడుగులకు మడుగులొత్తడం , అబద్ధాలు చెప్పడం , ధర్మము తప్పి ప్రవర్తించడం , పితూరీలు చెప్పడం , హింసకు పాల్పడటం , పుస్తకాల్లో ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం వంటి అకృత్యాలకు పాల్బడుతున్నారు. మరి ఈ సంపాద ఎన్ని యుగాలుంటుందో ఏమో ? . అస్థిరం ,అశాశ్వతం , క్షణభంగురం , చంచలం అయిన ధనం కోసం మానవులు ఎన్నో అక్రమాలను చేస్తున్నారు . ఈ ధనమేమైనా వీరితో కలిసి యుగ యుగాలు ఉంటుందా ఏమిటి ?ఉండదు కదా ! ఈ విషయాన్ని మరచిపోయి వీరు మూర్ఖులై ప్రవర్తిస్తున్నారు. శాశ్వతుడవైన నిన్ను చేరడానికి మాత్రం వీరు ప్రయత్నించడం లేదనేది కవి వేదన .  .

శ్రీకృష్ణ శతకం.!........( 25 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
. . శ్రీకృష్ణ శతకం.!........( 25 /5/15)... (శ్రీ నరసింహ కవి.) . ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ ... మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా! . భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. . ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; నీవు అంటే నువ్వు; ఆదివరాహుడవు అంటే విష్ణుమూర్తి అవతారంగా వరాహ రూపం ధరించి; ఆ దనుజున్ అంటే రాక్షసుడయినటువంటి ఆ; హిరణ్యనేత్రున్ అంటే హిరణ్యాక్షుడిని; హతున్ అంటే చంపి; తగన్ అంటే ఒప్పుగా; మోదమునన్ అంటే సంతోషంతో; సురలు అంటే దేవతలు; పొగడగన్ అంటే ప్రశంసించగా; మేదినిన్ అంటే భూమిని; గొడుగున్ + ఎత్తి అంటే గొడుగులాగ పెకైత్తి; మెరసితి అంటే ప్రకాశించావు. సకలజీవరాసులూ నివసించటానికి అనువైన భూమి నీటిలో మునిగి ఉన్నందున, దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు. . ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ ర...

పులి-కంకణము-బాటసారి .!

Image
.   పులి-కంకణము-బాటసారి .! . నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము . ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓ ... రీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యి...

పాట పాడుమా కృష్ణా.!

Image
  లలిత గీతం సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు పాట పాడుమా..ఆఅ.. పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా...ఆఆఅ... శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె..ఏ.. శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె సదమల హృదయా నిన్ను సన్నుతింతు వరనామము పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమెగా..ఆఅ.. సామవేద సారము సంగీతము సాహిత్యమెగా దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా...ఆఆ..ఆ..  

మహాకవి ధూర్జటి .... శ్రీ కృష్ణ దేవరాయలు.!

Image
 . మహాకవి ధూర్జటి .... శ్రీ కృష్ణ దేవరాయలు.! . మహాకవి ధూర్జటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానకవి గా మన్నన లందినా తన కావ్యాలను మాత్రం శ్రీకాళహస్తీశ్వరునకే అంకితం చేశాడు. వైష్ణవ మతాన్ని స్వీకరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంతాన్ని కావ్యంగా వ్రాసిన శ్రీ కృష్ణ దేవరాయలు వీరశైవుడైన ధూర్జటిని తన ఆస్థానం లో పోషించడం శ్రీ రాయల వారి పరమత సహనాననికి ప్రతీక యని కొందరు వ్రాశారు. . ... విమర్శకులు భావిస్తున్నట్లుగా శ్రీ రాయల వారి మరణానంతరం కూడ ధూర్జటి జీవించి యుండవచ్చు. జీవనాన్ని కొనసాగించడానికి రాజులను ఆశ్రయించి , వారి అభిరుచుల కనుగుణం గా తానుండలేక ఇడుముల పాలయినట్లు గాను మనం భావించవచ్చు. కవి వ్రాసిన కవిత్వాన్ని తనకు అంకితం చేయకుండా ఉన్నా అతన్ని పోషించడానికి రాజులు అందరూ శ్రీ రాయలవారి అంత ఉదారులు ఉండరు కదా . అదే మహాకవి కి ఇబ్బందిని కల్గించి ఉంటుంది. మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ మహాదేవునికి కాక తన కవిత్వం మరొకరిపై చెప్పననే మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ రాజులకు కంటకమై , కవికి జీవనవ్యయానికి ఇబ్బంది క...

శ్రీకృష్ణ శతకం.!........( 24 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

Image
శ్రీకృష్ణ శతకం.!........( 24 /5/15)... (శ్రీ నరసింహ కవి.) . కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా! . ప్రతిపదార్థం: రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క; నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి. . భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! . ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ ప...

యమునితో ముఖాముఖీ.!

Image
. యమునితో ముఖాముఖీ.! . సాందీపని కృష్ణునికి గాయత్రీ మంత్రము ఉపదేశించినపుడు  ఆయనకు చిత్రమైన అనుభవం కలిగినది. గాయత్రీదేవికే గాయత్రి ఉపదేశిస్తున్న భావన. అపుడు కృష్ణుడెవరో ఆయనకు పూర్తిగా తెలిసినది. సామాన్యుల కంటే తక్కువ సమయంలోనే వారు విద్యలన్నీ నేర్చుకున్నారు.  చదువు పూర్తి చేసుకొని ఆయనను గురుదక్షిణ ఏమికావాలని అడిగారు. వారి శక్తి తెలిసిన గురువు తగిన కోరిక చెప్పారు. కొన్నిసంవత్సరాల క్రితం చనిపోయిన వారి పుత్రుని తిరిగి తెమ్మని అడిగారు. అదొక అద్భుత ఘట్టం.  . మనుష్యులు తప్పించుకొనలేనిది మృత్యువు., ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే దుఃఖాన్ని ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే.  అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు.  సావిత్రి యమునితో వాదించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగినది. నచికేతుడు యమునితో వాదించి యముని వద్దనుండి తిరిగి రాగలిగాడు.  కృష్ణుడు, బలరాముడు యముని వద్దకి వెళ్ళి సాందీపని పుత్రుని ప్రాణాలు తీసుకొని వచ్చారు.  కృష్ణుడు ఉత్తరాగర్భంలోని మృత శిశువుని బ్రతికేస్తేనే పరీక్షిత్తు బ్రతికి బట...

శ్రీ కృష్ణావతారం.!

Image
. శ్రీ కృష్ణావతారం.! . పంకజముఖి నీళ్ళాడగ , సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్ ... సంకటము దోచె , మెల్లన , సంకటములు లేమి దోచె సత్పురుషులకున్ . దివినుండి భువికి దిగి వస్తున్నాడు శ్రీకృష్ణుడు –దేవకీ మాత గర్భాన్నుండి . పురిటి నొప్పులతో సంకటపడుతోంది దేవకీ దేవి . చెడ్డవారి మనసుల్లో , సంకటాలు మొదలవుతాయనే భావం కలిగింది . మంచివారికి సంకటాలు తీరిపోతాయనే నిజం తెలిసింది . డీన్నే మనం ముద్దుగా సిక్స్త్ సెన్స్ అని అంటామేమో . . భాగవతంలో శ్రీకృష్ణావతార ఘట్టంలోని ప్రథమ పద్యం ఇది . దశమ స్కంధం పూర్వభాగం

శ్రీకృష్ణ శతకం.!........( 23 /5/15)... (శ్రీ నరసింహ కవి.).

మగ మీనమువై జలధిని శ్రీకృష్ణ శతకం.!........( 23 /5/15)... (శ్రీ నరసింహ కవి.).  . పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా! . భావం: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. . ప్రతిపదార్థం: సుగుణాకరా అంటే మంచి గుణములకు నెలవైనవాడా; దివ్యసుందర అంటే దైవసంబంధమైన సౌందర్యం కలవాడా; ఓ కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీవు అంటే నువ్వు; జలధిని అంటే నీటికి నిధి అయిన సముద్రంలో; మగమీనమువై అంటే మగచేపవై (మీనావతారం); పగతుని అంటే శత్రువు అయిన; సోమకుని అంటే వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుడిని; చంపి అంటే వధించి; పద్మభవునకున్ అంటే పద్మమునుండి పుట్టిన బ్రహ్మకు; నిగమములన్ అంటే వేదాలను; తెచ్చి యిచ్చితి అంటే తెచ్చిఇచ్చావు; మేలు అంటే ఎంత ఆశ్చర్యం! . చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పల...

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(23/5/15.)

Image
. శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(23/5/15.) . తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియు బెద్దల్చావగా జూడరో భీతిన్ బొందగనేల చావునకుఁగాఁబెండ్లాము బిడ్డల్హిత వ్రాతంబు ల్తిలకింప , జంతువులకు న్వాలాయమై యుండగా చేతోవీధి నరుండు నిన్గొలవడో శ్రీ కాళహస్తీశ్వరా ! . శ్రీ కాళహస్తీశ్వరా ! తమ తాతలు , తండ్రులు ,వృద్ధులు తమ కళ్ళముందే చావగా ఈ మానవులు చూస్తున్నారు కదా ! మరి చావంటే భయపడతారెందుకు ?భార్య ,పిల్లలు ,హితులు అందరూ చూస్తుండగానే జీవులకు చావన్నది దాపురించుచుండగా దానిక్కూడా భయపడుతున్నాడు ఈ మానవుడు. కాని నిన్ను మాత్రం మనస్సులో కూడ స్మరించలేక పోతున్నాడు. ఎంత దురదృష్టవంతుడో కదా ! . x

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(22/5/15.)

Image
. శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(22/5/15.) . పదివేలైనను లోక కంటకులచే ప్రాప్తించు సౌఖ్యంబు నా మదికిన్ పథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుడై సత్య దా ... న దయాదుల్గల రాజు నాకొసగు మే న్నన్వాని నీయట్ల చూ చి దినంబు న్ముద మొందుదుం గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా ! . శంకరా ! ప్రజారంజకులు కాని వారి వలన ప్రాప్తించు వేలకువేలైనను నా మనస్సునకు ఆనందమును కల్గించలేవు. అన్ని విధాల సమదర్శి గా ఉంటూ ,దయ , దాన , సత్య గుణములు గల్గిన రాజుని ఒక్కని నాకు ప్రసాదింపుము . చివరి వరకు ఆయన యందు నిన్ను దర్శించుకొనుచు , ప్రతిదినమును ఆనందించెదను స్వామీ !

ఆట కదరా శివా... ఆట కద కేశవా

Image
. ఆట కదరా శివా... ఆట కద కేశవా... ఆట కదరా శివ, ఆట కద కేశవ.. ఆట కదరా నీకు అమ్మ తోడూ... ఆట కద జననాలు... ఆట కద మరణాలు...మద్యలో ప్రణయాలు ఆట నీకు... ఆట కద సొంతాలు... ఆట కద పంతాలు... ఆట కద అంతాలు ఆట నీకు... ఆట కదరా నలుపు... ఆట కదరా తెలుపు... నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు... ఆట కదరా మన్ను... ఆట కదరా మిన్ను.. మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను... ఆట కదరా శివా.... ఆట కద కేశవా.... ..........(తనికెళ్ళ భరణి)

కాలం భగవంతుడే.!

Image
    . కాలం భగవంతుడే. కాలంలోనే సృష్టి జరుగుతుంది. కాలోస్మి అన్నాడు పరమాత్మ. కాలుడు అంటే యముడు, కాల ధర్మం అంటే మృత్యువు. వ్యక్తికి నూరేళ్ళూ, సృష్తికి అనంత కాల చక్రము.

శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). .

Image
. శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). . . శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ ... విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా! ప్రతిపదార్థం: నక్రగ్రహ అంటే మొసలిని చంపినట్టి; సర్వలోక అంటే అన్నిలోకాలకు; నాయక అంటే అధిపతివైనట్టి; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; శక్రసుతున్ అంటే ఇంద్రుని కుమారుడైన అర్జునుని; కాచుకొరకై అంటే రక్షించడానికిగాను; చక్రము అంటే సుదర్శన చక్రాన్ని; చేపట్టి అంటే చేతియందు ధరించి; భీష్ము అంటే భీష్మపితామహుడిని; చంపఁగ అంటే సంహరించడానికి; చను అంటే బయలుదేరిన; నీ అంటే నీయొక్క; విక్రమము + ఏమని అంటే పరాక్రమాన్ని ఏ విధంగా;పొగడుదు అంటే పొగడగలను. భావం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్న...

పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!.....(21/5/15.)

Image
పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!.....(21/5/15.) . మా అమ్మగారికి ఇష్టమైన పద్యం . ( భాగవత దశంస్కంధంలో కనిపిస్తుందీ కమనీయ పద్యం .) . "నంద తపఃఫలంబు ,సుగుణంబుల పుంజము , గోపకామినీ  బృందము నోముపంట ; సిరి విందు ; దయాంబుధి ; యోగి బృందముల్  డెందములందు గోరెదు కడింది నిధానము సేర వచ్చె నో  సుందరులార రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్" . రోహిణీ నక్షత్రం . గోపాలకృష్ణుని పుట్టిన దినం . కమ్మని కస్తూరి తావులు పుడమి అంతా అల్లుకున్నాయి . మనసు ఆనంద పరవశమయింది . తటాలున మా అమ్మ జ్ఞాపకం వచ్చింది . చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ నేర్పించిన పద్యం జ్ఞప్తికి వచ్చింది . శ్రీకృష్ణుడు మధురానగరానికి వస్తున్నాడు . సరస సంగీత శృగార చక్రవర్తి , సకల భువనైక చారుమూర్తి తమ నగరానికి వస్తున్నాడని తెలిసిన మధురానగర మనోహారిణుల మనసులు ఆనంద పరిప్లుతాలయినాయి .పరమాత్మ  దర్శనమిస్తే   హృదయం ఝల్లుమనదా ! శ్రీయుతమూర్తియై కరుణ చిందే చూపులతో శ్రీకృష్ణ పరమాత్మ మధురానగరంలో ప్రవేశించాడు . శ్యామలాంగుడు అల్లనల్లన అడుగులిడుతూ కనిపించాడు , ఆ పట్టణంలో నివసించే రమణులకు .  స్వామిని చూచిన ఆ భామినులు ముగ్ధులైపోయా...

చోద్యం చూస్తో చిన్నది.....(పొన్నాడ వారి రంగుల బాపు..ఎంకి..)

Image
చోద్యం చూస్తో చిన్నది.....(పొన్నాడ వారి రంగుల బాపు..ఎంకి..) . .ముద్దుల నా యెంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండ నీదురా కూసింతసేపు! నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ యీడుండ మంటాది యిలుదూరిపోతాది యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ మందో మాకో యెట్టి మరిగించినాదీ వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ (శ్రీ నండూరి సుబ్బారావు..)

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(21/5/15.).

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(21/5/15.). . కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణ క్రియా లీలాచాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళవ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రా నాహార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదు నామ మరయన్; శ్రీ కాళహస్తీశ్వరా ! . శ్రీ కాళహస్తీశ్వరా ! దిక్కులనే వస్త్రములుగా ధరించిన వాడా ! దిగంబరా ! శంకరా ! నీ నామము యమధర్మరాజు లోకమున ప్రవేశించుటకు గల తలుపు నకు గడియ వంటిది.యముని విజృంఙణలను లీలగా అడ్డుకో గల్గినది. చిత్రగుప్తుని నోరు అనెడి పుట్టయందు కదలాడెడి నాలుక యనెడి మహాసర్పమునకు గరుత్మంతుని వంటిది . మృత్యుదేవత నోటియందలి కోరలనెడి పర్వతాలకు వజ్రాయుధము వంటిది. నీ నామమును స్మరించి నంతనే మృత్యువు దూరంగా తొలగి మోక్షము లభించును కదా ! “దిక్చేలాలంకృత “ ఎంత అందమైన సంబోధన . మహాకవి ఏకేశ్వరోపాసకుడై మహాశివుని మాత్రమే పరదైవతం గా భావించి ,పూజించాడు . తాను వ్రాసిన రెండు కావ్యాలను ఆ మహాదేవునికే సమర్పించిన పరమభక్తుడు. “ నమశ్శివాయ “ అంటేనే పాపాలు పటాపంచలౌతాయి. “నమశ్శివయ్య” అంటే ఆ స్వామి అక్కున చేర్చుకుంటాడు .

శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). .

Image
శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). . . అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! . . ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు. . ప్రతిపదార్థం: కృష్ణా అంటే శ్రీకృష్ణా; అందెలు అంటే కాలికి అలంకారంగా పెట్టుకునే కడియాల వంటి ఆభరణం; గజ్జెలు అంటే ఘల్లుఘల్లుమని శబ్దం చేసే కాలియందు ధరించిన గ జ్జెలు; మ్రోయగన్ అంటే శబ్దం చేస్తుండగా; చిందులు అంటే కాళ్లతో అస్తవ్యస్తంగా చిందులు; త్రొక్కుచును అంటే వేస్తూ; వేడ్క అంటే ఆనందం; చెలువారంగా అంటే అందం ఎక్కువ అవుతుండగా; నందుని సతి అంటే గోకులంలో ఉండే నందుని భార్య అయిన యశోద; ఆ గోపిక అంటే గోపకాంతకు (తల్లి అయిన యశోదకు); ముందర అంటే ఎదురుగా నిలబడి; మిగుల అంటే ఎక్కువగా; మురియుచు అంటే ఆనందిస్తూ; ఆడుదువు అంటే నాట్యం చేస్తావు .. పసిపిల్లల కాళ్లకు కడియాలు అలంకరించి తల్లి మురిసిపోతుంది. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని శ...

కరుణ శ్రీ.!

Image
కరుణ శ్రీ.! . "ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై." x

ఉత్తర రామాయణంలో సీత.!

Image
ఉత్తర రామాయణంలో సీత.! . తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు      దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు      గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు      బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు. . పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది. . రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు “ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది. రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే ...

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(20/5/15.).

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(20/5/15.). . మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా ! మోక్షంబు నేడే మయా ముదియంగా ముదియంగ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు న న్నది సత్యంబు , కృప దలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ న్గొ ల్చి దినంబు న్మొరపెట్టగా కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా ! . శ్రీ కాళహస్తీశ్వరా ! పూర్వము నీ భక్తుల కెందరకో మోక్షమిచ్చావు కదా . మరి ఇప్పుడేమయ్యింది. ముసలి తనం లో రాను రాను పిసినారితనం పెరుగునన్న మాటలు నిజమే . లేకపోతే ఒక పుణ్యాత్ముడు ఆత్మ లో నిన్నే ఆరాధిస్తూ , రోజంతా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవు. అయ్యో ! ఎంత దారుణమయ్యా ! . ఈ పద్యంలో “రోజంతా వేడుకుంటున్న పుణ్యాత్ముడు “ ఎవరో కాదు మహాకవి ధూర్జటి యే. ఇంతకు ముందు , రాబోయే పద్యాల్లో కూడ తాను పాపాత్ముడ నని ,చెడ్డవాడనని ఆదుకోమని వేడుకున్న కవి ఇక్కడ తానొక పుణ్యాత్ముడనని చెప్పుకుంటున్నాడు . అంటే ముసలి తనం పైకొచ్చి ఆత్మస్తుతి పెరిగిందా అనిపిస్తుంది. కాని కాదు. పాపం శమించుగాక ! . ఒక మహాకవి హృదయం లో ఏ సమయం లో ఎటువంటి భావతరంగాలు ఎగసి పడి, ఎటువంటి భావాలను పండిస్తాయో విశ్లేషించడం సామాన్యులకు కసాధ్యమైన విషయం . విశ్వకవి రవీంద్ర...

శ్రీకృష్ణ శతకం.!........( 20/5/15)... (శ్రీ నరసింహ కవి.). .

Image
శ్రీకృష్ణ శతకం.!........( 20/5/15)... (శ్రీ నరసింహ కవి.). . చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా! . ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; ఒక రమణి అంటే ఒక స్త్రీ; ముద్దులు చిలుకను అంటే అందంగా, ముద్దులొలికేలా; చిలుకన్ అంటే ఒక చిలుకను; శ్రీరామ + అనుచు అంటే శ్రీరామా అని పలికేలా; శ్రీపతి అంటే విష్ణుమూర్తి యొక్క; పేరున్ అంటే పేరును; పిలిచినన్ అంటే పలికినంతచేతనే; మోక్షమున్ అంటే మోక్షాన్ని; ఇచ్చితివి అంటే అనుగ్రహించావు; మిమున్ అంటే భగవంతుడవైన నిన్ను; తలచు అంటే స్మరించే; జనులకున్ అంటే మామూలు మనుషులకు లభించటంలో; అరుదా అంటే లభించదా (లభిస్తుంది). భావం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ...

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

Image
  పోతన గారి భాగవత పద్యం.! . 'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా ... కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".! . (చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .) . సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు . ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు . అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు . శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ , పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి . ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు . మాతృమూర్తిని ఆర్తితో అడిగ...

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(19/5/15.)

Image
  శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(19/5/15.) . ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేఁడెల్లియో కడ నేడాది కొ యెన్నడో యెరుగమీ కాయంబు లీ భూమిపై ... బడగా నున్నవి , ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో ? శ్రీ కాళహస్తీశ్వరా ! . . ఈశ్వరా ! ఘడియకో ,రెండు ఘడియలకో ,మూడు ఘడియలకో కాకపోతే రేపో , ఎల్లుండో మరి ఏడాదికో ఈ శరీరాలు భూమిపైన పడబోతున్నాయన్న విషయం తెలిసి కూడ ఈ మానవులు ధర్మమార్గాన్ని అనుసరించడం లేదు. మూర్ఖులైన వీరు నీ పాదాలను సేవించడం వలన కలిగే ప్రయోజనం కూడ తెలుసుకోలేకపోతున్నారు .  

సు0దరకా0డ

Image
                            సు0దరకా0డ.! . శ్రీ హను మాను గురుదేవులు నాయెద..పలికిన సీతా రామకథ. . (సుందర దాసు .. ఏం.ఎస్. రామారావు గారి సీతా రామకథ.) శ్రీ హను మాను గురుదేవులు నాయెద పలికిన సీతా  రామకథ నే పలికెద సీతా రామకధ (వరుస క్రమముగా చదవవలేను) సి0ధుభైరవి 1) శ్రీ హనుమ0తుడు అ0జనీసుతుడు   / అతి బలవ0తుడు రామభక్తుడు ల0కకు పోయి రాగల ధీరుడు              /మహిమోపేతుడు శత్రు కర్మనుడు జా0బవదాది వీరు ల0దరును              /ప్రేరెపి0పగ సమ్మతి0చెను ల౦కేశ్వరుడు అపహరి0చిన                /జానకి మాత జాడ తెలిసికొన 2) తన త0డ్రి యైన వాయుదేవునకు       /సూర్య చ0ద్ర బ్రహ్మాది దేవులకు వానరే0ద్రుడు మహే0ద్రగిరిపై              / వ0దనములిడె పూర్వాభి ముఖుడై రామనామమున పరవశుడయ్యె         /రోమ రోమమున పులికితుడయ్యె కాయము పె0చె ...