🔻 రుక్మిణీ కళ్యాణం.!🔻 రుక్మిణిసోదరుడురుక్మిభంగపాటు...కొనసాగింపు.11.. (పోతనామాత్యుడు)



                        🔻 రుక్మిణీ కళ్యాణం.!🔻
రుక్మిణిసోదరుడురుక్మిభంగపాటు...కొనసాగింపు.11..
(పోతనామాత్యుడు)
.
జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి తన నగరంబునకుం జనియె !
.
రుక్మిణి సోదరుడు రుక్మి ,కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె.
.
"బల్లిదు, నన్ను భీష్మజనపాల కుమారకుఁ జిన్నచేసి నా
చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ
గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ దోలుము; తేజితోల్లస
ద్భల్ల పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్."
భావము:
“బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.”
.
ఇలా పలికి. రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లవాడా! వెన్న దొంగ! ఒక్క నిమిషం ఆగు” అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి మూడు వాడి తూపులతో చక్రిని కొట్టాడు.
హరి నొప్పించి యిట్లనియె..
.
"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ;
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి? ;
వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు;
మాయఁ గైకొని కాని మలయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు;
వసుధీశుఁడవు గావు వావి లేదు;
-
"కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు."
.
భావము:
నువ్వు మాతో సమానుడవా ఏమిటి
(భగవంతుడు కదా మాకన్న అధికుడవు).
ఎంత మాత్రం వాడివి (మేరకందని వాడవు).
వంశ మేదైనా ఉందా (స్వయంభువుడవు).
ఎక్కడ పుట్టావు (పుట్టు కన్నది లేని శాశ్వతుడవు).
ఎక్కడ పెరిగావు (వికారరహితుడవు
కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు).
ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు (అంతుపట్టని నడవడిక కలవాడవు). అభిమానం లేదు (సాటివారు లేరుకనుక మానాభిమానాలు లేని వాడవు). హద్దు పద్దు లేదు (కొలతలకు అందని హద్దులు లేని వాడవు). మాయ చేయకుండ మెలగవు (మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు). స్వస్వరూపాన్ని పగవారికి చూపవు (నిర్గుణ నిరాకారుడవు).
క్షత్రియుడవు కావు (జాతి మతాలకు అతీతుడవు).
వావివరసలు లేవు (అద్వితీయుడవు ఏకోనారాయణుడవు).
అసలు నీకు గుణాలే లేవు (త్రిగుణాతీతుడవు).
అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు. మా పిల్లని మాకు ఇచ్చెయ్యి.
విడిచిపెట్టు. విడువకపోతే యుద్దంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా.”
.
ఇలా రుక్మిప్రగల్భాలు పలుకుతుంటే, గోవర్దనగిరిధారి కృష్ణుడు నవ్వి, ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. ఆరు బాణాలు శరీరంలో దిగేసాడు. ఎనిమిది బాణాలతో రథాశ్వాలని కూల్చేసాడు. రెండింటితో సారథిని చంపాడు. మూడు బాణాలతో జండాకర్ర విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు. అలా వరసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నిటిని ముక్కలు చేసాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చు పై వచ్చి పడే మిడతలా, రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం పిండిపిండి చేసేసాడు. ఒరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జళిపించి వాని తల నరకబోగా, రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది.
.
నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో
సన్నుతామలకీర్తిశోభిత! సర్వలోకశరణ్య! మా
యన్న యీతఁడు నేడు చేసె మహాపరాధము నీ యెడన్
నన్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిథీ!
భావము:
"ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడ! సకల లోకాలని కాపాడేవాడా! దిక్కులేని వారికి దిక్కైనవాడ! దయామయా! శ్రీకృష్ణ! వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేసాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు" అంటు రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది.
.
కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదు రీశ్వరా!"
భావము:
ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో పొగిలిపోతారు నాథా!"
.
అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతోఁ
గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ
క్కిన రుక్మిం దెగ వ్రేయఁబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై.
భావము:
ఇలా రుక్మిణి గద్గదస్వరంతో మిక్కలి భయ కంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిసాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిని చంపక వెనుదిరిగేడు.
.
ఇట్లు చంపక "బావా! ర" మ్మని చిఱునగవు నగుచు వానిం, బట్టి బంధించి, గడ్డంబును మీసంబునుం దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాణుండై కట్టుబడి యున్న రుక్మిం జూచి కరుణజేసి, కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి డగ్గఱి యిట్లనియె.
భావము:
ఇలా చంపడం మాని, శ్రీకృష్ణుడు వానిని “బావా! రా” అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతు పట్టి బంధించాడు.
ఓ కత్తిలాంటి పదునైన బాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారలు చారలుగా గీసి వికృతరూపిని చేసాడు.
అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమేసి అక్కడకి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు.
.
"తల మనక భీష్మనందనుఁ
దలయును మూతియును గొఱుగఁ దగవే? బంధుం
దలయును మూతియు గొఱుగుట
తల తఱుఁగుటకంటెఁ దుచ్ఛతరము మహాత్మా!
భావము:
"కృష్ణా! మహాత్మా! రుక్మిని తప్పుకోమనకుండ ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపటంకంటె తుచ్చమైన పని." అనిబలరాముడు చెప్పసాగాడు.
.
కొందఱు రిపు లని కీడును;
గొందఱు హితు లనుచు మేలు గూర్పవు; నిజ మీ
వందఱి యందును సముఁడవు;
పొందఁగ నేలయ్య విషమబుద్ధి? ననంతా!"
భావము:
శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ది." - రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు ఇలా అన్నాడు.
.
ఇలా కృష్ణుని విమర్శించిన బలరాముడు, రుక్మిణితో ఇలా అన్నాడు
.
"తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం
గీడున్ మేలును జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ
తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్."
భావము:
“అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు.
.
చంపెడి దోషము గలిగినఁ
జంపఁ జనదు బంధుజనులఁ జను విడువంగాఁ
జంపిన దోషము సిద్ధము
చంపఁగ మఱి యేల మున్న చచ్చిన వానిన్.
భావము:
చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి.
.
బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు
గల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి
తోడిచూలు నైనఁదోడఁ బుట్టినవాఁడు
చంపుచుండుఁ గ్రూర చరితుఁ డగుచు.
భావము:
రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం.
.
భూమికి ధన ధాన్యములకు
భామలకును మానములకుఁ బ్రాభవములకుం
గామించి మీఁదుఁ గానరు
శ్రీ మదమున మానధనులు చెనఁకుదు రొరులన్.
భావము:
మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అర్రులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు.
.
రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ది కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారు లందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణా లైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశమనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత.
.
అజ్ఞానజ మగు శోకము
విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
యజ్ఞానుల భంగి వగవ, నంభోజముఖీ!"
భావము:
పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగ దుఃఖించుట తగదు. అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు.
.
– బహు కఠినమైన జ్ఞకార ప్రాసతో, అది అచ్చు ఆ కూడ ప్రాసగా సమానంగా ఉంచి, అజ్ఞాన విజ్ఞాన, ప్రజ్ఞానాలతో ఇలా అమృత గుళికను అందించిన పోతనగారికి ప్రణామములు.
.
ఇలా బలరామునిచేత ప్రభోధింపబడి, రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది.
.
అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిఙ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!