శ్రీకాళహస్తీశ్వరా!
తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ! శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా! ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ...