శ్రీమతి ఎ. అనసూయదేవి.....

"కళావ్రీణ" "కళాప్రపూర్ణ", పద్మశ్రీ డా|| బాలమురళీకృష్ణ

తొలి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీని మూడు అకాడమిలుగా విభజించటంతో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి 1981 ఫిబ్రవరి 1 వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఈ అకాడామి మొదటి గౌరవ అధ్యక్షులుగా ప్రభుత్వం నన్ను నియమించి సంగీతలోకానికి సేవచేసే భాగ్యాన్ని కలిగించింది.

ఇప్పుడు
శ్రీమతి ఎ. అనసూయదేవిగారిచే సేకరింపబడి స్వరపర్చ బడిన ఈ "జానపదగేయాలు" ప్రచురించటం జరిగింది. ఇది మా అకాడమి యొక్క రెండవ ప్రచురణ.

కళాప్రపూర్ణ డా|| శ్రీమతి అనసూయదేవి జానపదగేయాలను స్వరపరచి సంగీత అకాడమికి ఇచ్చి అకాడమి ద్వారా ముద్రించటం ముదావహము. ఈ సంతోషమే నేను ఈ నాలుగు మాటలు వ్రాయుటకు కారణము.

అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. కాని అనసూయ అంటే చాలా మందికి అసూయ ఉంది.

అనసూయ, అంటే అసూయ లేనిది అని అర్థం.కాని, అనసూయ అంటే చాలా మందికి అసూయ వుంది. ఇతరులు పలువురు మనల్ని చూసి ఎప్పుడు అసూయ పడతారో, అప్పుడు మనం ప్రసిద్ధులమనీ, మనం అభివృద్ధి పొందుతున్నామనీ, అర్థం చేసుకోవాలి. ఎవరో అన్నట్టు జ్ఞాపకం. "The jealousy and controversy are the rails on which the life train can safely travel and reach the destination".

డా|| అనసూయను గురించి నాకంటే తెలిసినవారు, నాకన్న పెద్దవారు అనేకులున్నారు. నాకు సుమారు 1939 నుంచి తెలుసును. ఆ కాలంలోనే, అంటే నాకు బాగా చిన్న వయస్సులోనే, నేనక్కడ పాట కచేరీలకు వెళ్ళినా, అనసూయ, సీత, పాట కచేరీలు వుండేవి. వీళ్ళు నాకు Seniors, ఆత్మీయులు, సోదరీమణులు.

శ్రీమతి అనసూయ గొప్ప పండిత వంశంలో జన్మించారు. వీరి తండ్రిగారు పద్మశ్రీ వింజమూరి లక్ష్మీ నరసింహరావుగారు అద్భుతమైన ప్రతిభాశాలి, గొప్ప కవి. వీరి నాటకాలు, పద్యాలు, వీరి కవిత, దేశం నలుమూలలా వ్యపించింది. వీరి తల్లిగారు వింజమూరి వెంకటరత్నమ్మగారు కూడ గొప్ప కవయిత్రి, విదుషీమణి. "అనసూయ" అనే స్త్రీల మాస పత్రిక సంపాదకు రాలు. అనసూయ అదృష్టం, ఆమె భర్త గిరిగారు, వారి ఆదరణ, ప్రోత్సాహం, అనసూయకు గర్వకారణం. అంతేకాక, తన కుమార్తె రత్నపాప శ్రీమతి రత్న అనిల్‌కుమార్ కూచిపూడి, భరతనాట్యాలలో, ప్రపంచ ఖ్యాతి గాంచిన నాట్యతార. అనసూయ పిల్లలందరూ కళాకారులే. పంచరత్నాలు. వీటన్నింటికంటె తన సోదరి సీత-వీళ్ళ అన్యోన్యం, అవినాభావత్వం, ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లప్పుడూ ఒక్కలా దుస్తులు ధరించే వీరిరువురిలో, ఎవరు అనసూయ, ఎవరు సీతో, చాలామందికి, చాలాకాలం వరకూ, తెలియదు. అటువంటి సోదరి సీత దొరకడం నిజంగా అనసూయ అదృష్టం అనాలి. అయితే, తను సంగీతం సమకూర్చిన లలితగీతాలన్నీ చెల్లెలికి నేర్పించి, తనతో కూడ పాడించి, సీత జానపద "రిసెర్చి"కి తోడ్పడి తనంతటి దానిగా తయారుచేసిన అనసూయలాంటి సహృదయురాలైన అక్క దొరకడం సీత అదృష్టం కూడాను మరి.

డాక్టరు అనసూయాదేవి, జానపద సంగీతం, లలిత సంగీతాలకి చేసిన సేవ సువిదతం. జానపద సంగీతం అనాది, శాస్త్రీయ సంగీతానికి పునాది. నిష్కల్మషమైన హృదయంలోంచి, తానుగా ఉద్భవించింది జానపద సంగీతం. దీనిని క్షుణ్ణంగా తెలుసుకుని పాడలేని వారు సంగీత విద్వాంసులు కాలేరు. జానపదగేయాలు పాడడానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు అంటే సాహిత్య జ్ఞానం, యాస, సంగీతజ్ఞానం, - ఇవన్నీ సరైన పద్ధతిలో గుర్తించి పాడినప్పుడు, విన్నప్పుడు, మన హృదయాలు స్పందిస్తాయి. ఈ విషయాలు చక్కగా గుర్తించి అనసూయ ఎంతో రిసెర్చి చేశారు. ఈమె బి.ఎ. డిగ్రీ తీసుకుని, కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఈమె గురువు సంగీత సాంరాట్ ముగుగంటి వెంకట్రావు పంతులుగారు. అనసూయ లలితగేయాలెన్నో సంగీతం కుర్చి పాడి లలిత సంగీతాన్ని ప్రచారంలోకి తెచ్చిన ప్రధమురాలు. సుప్రసిద్ధులైన ఎందరో కవుల గేయాలకి సంగీతం సమకూర్చి ప్రజలకందించారు. మేనమామ అయిన కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం మొదలైన రచనలన్నీ శ్రీమతి అనసూయ శుక్లపక్షంలోకి తెచ్చారు. వీరు హార్మోనియమ్‌ వాద్యంలో అందెవేసిన చేయి. నా ఎరకలో ఇంత బాగా వాయించగలిగిన ఆడువారిని నేనెరుగను.

ఆకాశవాణిలో, జానపద సంగీతాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్యకారకులు అనసూయ. జానపద సంగీతాన్ని కచేరీలలో కూడా పాడి దేశమంతట ప్రచారం చేశారు. సుభాష్ చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, డా|| రాధాకృష్ణన్, వి.వి.గిరి, శ్రీమతి ఇందిరాగాంధీ మొదలైన సుప్రసిద్ధుల ఎదుట గానం చేసి సెబాష్ అనిపించుకున్నారు.

వీరు అనేక రకమైన బాధ్యతలు స్వీకరించారు. ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా, కళాశాలల్లో సంగీతాధ్యాపకురాలిగా, ఆడిషన్ బోర్డులో మెంబరుగా, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ మెంబరుగా, ఆంధ్ర యూనివర్సిటీలో బోర్డు ఆఫ్ స్టడీస్ మెంబరుగా, జానపద కళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా జానపద సంగీతానికి ఎనలేని సేవచేశారు. జానపపదాలు పాడుటలో ఈమెను మించినవారు లేరు. అంతేకాదు, ఈమె కొన్ని సినిమాలకు సంగీతం సమకూర్చారు. సంసారం బాధ్యత వల్ల సినిమాను వృత్తిగా గ్రహింపనప్పటికీ, ప్రతిభలో నేటి సంగీత దర్శకులెవరికీ ఈమె సీసి పోదని నా నమ్మకం. వీరి సంగీత దర్శకత్వంలో నేను చాలా పాటలు సినిమాలో పాడియున్నాను.

నాల్గు దశాబ్దులుగా కళకోసం జీవితాన్ని ధారపోసి, ముఖ్యంగా జానపద సంగీతాభివృద్ధికి మాత్రమే కాక, జానపద సంగీతోద్ధరణకు కారకురాలిగా నిర్విరామంగా కృషిచేస్తూ నేటికి వారి అనుభవాన్ని ఒక గ్రంధరూపంగా వెలువరించడం ఒక గొప్ప విశేషం. సంపూర్ణ రాగాల్లో ఉండే జానపద గేయాలు అరుదు. చాలా వరకు రాగచ్ఛాయల్లో ఉండేవే అధికంగా ఉంటాయి. అందుకనే, ప్రతీ పాటకు ముందు, ఆ పాట ఫలానా రాగపు స్వరాల్లో, ఫలానా తాళంలో ఉందని, అనసూయాదేవి రాగ, తాళ, విభజనచేసి, ఆ పాటకు "నొటేషన్" వ్రాస్తూ వచ్చింది. ఈ కృషి శ్లాఘనీయం. జానపద సంగీతం స్వరబద్ధంగా ముద్రించి, ముందుతరాల వారికి లభింప చేయడం కన్న ముఖ్యమైన సేవ మరేముంది.

శ్రీమతి అనసూయ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు "కళాప్రపూర్ణ" అనే గౌరవ డాక్టరేట్ పట్టం ఇవ్వడం ఎంతయూ సముచితం. ప్రశంసార్హం.

ఈ గ్రంథ ముద్రణలో మాకు తోడ్పడిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ మంచాళ జగన్నాథరావు గారికి, చక్కగా ముద్రించిన నాట్యకళ ప్రెస్ నిర్వాహకులకు మేము కృతజ్ఞఉలము.

ఇట్లు

డా|| మం. బాలమురళీకృష్ణ

అద్యక్షులు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!