ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు..

ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు......By Vinjamuri Lakshmi Narasiharao...


దేవదాసు (అక్కినేని) తన తండ్రితో పార్వతి విషయం చెప్పినప్పుడు జమీందారు (ఎస్ వి.రంగారావు) టేబిల్ డ్రాయరు తెరిచి అందులోనుండి ఓ రివాల్వర్ తీసి టేబిల్ పై పెట్టి " నా గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకూ ఈ పరువు ప్రతిష్టలు లేని పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవడం అంగీకరించలేను. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలంటే ఈ రివాల్వర్ తో నన్ను కాల్చి ఆ పైన నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో" అంటాడు. అప్పుడు దేవదాసు ఏమీ చెప్పలేక పట్నం వెళ్ళిపోతాడు. 


పదహైదేళ్ళ వయస్సులో చూసినప్పుడు.

ఛ! ఈ నాగేశ్వరరావు ఒట్టి పిరికి, అదే మా ఎన్. టి. రామారావు అయితేనా (అప్పట్లో నేను ఎం టి రామారావు పార్టీ.) తండ్రిని ఎదిరించి అయినా పెళ్లి చేసుకునే వాడు. మనస్పూర్తి గా ప్రేమించిన అమ్మాయి కోసం తల్లి తండ్రులు కాదు లోకంఅంతా అడ్డం వచ్చినా ఖాతరు చెయ్యకుండా పెళ్ళిచేసుకోవాలి వాడే అసలయిన మగవాడు. అంత గుండె ధైర్యం లేనివాడు అమ్మాయిని ప్రేమించడానికి అనర్హుడు. అనుకున్నాను.


పదహారేళ్ళ వయస్సులో మళ్ళీ దేవదాసు సినిమాను చూసినప్పుడు :

పార్వతి తండ్రిని అవమాన పరచి పంపి వేసిన తరువాత, దేవదాసు పార్వతిని తీసుకుని పట్నం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉంటె దేవదాసు తండ్రి ఏమి చేసేవాడు. నాలుగు రోజులు భీష్మించుకుని ఆ తరువాత మెల్లిగా తన మనస్సు సమాధాన పరచుకునే వాడు కదా. ఒప్పుకోడని తెలిసికూడా తండ్రిని అడగడమెందుకు? రివాల్వర్ తీసి తనను చంపి పార్వతిని పెళ్లి చేసుకోఅంటూనే, అలిగి పట్నంవెళ్ళిపోయి ఏం సాధించాడు? తిరిగి పల్లెకు వచ్చేసరికి పార్వతి పెళ్లి నిశ్చయమయింది అని తెలిసి రా నా జతలో వచ్చెయ్యి అని పార్వతిని ఒప్పించలేక పోయాడు . "అదే నేనయితేనా! నేను ఇంకా ఎవరినీ ప్రేమించలేదు. ఒకవేళ ఎవరి నైనా ప్రేమించి ఉంటేనా, ఆ అమ్మాయికోసం ఎవరు అడ్డంవచ్చినా నిలువునా నరికివేసేవాడిని" అనుకున్నాను.


పద్దెనిమిది ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు;

అమ్మాయిలకు, ఓణీ వెయ్యగానే ప్రేమించడానికి అర్హత వచ్చేస్తుంది, కానీ అబ్బాయిలకు మాత్రం తన కాళ్ళమీద నిలబడి తాను ప్రేమిస్తే ఆ ఆమాయిని ఎలాంటి పరిస్తితిలో నైనా పెళ్లి చేసుకునే దైర్యం ఉంటే గానీ ఓ అమ్మాయిని ప్రేమించడానికి అర్హత రాదు. అల్లాంటి యోగ్యత, ధైర్యము లేని అబ్బాయిలు ప్రేమ గీమ అనకుండా వాళ్ళ తండ్రులు నిశ్చయించే ఆమ్మాయిని తలవంచుకుని పెళ్లి చేసుకోవడం మంచిది. అలా కాకుండా కన్నె వయస్సులోని అమ్మాయిల మనసులను దోచి సమయానికి పిరికివాడిలాగా వెనక్కు వెళ్ళిపోవడం మహా పెద్ద నేరం.


ఇరవయి ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు;

"అవును జమీదారు వెనకటి తరం మనిషి, ఆయన పరువు ప్రతిష్టలకై పట్టుబట్టడం సహజమే. తను ఈ తరం వాడు కదా, తన తండ్రిని నయానో భయానో, అదే రివాల్వర్ తీసుకుని తనకు గురి పెట్టుకుని పెళ్ళికి ఒప్పుకుంటావా లేక నన్ను కాల్చుకొమంటావా, అని అడిగి ఉండాలిసింది. ఒక్కగా నొక్క కొడుకు కోసం జమీందారు దిగి వస్తుండేవాడేమో. ఏమీ చెయ్యకుండా అలా పట్నం వెళ్ళిపోవడం వల్ల ఎ ప్రయోజనంలేదు అని దేవదాసుకు తెలియలేదే" అనుకున్నాను.


ఇరవయి అయిదేళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు; 

అప్పటికి నాకు పెళ్లయింది. మన ప్రయత్నం మనం చేశాము. కేవలం తన పిరికితనంతోనే, పార్వతితో పెళ్లి కాలేదు. అందుకని పగలూ రాత్రీ తాగడం వల్ల ఎం లాభం? మరిచిపోవడానికి ప్రయత్నించడానికి ఇతర మార్గాలేవీ కనుపించాలేదా? పార్వతిని తలుచుకుంటూ పగలూ రాత్రీ అదే చింతిస్తూ తాగుతూ ఉంటే అది మరచిపోవడానికి మార్గం కాదు కదా? మనస్సు రాయి చేసుకుని ఎలా పార్వతి ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంసారం చేస్తోందో అలాగే తనూ పార్వతిని మరచిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి. ఆ సంసారంలో పడి పార్వతిని మరచిపోవడానికి ప్రయత్నించాలి" అని అనుకున్నాను.


ముప్పయి ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు; 

మొదటినుండీ పార్వతి దేవదాసుల ప్రేమ అంత గట్టిదనిపించడం లేదు. ఏదో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. లండన్ కెళ్ళి చదువుకుని వచ్చినప్పుడు కూడా, దేవదాసు పార్వతి ని పెళ్లి చేసుకోవడానికి తహతహలాడలేదు. ఇంకా అలా చెప్పాలంటే కన్నెవయస్సులోని పార్వతి కలలు కనడం సహజమే. అయినా ఆ కలలన్నీ అటక పైనపెట్టి తన ముసలి మొగుడితో కాపురం చేసుకుంటోంది కదా. అంత ఇరవయి నాలుగు గంటలూ తాగి తాగి పార్వతిని తలచుకునేంత ఘాటు ప్రేమ దేవదాసులో కనపడలేదు. అయిదేళ్ళు సంసారం చేసిన తరువాత, ఎటువంటి దాన్ని పెళ్లి చేసుకున్నా, కొంతకాలానికి ఇద్దరిలో పోట్లాటలు తప్పవు అని తెలిసింది. అంత పార్వతికై తనను తాను నాశనం చేసుకోవడానికి దేవదాసు పిచ్చివాడాయి ఉండాలి అంతే" అనుకున్నాను 


ముప్పయి అయిదు ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు;

పార్వతిని పెళ్ళిచేసుకోలేదు కాబట్టి పార్వతిని మరచి పోలేక పోతున్నాడేమో, పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఈసరికి పార్వతి, మీద ప్రేమ/ మోహం తగ్గిపోయి ఉండేదేమో? అయినా చీకటిలో అందరు ఆడవాళ్ళు ఒక్కటే కదా. ఒక వస్తువు దొరకనప్పుడు దాని విలువ పెరిగి పోతుంది. అలాగే అది దొరికినప్పుడు/ దాన్ని అనుభవించేసినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది కదా. అందుకు పార్వతయినా, వనజయినా, గిరిజయినా పెళ్లి చేసుకోవడం వల్ల ఒక్కటే ఫలితాన్ని దొరుకుతుందని, నా చుట్టూ పక్కల ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా కాపురం చేస్తున్నారో చూస్తున్నప్పుడు అసలు ప్రేమపెళ్లిల మీద నమ్మకం పోయేస్తోంది. అనుకున్నాను.


నలభయి ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు; 

పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే ఈపాటికి పార్వతంటే మోహంమొత్తి అసలు తనను నిజంగా ప్రేమించలేదని, అలాగే పార్వతికి తనను నిజంగా ప్రేమించలేదని విసుగు పుట్టి ఎడమొహం పెడమొహాలు వేసుకుని, జమీందారు కాబట్టి దేవదాసు, ఏ చంద్రముఖినైనా చేరదీసి ఉండేవాడేమో ? ప్రేమించి పెళ్లిచేసున్నాక, ఏ ఆడదైనా ఒక్కటే చేస్తుంది అదే మొగుడిని నామీద నీకు మొదట ఉన్న ప్రేమ తగ్గిపోయింది అని వేపుకుతినడం. అందుకు పార్వతయినా, వనజయినా, గిరిజయినా ఫలితం ఒక్కటే. తలపగల కొట్టుకుని చావడానికి రాయి రంగు చూడాలా? ఎర్ర రాయైనా నల్ల రాయినా ఒక్కటే! అనుకున్నాను.


ఇంతకీ దేవదాసు పార్వతి ప్రేమను గురించి మీ అభిప్రాయం ఏమి అని అడిగితే

షాజహానుకు పెళ్ళాం మీద నిజంగా ప్రేముందో ఎవరికీ తెలియదు కానీ అతన ఆమె పేరుతో తాజ్ మహలును కట్టించాడని ఓహో అతనికి తన పెళ్ళాం మీద ఎంత ప్రేమో అని అందరూ అనుకుంటారు.ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేక పోయినవాళ్ళ కథలన్నీ ఇలాగ అమర ప్రేమ గాథలు అవుతాయి. అయితే ఇంతకన్నా గాడంగా ప్రేమించుకున్న ప్రేయసి ప్రియులు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ కథలు ఏమయినాయి అని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నతరువాత ఆ ప్రేమ అల్లాగే ఉండదు అని అందరికీ తెలుసు. ఒక వస్తువును పొందేంతవరకూ వున్న ఆకర్షణ, ఆ వస్తువును పొందిన తరువాత క్రమంగా సహజంగా తగ్గి పోతుంది. పార్వతిని దేవదాసు పెళ్లి చేసుకుని ఉంటే అది మామూలు కథ అయిపోయేది. లైలా మజ్ను, శీరీ పర్హాద్ , రోమియో జూలియట్ ల కథలు ఇలాంటివే వాళ్ళ ప్రేమలు సఫలం కాక, ఒకరో ఇద్దరో చచ్చిపోతారు కాబట్టి అవి అమర ప్రేమ కథలయినాయి.


నాదృష్టిలో ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు అని అంతే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!