"భాస్కర రామాయణము" లోని కిష్కింధాకాండము

"భాస్కర రామాయణము" లోని కిష్కింధాకాండము మల్లికార్జునభట్టు ప్రణీతము!

(వివరణ....పిస్కా సత్యనారాయణ గారు.)

వాలి వధ జరిగిన తర్వాత, వర్షాకాలం వచ్చిన సందర్భములోని ఒక పద్యమును అవలోకిద్దాం. 


మొదట ఆ పద్యాన్ని చిత్తగించండి. 

యమునద్గంగము, కృష్ణభూమదిల, మబ్జాక్ష న్మనుష్యంబు, నీ 

ల మహీధ్రన్నిఖిలాచలావళి, తమాలద్భూజ, మిందీవర 

త్కుముదశ్రేణి, పికద్విహంగము, దమస్తోమద్గ్రహోర్క ప్రభా 

సముదాయం బగుచుండె లోక మలఘు శ్యామాభ్రముల్ బర్వినన్.


ఇప్పుడు పద్యభావమును పరిశీలిద్దాము. 

వర్షారంభ సూచనగా ఆకాశం అంతా దట్టంగా నల్లని మేఘాలు 

కమ్ముకున్నాయి. సందులేకుండా, గగనతలం నిండుగా కరిమబ్బులు 

ఆక్రమించాయి. లోకమంతా ఆ మబ్బుల వల్ల చీకటైపోయింది. ప్రకృతిలోని 

ప్రతి వస్తువు పైనా నీలినీడలు కమ్మి, వాటి రూపురేఖలూ, స్వభావాలూ 

పూర్తిగా మారిపోయినట్లుగాఅనిపించింది.

మరి, ఏవి ఎలా మారినాయో కాస్త వివరంగా తెలుసుకుందాం. 


గంగానది కాస్తా యమునానది అయిందిట! 'ఇదేమిటీ! ఇదెలా సంభవం?!' అనుకుంటున్నారు కాబోలు! తెల్లని గంగాజలం కాలమేఘచ్ఛాయ వలన నల్లగా మారేసరికి, అది యమునానదిలా కనబడింది. గంగ నీరు తెల్లగా, యమున నీరు నల్లగా ఉండడం లోకప్రసిద్ధం! అందుకే "యమునద్గంగము" అన్నాడు కవి. పుడమి మొత్తం కృష్ణభూమిగా, అనగా నల్లని నేలగా మారిపోయింది. కృష్ణవర్ణమంటే నలుపురంగు! ఇక, మనుష్యులందరూ "అబ్జాక్షులు" ఐనారట! ' అబ్జాక్షుడు ' అంటే పద్మాల వంటి కన్నులు కలవాడని అర్థం. అనగా, విష్ణుమూర్తి! జనులందరూ విష్ణుమూర్తులు అయినారు అంటే నీలమేఘశ్యాములైనారని అర్థం! పర్వతాలు, కొండలు అన్నీ నీలగిరులైనాయట! వృక్షాలన్నీ తమాలభూజములుగా, అనగా కాటుకచెట్లుగా మారిపోయినవి! సరస్సుల్లో ఉండే కలువపూవులు ఇందీవరములుగా, అంటే నల్లకలువలుగా దర్శనమిచ్చాయి! పక్షులన్నీ కూడా నల్లగా కోకిలల వలె కనిపించసాగాయి! సూర్యుడు, ఇతరగ్రహాల కాంతి మీద మేఘచ్ఛాయ పడి, వాటి ప్రభాసముదాయమంతా చీకటికప్పుగా మారిపోయింది!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!