అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్. Satyanarayana Piska గారి వివరణ. ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది. పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము. (మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.) విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూ...