రాష్ట్ర ప్రభుత్వం నీకేమిచ్చిందని కాదు…

 రాష్ట్ర ప్రభుత్వం నీకేమిచ్చిందని కాదు… రాష్ట్ర ప్రభుత్వానికి (‘మందు’ తాగడం ద్వారా) నువ్వెంత ఇస్తున్నావన్నది ప్రధానం.

- ప్రభవ

మహాకవంతటి మామూలు కవి చీర్స్‌ చెబుతూ…

”నాకు గ్లాసులున్నాయ్‌…

నాకు డోసులున్నాయ్‌!

ఎవరని ఎంతురోనన్ను…

యేననంత మోదభీకర మదిర లోకైకపతిని...

”బీరు పొంగిన మత్తుగడ్డ

బ్రాంది పారిన తూలుసీమ

రాలునిచ్చట బొట్టుబొట్టు

తాగిచావర తమ్ముడా!

బెల్టుషాపులు పెరిగెనిచ్చట

రంగుసారా పొంగెనిచ్చట

కాపురములే కూలెనిచ్చట

దుఃఖ భూమిది చెల్లెలా!

విపిినబంధుర మద్యవాటిక

ఉప’నిషా’న్మధువొలికెనిచ్చట,

సారా తత్త్వము విస్తరించిన

సారా మిద్దెరా తమ్ముడా”

”నేను సైతం

బొక్కసానికి

బాటిలొక్కటి హారతిస్తాను!

నేను సైతం

మద్య వృష్టికి

జీతమంతా ధారపోస్తాను!

నేను సైతం

పుస్తెలమ్మి

పస్తులుండి తాగిచస్తాను!”

అంటూ, ఒక్క దమ్ములాగి, మళ్ళీ గళం విప్పాడు కవి…

”పదండి తూలుతు

పదండి పొర్లుతు

పదండి పోదాం పై’పైకి’!

మరో బెల్ట్‌ షాప్‌

మరో బ్రాంది షాప్‌

మరో దుకాణం పిలిచింది!”

అంటూ ఆపి, తన తరవాతి కవి చెప్పేదానికోసం చెవి రిక్కించాడు.

”బాటిలును ప్రేమించుమన్నా

బీరు అన్నది పంచుమన్నా

ఒట్టి బాటిల్‌ పగలగొట్టోయ్‌

నిండు బాటిల్‌ పట్టవోయ్‌!

బ్రాంది రమ్ములు పొంగిపొరలే

దారిలో నువ్వు తాగి పడవోయ్‌!

మందులోనె మత్తు గలదోయ్‌

తూలిపడువాడేను మనిషోయ్‌!

మద్యాభిమానము నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పబోకోయ్‌

ఆలినమ్మో తాళినమ్మో

తాగి ప్రభుతకు చూపవోయ్‌!

రాష్ట్రమంటే మట్టికాదోయ్‌

రాష్ట్రమంతా మందేనోయ్‌!”


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!