శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ!

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో 

మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ 

ధ్యాయినియైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెదనంచు నున్నవా 

డా యధమాధముం డెఱుగ డద్భుతమైన భవత్ప్రతాపముల్.


Satyanarayana Piska గారి వివరణ:-


రుక్మిణి వీరభోగ్యమైన సొత్తును అధముడు అంటరాదని ప్రకటిస్తున్నది. 


శ్రీకృష్ణుణ్ణి పదేపదే శ్రీపతిగా సంబోధించనిదే రుక్మిణికి తృప్తి లేదు. "శ్రీయుతమూర్తి" అంటూ పద్యాన్ని ప్రారంభిస్తున్నది. అనగా, "లక్ష్మీదేవితో కూడియుండేవాడా!" అని అర్థం. తనకు తెలియకుండానే తానే లక్ష్మిననే అభిప్రాయం ఆమె వాదనలో తొంగిచూస్తున్నది. 


రెండవ సంబోధనగా "పురుషసింహమా!" అన్నది. అంటే, "పురుషులలో శ్రేష్ఠుడు". పురుషులు ఎందరున్నా పురుషోత్తముడు ఒక్కడే! అతడే శ్రీమన్నారాయణుడు. తాను అతని సొత్తు. తన జీవితధ్యేయం హరి చరణకమల ధ్యానం. అటువంటి తనను తీసుకుపోవాలని అనుకుంటున్నాడు శిశుపాలుడు! "గోమాయువు" అంటే నక్క. మృగరాజుకు అర్పించిన నైవేద్యాన్ని గుంటనక్క కాజేయాలని ప్రయత్నించిన విధంగా, పరంధామునికి అంకితమైన తనను ఆ చేదిరాజు వాంఛిస్తున్నాడని తన ఆవేదనను ఆర్తితో వెల్లడిస్తున్నది. ఎత్తైన పర్వతగుహల్లో నివసించేది సింహం! నేలబొరియల్లో ఉండేది నక్క! అందుకే, అధమాధముడైన శిశుపాలునికి అద్భుతమైన నీ శౌర్యప్రతాపాలు తెలియవని అంటున్నది. చైద్యుణ్ణి "అధమాధముడు" అనడంలో ఆ బాలామణి, ఇక్కడ శక్తిస్వరూపిణిగా భాసిస్తున్నది. "చైద్యుడు" అంటే చేదిదేశపు రాజైన శిశుపాలుడు. "మత్తుడు" అంటే మత్తెక్కినవాడు, గర్విష్ఠి. శిశుపాలునిది కంటికీ, ఒంటికీ పొరలు కప్పే తామసమార్గం. రుక్మిణిది ఆ పరాత్పరునికి తనను తాను కాకుకగా ఇచ్చుకున్న పరమ సాత్వికపథం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!