బహుముఖ ప్రజ్ఞావంతురాలు-శ్రీమతి భానుమతిరామకృష్ణ

బహుముఖ ప్రజ్ఞావంతురాలు-శ్రీమతి భానుమతిరామకృష్ణ - టీవీయస్. శాస్త్రి

smt. bhanumati ramakrishna biography

డాక్టర్ పద్మభూషణ్ శ్రీమతి పాలువాయి భానుమతి (07-09-1925 to 24-12-2005) బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి , స్టూడియో నిర్వాహకురాలు. తెలుగు, తమిళ భాషలలో అగ్రశ్రేణి హీరోలతో ఆమె పోటిపడి నటించింది. ఆమె బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దంపతులకు దొడ్డవరం(ప్రకాశం జిల్లా)లో జన్మించింది. ఆమె తండ్రి గారు స్వతహాగా నటులు మరియు శాస్త్రీయ సంగీత ప్రియులు. అందుచేత, బాల్యంలోనే ఆమె తండ్రి గారి వద్ద సంగీత విద్యను అభ్యసించింది. ఆమె 1935లో చిత్రసీమలో ప్రవేశించి దాదాపుగా 200 లకు పైగా తెలుగు, తమిళ చిత్రాలలో నటించి విశిష్ట నటిగా పేరు తెచ్చుకుంది.


చిత్రసీమలో ఆమెను అష్టావధాని , అభినయ సరస్వతి అని పిలిచే వారు. కొన్ని సినిమాలకు ఎడిటర్ గాను పనిచేసింది. అందరికి తెలియని మరియొక విషయము ఏమిటంటే, ఆమెకు జ్యోతిష్యములో కూడా ప్రవేశం ఉంది. వేదాంత ధోరణి కూడా ఎక్కువే! 1939 లో సి. పుల్లయ్య గారి దర్శకత్వములో నిర్మించిన 'వరవిక్రయం' అనే సినిమాలో కాళింది అనే పాత్ర ద్వారా పరిచయం అయింది . ఆ తరువాత, మాలతీమాధవం, ధర్మపత్ని, రత్నమాల చిత్రాలలో నటించింది. మొదటి సారిగా ఆమె popular అయిన సినిమా కృష్ణ ప్రేమ. ఆ తర్వాత చక్రపాణి, స్వర్గసీమ , లైలామజ్ను, విప్రనారాయణ, మల్లేశ్వరి, బాటసారి, అంతస్తులు మున్నగు సినిమాల ద్వారా విశిష్ట నటిగా పేరు తెచ్చుకుంది . మొదటిసారిగా 1953లో చండీరాణి సినిమాకు ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలలో దర్శకత్వం వహించి ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె చివరి సినిమా పెళ్ళికానుక(1998). అదే సినిమాలో బాలు గారితో కలసి ఆమె పాడిన ‘బంగారుబొమ్మకు’ అనేది ఆమె చివరి పాట.


అన్నాదొరై ఆమెను Nadippukku Ilakkanam" (means Grammar for acting) అనే బిరుదుతో సత్కరించారు. ఆ బిరుదుకు ఆమె పూర్తిగా అర్హురాలు. నటనతో పాటు ఆమెకు కర్ణాటక , హిందుస్తానీ సంగీతాలలో విశేష ప్రజ్ఞ ఉంది. ఆమె పాత్రలకు ఆమే పాడుకునే వారు. ఆమె పాడిన, పిలిచిన బిగువటరా, ఆకాశ వీధిలో... లాంటి పాటలు ఇంకా సంగీత ప్రియుల నోళ్ళల్లో నానుతున్నాయి. వీటన్నిటితో పాటుగా ఆమె ఒక విభిన్న రచయిత్రి. ఆమె 'అత్తగారి కథలు' చాలా పేరు తెచ్చుకున్నాయి. 'నాలో నేను' అనే ఆత్మకథను వ్రాసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి వారి బహుమతి స్వీకర్త కూడాను. భానుమతి తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశమున్నవారే. సంగీతంలో తన తొలిగురువు తండ్రి కావడం విశేషం. ఆమెకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారంటే ఎంతో అభిమానం. ఒకసారి త్యాగరాజ ఆరాధనోత్సవాల సమయంలో తిరువాయూరులో సుబ్బులక్ష్మిగారితో కలిసి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన పాడే అవకాశం లభించింది. ఆ గాత్రమాధుర్యం సినీరంగంలోని ప్రముఖల దృష్టిని ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి గాయకునిగా, నటిగా, సంగీత దర్శకులురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా సినిమా రంగంలో తన ప్రతిభను అన్నివిధాలా చాటుకున్నారు.


కృష్ణ ప్రేమ అనే సినిమా షూటింగ్ సందర్భములో, ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అయిన పీ. ఎస్. రామకృష్ణారావు గారితో ప్రేమ వివాహం జరిగింది. ఆ తదుపరి భరణి స్టూడియోను నిర్మించి దాన్ని సర్వాంగ సుందరముగా తీర్చి దిద్దారు. ఆమె చాలా రివార్డ్స్, అవార్డ్స్ తీసుకొన్నారు. 2005 లో 'స్వర్గసీమ' ను చేరారు. చాలా మంది ఆమెను అహంభావి అని భావించేవారు. కాని, అది అహంభావంకాదు, స్వాతిశయం, ఆత్మాభిమానం మాత్రమే!స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ గారు పాత్రికేయునిగా పనిచేస్తున్న రోజుల్లో, ఆయనకు భానుమతి గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. భానుమతికి అహంభావం ఎక్కువ అని అందరూ ఆమెకు దూరంగా ఉండేవారు. ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది కదా, ఆమెను ఒక పట్టు పడుదామని ముళ్ళపూడివారు అనుకున్నారు. పాత్రికేయునిగా తన తలపొగరును కూడా ఆమెకు చూపించాలని నిర్ణయించు కున్నారు. భానుమతి గారిని రమణ గారు అడిగిన మొదటి ప్రశ్న-- "మీకు తలపొగరు ఎక్కువటగా?". దానికి ఆమె తడుముకోకుండా వెంటనే ఇలా సమాధానం చెప్పారు--"నా ఎదురుగా ఉండి నన్నే ఆ మాట అడగటానికి నీకెంత తలపొగరు?", అని సమాధానం చెప్పారు. ఆ సమాధానానికి ముళ్ళపూడివారు ఖంగు తిన్నారు. వెంటనే భానుమతి గారు పకపకా నవ్వుతూ, "దీన్ని తలపొగరు, అహంభావం అనకూడదు, ఆత్మాభిమానం అనాలి. భానుమతి ఎవరి ముందూ తలదించుకోదు. దానిని అర్ధం చేసుకోలేని వాళ్ళు ఇలాంటి పేర్లు పెడతారు. అంతే కానీ, నేనూ అందరి ఆడవాళ్ళ లాంటి దాన్నే" అని ఎంతో అనునయంగా భానుమతి గారు సమాధానం చెప్పారు. ఈ విషయాన్ని ముళ్ళపూడివారు తన 'కోతికొమ్మచ్చి'లో తీపిగుర్తులుగా చెప్పుకున్నారు.


ఎప్పుడూ ఎవరిని లెక్క చేయదు. S. Rajeswara Rao గారు సంగీత దర్శకత్వం వహించిన సినిమాలకు పర్యవేక్షకురాలిగా ఆమె పేరు వేయించుకుంది . ఆమె చేసుకున్న చిన్నచిన్న తప్పుల వల్లే మిస్సమ్మ, పాతాళభైరవి లాంటి విజయా వారి సంస్థలలో మంచి ఛాన్స్ లు పోగొట్టుకొంది. మిస్సమ్మ సినిమాను ఆమెతో కొంతవరకు తీసారు కూడా! కానీ విజయా వారికి ఎందుకో ఆమె తీరు నచ్చలేదు ! మిస్సమ్మ సినిమాలోని ఆమె నటించిన ఒక సన్నివేశానికి సంబంధించిన స్టిల్ ను మీకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.


ఒక సారి N. T. Rama Rao గారు తాతమ్మకల అనే సినిమా తీస్తున్నప్పుడు ఆమె వేసే పాత్రను D. V. Narasa Raju గారు నిర్ణయించారు. నటించమని ఆమెను అడగటానికి N. T. Rama Rao గారికి బెరుకు. ఎందుకంటే, అందులో ఆమెది ఒక ముదుసలి పాత్ర. ఆ పనికి ఆయన నరసరాజు గారినే పురమాయించారు. నరసరాజు గారు ఆమెను ఎట్లాగో ఒప్పించారు. అయితే remuneration ఎంత ఇవ్వాలి అంటే, అందుకు ఆమె తడుముకోకుండా, N. T. R. ని తన సినిమాలో బదులుగా నటించమని చెప్పింది. అందుకు N. T. R. అంగీకరించారు. అదీ ఆమె స్థాయి!!


ఆమెకు ముళ్ళపూడి, బాపుల మీద విపరీతమైన ప్రేమ, అభిమానం. వాళ్ళ సినిమాల్లో నటించాలని ఆమె కోరిక. ఆమెతో వేగాలంటే వీళ్ళకు భయం. అందుచేత వారి సినిమాలలో నటించలేక పోయారు. అయితే, ప్రయత్నాలు మానలేదు. వాళ్ళు బుద్ధిమంతుడు తీసే రోజుల్లో, ఒక సారి రమణ గారికి ఫోన్ చేసి పిలిపించుకొన్నారు. ఆవిడ మాట్లాడే తీరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. రమణ గారితో, “ఏమోయ్! రమణ గారు!! మీరు అదేదో సినిమాను గోదావరి వద్ద తీస్తున్నారటగా? అందులో స్కూల్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉందటగా! అది ఆడవారు వేసినా సరి పోతుందని నా అభిప్రాయం" అని చెప్పి పంపించారు. రమణ గారికి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. వెంటనే రమణ గారు, ఆమె భర్త రామకృష్ణారావు గారికి వెళ్లి ఈ విషయం చెప్పారు. అందుకు ఆయన ఒక సలహా ఇచ్చారు. షూటింగ్ అంతా గోదావరి ఒడ్డున, టెంట్లు వేస్తారు, A. C. లు గట్రా ఏమి ఉండవు అని చెప్పమన్నారు. అలాగే, రమణ గారు వెళ్లి, "అమ్మా! ఆ ఎండలలో ఆ జనం మధ్యలో మీరు చాలా ఇబ్బంది పడుతారు, A. C. లు కూడా ఉండవు"అని చెప్పారు. అందుకు , ఆమె, "ఏమి పరవా లేదోయ్! రమణ గారు!! అది మన సినిమా! నేను కూడా కష్ట పడుతాను" అని చెప్పింది. రమణ గారికి గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. మళ్ళీ రయ్యిమని రామకృష్ణారావు గారి దగ్గరకు వెళ్లి, ఈ గండం నుంచి తప్పించండి మహా ప్రభో అని మొర పెట్టుకొన్నారు. చాలా సేపు రామకృష్ణారావు గారు దీర్ఘంగా ఆలోచించి ఒక మంచి సలహా ఇచ్చారు. అది ఏమిటంటే, మీ పాత్రకు పాట లేదని చెప్పమన్నారు. వెంటనే, రమణగారు, రివ్వున ఆమె దగ్గరకు వెళ్లి, "అమ్మా! మీరు వేయబోయే పాత్ర ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ పాత్ర, ఆ పాత్రకు ఎన్ని విధాల ఆలోచించినా, పాట పెట్టటం కుదరటం లేదు" అని అనగానే, అందుకు ఆమె వెంటనే, "పాటలేని పాత్ర నాకెందుకు?" అని, ఈసారి పాట ఉన్న మంచి పాత్ర నా కోసం సృష్టించవోయ్! రమణ గారు!!" అనటం జరిగింది. ప్రస్తుతానికి గండం గడిచినందుకు సంతోషించి(లోలోపల) రమణ గారు ఆమె ఆశీర్వచనాలు తీసుకొని బయట పడ్డారు. ఇదంతా, రమణ గారి స్వీయ చరిత్ర 'కోతి కొమ్మచ్చి' లో ఉంది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, భానుమతి గారిని పాటను విడదీయలేము. ఆమె సంగీత సరస్వతి.

ఆ అభినయ, గానసరస్వతికి నా హృదయ పూర్వక నివాళి!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!