సాహిత్యంలో చాటువులు

సాహిత్యంలో చాటువులు - ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు

.

సాహిత్యంలో భాగమే మనం చదువుతున్న చాటుసాహిత్యం. చదివి ఆనందిద్దాం 

తెలుగు భాషపై మాంచిపట్టుఉండి బాగాకవిత్వం తెలిసిన భార్యా,భర్తల మధ్య జరిగిన సంభాషణ ఎంత చమత్కారంగా ఉంటుందో ఈ క్రింది చాటు పద్యాలు వివరిస్తాయి. చూడండి


“పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి,

అన్న పెండ్లాము అత్తను గన్నతండ్రి

ప్రేమతోడుత వానికి పెద్ద బిడ్డ!

సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి!”


భర్త భార్యని తాంబూలంలోకి సున్నంతెమ్మని అడగడమే పై చాటువుయొక్క భావం. అంత సులభంగా అడిగితే పై పద్యంలో చమత్కారం ఏముంది? అది చాటు పద్యం ఎలా అవుతుంది? కవి ఎంత గొప్పగా ఈ పద్యాన్ని వ్రాసేడో వివరిస్తాను తిలకించండి.


“పర్వత శ్రేష్ఠ పుత్రిక= పర్వతాలలో శ్రేష్టుడు హిమవంతుడు. అతని పుత్రిక 

పార్వతీదేవి.

పతి విరోధి = పార్వతీదేవిపతి శివుడు. అతడికి విరోధి మన్మధుడు.

అన్న పెండ్లాము = (మన్మధునికి అన్న) బ్రహ్మ. బ్రహ్మభార్య సరస్వతి.

అత్తను గన్న తండ్రి = సరస్వతికి అత్త లక్ష్మీదేవి. ఆమెను కన్నతండ్రి 

సముద్రుడు.

ప్రేమ తోడుత వానికి పెద్ద బిడ్డ = సముద్రుడు ప్రేమతో కనిన పెద్ద

కూతురు జ్యేష్టాదేవి.


లక్ష్మీ కన్నా ముందు జ్యేష్టాదేవి క్షీర సాగరంనుండి పుట్టిందని పురాణ కథనం. సంపదలకి లక్ష్మిని, దరిద్రానికి జ్యేష్టాదేవిని ఉదహరిస్తారు.( ఒక తిట్టుగా కుడా వాడుక) హిమవంతుడు, పార్వతీ,శివుడు, మన్మధుడు,బ్రహ్మ,సరస్వతి, లక్ష్మీ సముద్రుడు వంటి పెద్ద పెద్ద మంచి విశేషణాలు వాడిన ఆభర్త “సన్నుతాంగి” అని చక్కగా పిలిచి, అంతతో ఊరుకొనక “ఓ జ్యేష్టా” అని తిడుతూ(ఓ దరిద్రురాలా!)సున్నం తీసుకుని రా!అని అన్నాడుట. చూసారా ఓ చిన్న మాటకి ఎంత చక్కని చాటుపద్యం రచించాడో కవి.అది తెలుగుభాషలోని రస రమ్యత. ఇప్పుడు భార్య భర్తకి ఎంత ఘాటుగా జవాబు చెప్పి, సున్నం ఇచ్చిందో ఇంకో చాటు పద్యంలో పరికిద్దాం!


“ శతపత్రంబుల మిత్రుని

సుతు జంపినవాని బావ సూనుని మామన్ 

సతతము తల దాల్చిన శివ

సుతు వాహన వైరి వైరి సున్నంబిదిగో” ( ఇది చాటువు)


వివరణ---- శతపత్రంబుల మిత్రుడు = తామర పుష్పాలకి (పద్మాలకి)

స్నేహితుడు సూర్యుడు.

సుతు = సూర్యుని కుమారుడైన కర్ణుని.

చంపిన వాని= కర్ణుని చంపిన వాని ( అర్జునుని) 

బావ= శ్రీకృష్ణుని. సూనుని= కుమారుడైన ‘ప్రద్యుమ్నుని’

మామ=చంద్రుని ( లక్ష్మీదేవి తల్లి కనుక,ఆమెతో కూడా పాల నుండి పుట్టిన వాడు చంద్రుడు. రుక్మిణి 

లక్ష్మీదేవి అంశ. కనుక ప్రద్యుమ్నుడికి మామ చంద్రుడు. మనకి కూడా లక్ష్మి తల్లి

వంటిది. అందుకే మనంకూడా చంద్రుని,‘ చందమామ’ అని పిలుస్తాం. ఆపిలుపు 

ఒక్క తెలుగు వారికే సొంతం.మామ అన్న పదానికి ఎంత! వివరణ ఉందో చూసారా!)

సతతము =ఎల్లపుడు. 

తలదాల్చిన=శిరసున ధరించే శివుని.

సుతు =కుమారుడైన వినాయకుని. 

వాహన= వాహనమైన ఎలుకకి 

వైరి =శత్రువైన పిల్లికి. వైరి= శత్రువు అయిన ఓ కుక్కా! ( సిగ్గు లేని వాడా!)

సున్నం ఇదిగో” అని భర్తని కుక్కా అని సంబోధిస్తూ! సున్నం ఇచ్చిందట భార్య. ఒకటి అననేల, రెండు అనిపించు కొననేల అన్నట్లు ఉందికదా! పై సంభాషణ. ఇది తెలుగు చాటుపద్య చమత్కార విన్యాసం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!