శ్రీ కాళోజీ నారాయణరావు గారు

శ్రీ కాళోజీ నారాయణరావు గారు

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలోస్థిరపడింది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.

తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. పుటక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.

విద్యాభ్యాసం : ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ హైస్కూలు లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

ఉద్యమ నాయకత్వం: మాడపాటి హనుమంతరావు , సురవరం ప్రతాపరెడ్డి , జమలాపురం కేశవరావు , బూర్గుల రామకృష్ణారావు , పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో 1992 లొ సత్కరించింది. రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు(1958-60).

ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థపక సభ్యుడు. 1943 లోనే ఆయన కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాదు లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది. 

“తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? - అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా” - అంటారు కాళోజీ.

“కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ” - అంటారు శ్రీశ్రీ – కాళోజీ గురించి చెబుతూ.

రచనలు : మరాఠీ, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించినాడు. కాళోజి కథలు, నా గొడవ, జీవన గీత మొదలైనవి ఆయన రచనలు.

తెలంగాణా వాదం : ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంలో కాళోజికి భాగం ఉంది. పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంలో, రాజకీయాలల్లో మార్గదర్శనం చేసినాడు. విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969 ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల కలిసినాడు. అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాది గా జీవించినాడు.

ఉల్లేఖన : “ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె”. అని గట్టిగా చెప్పేవారు కాళోజీ.

‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు.

( విషయ సేకరణ, కూర్పు : చల్లా రామలింగ శర్మ )


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!