బుడుగు ...కష్టాలు...

బుడుగు ...కష్టాలు...

..

బడుగూ, బడుగూ, బంగారు తండ్రి, నీకెన్ని కష్టాలు వచ్చాయి,” నన్ను పట్టుకుని ఘొల్లుమన్నాడు ఒక పెద్దాయన. నిజం చెప్పొద్దూ, నాకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్ని సార్లు చెప్పాలి వీళ్ళకి నా పేరు బుడుగు అని? “నా పేరు బుడుగు, నేనొక పిడుగు” అని నా గురించి చెప్పుకునేంతలో, “ముళ్ళపూడి రవణ గారు మనందరిని వదిలి వెళ్ళిపోయారు,” అని మళ్ళీ ఘొల్లుమన్నాడు.

“ఒరేయి, పెద్దాయన గారు, ఈ రవణ గారు ఎవరు రా?” అని అడిగాను నేను.

“నిన్ను సృష్టించిన మనిషి,” చెప్పాడు వాడు.

“ఒరేయి, పెద్దాయన గారు, సురిష్టించడం అంటే ఏంట్రా?” మళ్ళీ అడిగాను నేను.

“అంటే, అంటే, ఆయన నిన్ను పుట్టించిన వాడు,” తడుముకుంటూ అన్నాడు వాడు.

నాకు వెంటనే అవమానం వచ్చింది. అవమానం అంటే సందేహం. అంటే నాకు తెలీదు. ఎందుకంటే, గోపాళం రాధ నన్ను పుట్టించిన వాళ్ళని ఒక సారి బామ్మ చెప్పింది. మరి ఈ రవణ గారు ఎవరు?

“కొయి, కొయి, నన్ను పుట్టించింది గోపాళం, రాధ,” అన్నాను నేను.

“కాని వాళ్ళని సృష్టించింది కూడా రవణ గారే,” అన్నాడు పెద్దాయన.

ఇంకెలా చచ్చేది! “మరైతే ఆయన్ని నేను చూడలేదుగా?” కూసింత దిగులుగా అన్నాను నేను.

“ఆయన కూడా నిన్ను చూడలేదులే, నువ్వాయన మానస పుత్రుడివి,” అన్నాడు పెద్దాయన గారు.

మళ్ళీ నాకు ఖోపమొచ్చేసింది. నేనేమన్నా చిన్న వాడినా చితక వాడినా. ఇలా నాకు అర్థం కాని మాటలు చెప్తే నాకు ఎంత అనుమానం. అదే అన్నాను నేను పెద్దాయన గారితో.

“అంటే ఆయన నువ్వు ఉండాలనుకున్నాడు. నువ్వు పుట్టేశావు,” చెప్పాడు ఆయన.

నాకు వెంటనే అవమానం వచ్చేసింది. అవమానం అంటే సందేహం అని చెప్పాగా. మళ్ళీ నన్ను అడగొద్దు.

“మరి ఆయన లేకపోతే, నేనెలా ఉంటాను,” అన్నాను నేను.

“అదే మరి. మానస పుత్రుడివి కాబట్టి, ఆయన లేకపోయినా, నువ్వుంటావు.”

నాక్కుంచెం అర్థం అయ్యింది, కుంచెం కాలేదు.

“మరి రాధా గోపాళం?” అడిగాను నేను.

“రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గాన పెసూనాంబ, మీ వీధి చివర జెట్కా వాడు, అందరూ తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారు,” గంభీరంగా చెప్పాడు పెద్దాయన గారు.

“అవును, అవును,” అని నినాదాలు చేశారు సబకి వచ్చిన జనమంతా.

అదిగో! అలా తెలిసింది నాకు. కాబట్టి మీరేం బెంగ పెట్టుకోకండి, రవణ గారు లేకపోయినా నేను మాత్రం మీతోనే ఉంటాను. ఆయన కాకపోతే, తేటగీతి మురళినో, ఆయన అభిమానుల్లో ఇంకెవరో, నా గురించి రాస్తూ, నన్ను మీరెవ్వరు మర్చిపోకుండా చూస్తారు. మరదే రవణ గారి గొప్పదనం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!