Posts

Showing posts from April, 2015

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.....ధూర్జటి...1/5/15.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.!.....ధూర్జటి...1/5/15. . నిన్నున్నమ్మినరీతి నమ్ము నొరులన్, నీకన్న నాకన్న లే రన్నల్దమ్ములు,తల్లిదండ్రులు గురుం డాపత్సహాయండు, నా యన్నా!యెన్నడు నన్ను సంస్కృతి విషా దాంబోధి దాటించి య చ్చిన్నానంద సుఖాబ్ది దేల్చెదోకదే! శ్రీ కాళహస్తీశ్వరా!. . పరమేశ్వరా! నేను నిన్ను నమ్మిన విధముగా వేరెవ్వరినీ నమ్మలేదు. నమ్మను కూడ.నీకంటే నాకు తల్లీ-తండ్రి,అన్న-తమ్ముడు,గురువు,మిత్రుడు, ఎవ్వరునూ లేరు.నన్ను సంసార సముద్రమును దాటించి, ఆనందము అను సముద్రము నందు తేల్చెదవని కోరుచున్నాను. నాకోర్కె మన్నింపుము.

మను చరిత్రము.....అల్లసాని పెద్దన్న.....౩౦/4/15.

Image
మను చరిత్రము.....అల్లసాని పెద్దన్న.....౩౦/4/15. . వరూధినీ నర్మగర్భ భాషణము .....ప్రవరుఁడు వరూధుని కామనను నిరాకరించుట .! ఉ. ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే ... కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికి\న్‌? . వ. అని నర్మగర్భంబుగాఁ బలికి, క్రమ్మఱ నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె. . సీ. చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధిఁ, బొడమిన చెలువ తోఁబుట్టు మాకు రహి పుట్ట జంత్రగాత్రముల ఱాల్‌ గరఁగించు, విమలగాంధర్వంబు విద్య మాకు ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు, పని వెన్నతోడఁ బెట్టినది మాకు హయమేధ రాజసూయము లనఁ బేర్వడ్డ, సవనతంత్రంబు లుంకువలు మాకుఁ . తే. గనకనగసీమఁ గల్ప వృక్షముల నీడఁ బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ, పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర! . క. పేరు వరూధిని విప్రకు మార! ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే మా రంభా శశిరేఖ లు దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్‌. . మ. బహురత్నద్యుతి మేదురోదర దరీ భాగంబులం బొల్చు ని మ్మిహికాహార్యమ...

ఋక్కులు.......మహాకవి శ్రీ శ్రీ .!

Image
ఋక్కులు.......మహాకవి శ్రీ శ్రీ .! . కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా - హీనంగా చూడకు దేన్నీ ! కవితా మయమేనోయి అన్నీ ! రొట్టె ముక్కా , అరటితొక్కా , బల్ల చెక్కా - నీ వేపే చూస్తూ ఉంటాయ్ ! తమ లోతు కనుక్కోమంటాయ్ ! తలుపు గొళ్ళెం , హారతి పళ్ళెం , గుర్రపు కళ్ళెం - కాదేదీ కవితకనర్హం ! ఔ నౌను శిల్పమనర్ఘం ! ఉండాలోయ్ కవితవేశం ! కానీవోయ్ రసనిర్దేశం ! దొరకదటోయ్ శోభాలేసం ? కళ్లంటూ ఉంటే చూసి , వాక్కుంటే వ్రాసీ ! ప్రపంచమొక పద్మ వ్యూహం ! కవిత్వమొక తీరని దాహం ! ( మహాప్రస్థానం - 1950 ) ఋక్కులు (14-04-1934 ) x

మహా కవి శ్రీ శ్రీ గారి కవితా! ఓ కవితా!

Image
. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు.  ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. . మహా కవి శ్రీ శ్రీ గారి కవితా! ఓ కవితా! . కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో, నిను నే నొక సుముహూర్తంలో, అతిసుందర సుస్యందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రదుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున, ఎటు నే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో, నీ రూపం కనరానందున నా గుహలో, కుటిలో, చీకటిలో ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో, చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో, నిశ్చల సమాధిలో, స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో? నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత రోచిర్నివహం చూశానో! నా గీతం ఏయే శక్...

రాధనురా నీ రాధనురా!

Image
రాధనురా నీ రాధనురా! రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా! వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా! రాధనురా నీ రాధనురా! ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా! మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా! . (శ్రీ పింగళి నాగేంద్రరావు. గారు.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.!........(ధూర్జటి....29/4/15.)

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.!........(ధూర్జటి....29/4/15.) . తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుట / ద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంటము లెండమావులతతుల్ / ఖద్యోతకీట ప్రభల్ సురవిధీలిఖితాక్షరంబు లసువుల్ / జ్యోత్స్నాపయః పిండముల్ సిరులందేల మదాంధులౌదురో జనుల్ / శ్రీకాళాహస్తీశ్వరా! . శ్రీకాళాహస్తీశ్వరా!ప్రాణములు,నీటికెరటములు,రావి ఆకులు,అద్దపు మెరుగులు, గాలిలోని దీపాలు,గజముల కర్ణముల చివర చివుళ్ళు,ఎండమావులు,మిణుగురు పురుగుల కాంతులవలె అశాశ్వితములైనవి అట్లే!సంపదలన్నియు వెన్నెలలోని పాలను ప్రోవు చేసినట్లు స్థిరముకానివి అయిఅనను జనులు ప్రాణములతోడను,సంపదల గర్వము చేత గ్రుడ్డివారు అగుచున్నారు.ఎంత ఆశ్చర్యము...

ఘంటసాల.!

Image
ఘంటసాల.! . పెళ్లి చేసి చూడు సినిమా టైటిల్స్‌లో ఘంటసాల పేరుకు బదులుగా . " ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో "ఆ ఘంటసాలవారే  . చిత్రానికి నాదబ్రహ్మలండి అని రాసారు పింగళి నాగేంద్రరావు.  . ఏ అమృత ఘడియల్లో ఆయనకు అలా అనిపించిందో....ఏ చల్లని దేవత ఆయనను . అలా రాయమని ఆదేశించిందో తెలియదు కానీ... అది అక్షర సత్యమైంది..  . ఎన్నాళ్లయినా...ఎన్నేళ్లయినా ఘంటసాల పాట వినిపిస్తూనే వుంటుంది

శ్రీకాళహస్తీశ్వర శతకము.! ..(ధూర్జటి.)..29/4/15.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.! ..(ధూర్జటి.)..29/4/15. . రాజార్థాతురుడైనచో నెచట ధ ర్మంబుండు? నే రీతి నా నాజాతి క్రియలేర్పడున్?సుఖము మా న్య శ్రేణికెట్లబ్బు? రూ పాజీవాళికి నేది దిక్కు? దృతి నీ భక్తుల్ భవత్పాద నీ రేజంబుల్ భజయింతు రే తెరగునన్! / శ్రీ కాళహస్తీశ్వరా!. . శ్రీ కాళహస్తీశ్వరా!పాలకుడు దనమునందు కోరికగల వాడైనచో దర్మమెచ్చటనుండును?వర్ణాశ్రమ దర్మములు ఏ విధముగా నిర్ణయింపబడును? గౌరవ మర్యాదలతో జీవించువానికి కే విదముగా సౌఖ్యము లబ్బును? వేశ్యలకు రక్షణ ఏది? అందువలన నీ భక్తులు దైర్యముతో నీ పాదపద్మములను సేవించుకోగలిగిన మార్గము ఏది?

ఊర్వశి .!

Image
ఊర్వశి .! . ప్రియా! ప్రియా! ఓ ప్రియా! ప్రియా యుగయుగాలుగ – జగజగాలనూ ఊగించిన – ఉర్రూగించిన మీ ఊర్వశినీ, ఊర్వశి సూర్వశి సూర్వశినీ నీ ప్రేయసిని !!ఎ!! అర్జు        :               ఇక్కడే – నే నిక్కడే – యుగయుగాలుగ – జగజగాలనూ ఊగించిన – మా ఊర్వశివా – అందరి ప్రేయసివా…. చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే – నమస్తే మన్మ     :              అయ్య ఇక్కడ – అమ్మ అక్కడ యిద్దరికి పొత్తు యెక్కడి? ఇక యిద్దరికి పొత్తు యెక్కడ? ఊర్వశి   :               ఇంత వలచిన వనితను – చులకనసేతువ? నరుడా! పామరుడా! ఇదొ బృహన్నలవుగా శాపమిడెదరా – జనుడా అర్జునుడా! అర్జు        :              ఆదరించెదవా? బెదరించెదవా? మన్మ     :              దొరకనిదోయీ! వదలకుమోయీ! – హాయీ, ఈరేయీ! ఊర్వశి    :         ...

కండూతి..కందములు..!

Image
బాపు గారు తనగురించి చెప్పుకునేటప్పుడు వాడారు – లా చదివినా ‘లా’ వొక్కింతయు లేదని.... . కండూతి..కందములు..! ... . లావొక్కింతయు లేదు … ఈ పదాలతో మొదలయ్యే గజేంద్ర మోక్షం తెలుగునాట బహు ప్రసిద్ధం. సమస్య ఏమిటంటే, ఈ పదాలతో మొదలు పెట్టి, పోతన కవిత్వ ఛాయ పడకుండా రాయాలి... . 1.కృష్ణ కొండూరు (ఆత్రేయ బ్లాగరి): కం. ‘లా ‘ ఒక్కింతయు లేదురు చావొచ్చి పడినది చూడు చావడి గదిలో బ్రోవగ కరిగావు హరికి కావగ తనసతి గతి ఇక కాలము మారెన్ ! (కోర్టుల్లో లా అనేది లేదు, కాసిని కాసులతో పని జరుపుకోవచ్చు అన్న మాట ) . 2.రాకేశ్వరుడు: శిఖరిణి. ‘ప’లావొక్కింతా లేదు పెరుగును పాలూ పులుసు లే- వు లేవే జొన్నల్ లేవు శెనగలు వుప్మా అసలు లే- దు లేవే పచ్చళ్ళున్ పులుసులును తోడెం చలిది కూ- టి ‘లేశ్యం’ లేదయ్యో కలదు యొకటే యాకలి హరా . 3.చదువరి: కం. లావొక్కింతయు లేదని యా విరిబాలను వివాహ మాడిన యంతన్ ఆవిరి కుడుము వలె కలికి లావెక్కిన నేమి మిగులు లావణ్యమునన్

పోతన గారి భాగవత పద్యాలు.!

Image
. . పోతన గారి భాగవత పద్యాలు.! . అడిగెద నని కడు వడి జను అడిగిన తన మగుడ నుడువడనినెడ యుడుగున్ ... వెడ వెడ జిడి ముడి తడబడ నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ . ” ఎక్కడికి వెడుతున్నారు తమరు ” అని అడగాలనే కోరికతో ఒక అడుగు ముందుకు జరిపింది . అడగవచ్చునో అడగకూడదో అన్న సందింగ్ధంలో పడిపోయింది . ముందు జరిగిన పాదం వెనుకకు వేసింది .అడిగితే చెబుతాడో లేదో అనే సందేహం . మళ్ళీ ముందు అడుగు వేసింది . వేసిన అడుగు వెనుకబడింది . చిన్నపదాలతో లక్ష్మీ మాత మనస్సులో నెలకొనియున్న సందిగ్ధస్థితిని చక్కగా మనదృష్టికి తీసుకొని వచ్చాడు పోతన్న . పద్యం అర్థం కాకున్నా , తెలుగు భాష రాకున్నా , ఈ పద్యం విన్నవాడికి సందిగ్ధస్థితి నెలకొని ఉన్నదని అర్థమవుతుంది . . శిల్పమంటే ఇదేనేమో ? ఇది సామాన్యమైన కళ కాదు . పోతనకే సాధ్యం . అందుకే అన్నాడో కవి ” ముద్దులు గార భాగవతమున్ రచియించుచు మధ్య మధ్య పంచదారలో నద్దితి వేమొ మహా కవి శేఖర , మధ్య మధ్య అట్లద్దక ఈ మధుర భావములెచ్చటనుండి వచ్చురా మహా కవీ” అని . మహాలక్ష్మి మనో భావాలకు దర్పణంగా నిలిచే ఈ పద్యం ఆంధ్ర సాహిత్యానికే అలంకారం , అపురూపం , అనితర సాధ్యం .

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి....(27/4/15.)

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి....(27/4/15.) . రాజై దుష్కృతిచెందె చందురుడు,రా రాజై కుబేరుండు దృ గ్రాజీవంబునగాంచె దుఃఖము,కురు క్ష్మాపాలుడామాటనే యాజింగూలె సమస్త రాజబందువులతో .నారాజశబ్దంబు ఛీ,  ఛీ!జన్మాంతరమందు నొల్లను జుమీ .శ్రీకాళాహస్తీశ్వరా! . శ్రీకాళాహస్తీశ్వరా! రాజైన చంద్రునకు కళంకమేర్పడినది . .రాజుగా దనాదిపతియైన కుబేరునకు దేహము చెడిపోయి దుఃఖించినాడు. . రారాజైన దుర్యోదనుడు యుద్దమునందు బందువులతో కూడ నాశనము చేశాడు. . కావున ఛీ ఛీ నేను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా  . 'రాజు'అనే పదాన్నే ఒప్పకొనను. . నీ పాదముల సేవయే నాకు రాజ్య పదవి కంటే మిన్న. x

మను చరిత్రము.!.....(అల్లసాని పెద్దన్న.) 27/4/15.

Image
మను చరిత్రము.!.....(అల్లసాని పెద్దన్న.) 27/4/15. .  (ప్రవరుని సౌందర్యముఁగని వరూధిని మోహించుట.. . .తెరువుఁ దెల్పుమని ప్రవరుఁడు వరూధిని నర్థించుట.) . ఉ. అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌ వికసింపఁ, గాంతి పె ల్లుబ్బి కనీనికల్‌ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా, గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్‌, మదిలోనఁ గోరికల్‌ గుబ్బతిలంగఁ జూచె, నలకూబరసన్నిభు నద్ధరామరున్‌. . ఉ. చూచి, ఝళంఝళ త్కటక సూచిత వేగ పదారవిందయై లేచి, కుచంబులు\న్‌ దుఱుము లేనడుమల్లల నాడ, నయ్యెడన్‌ బూచిన యొక్క పోఁక నునుబోదియఁ జేరి విలోకనప్రభా వీచికలన్‌ఁ, దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్‌. . క. పంకజముఖి కప్పుడు మై నంకురితము లయ్యెఁ బులక లావిష్కృత మీ నాంకానల సూచక ధూ మాంకురములు వోలె మఱియు నతనిన్‌ జూడన్‌.  . ఉ. ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్‌ జక్కఁదనంబునన్‌ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్‌ డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్‌. . మ. అని చింతించుచు మీనకేతనధనుర్జ్యాముక్త నారాచ దు ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై, ...

త్యాగరాజు సంగీత శాస్త్రజ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా .!

Image
      సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా . భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులుపాసించే (సం) . న్యాయాన్యాయము తెలుసును జగములు మాయామయమని తెలుసును దుర్గుణ కాయజాది షడ్రిపుల జయించు కార్యము తెలుసును త్యాగరాజునికి (సం)  

శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 26/4/15.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 26/4/15. .    . నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా . జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా ... . పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ . చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా! . . ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది. . గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవకంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది. . కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా? . ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? . నీవంటి వాడు ఇట్లు చేయవచ్చునా?

ఆనందమే జీవిత మకరందం

Image
పడిలేచే కడలితరంగం .. పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో .....సుడిగాలిలో ఎగిరే పతంగం. జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం ... అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం

శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 25/4/15.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 25/4/15. . రాజుల్మత్తులు,వారిసేవ నరక ప్రాయంబు,వారిచ్చు నం భోజాక్షీ చతురంతయానతురగీ  భూషాదు లాత్మవ్యధా బీజంబుల్,తదపేక్ష చాలు,పరితృ  ప్తి పొందితిన్,జ్ఞాన ల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము,దయతో  శ్రీ కాళహస్తీశ్వరా! . శ్రీ కాళహస్తీశ్వరా!రాజులు మదముతో ప్రవర్తింతురు. అందుచే వారికి సేవ చేయుట నరకముతో సమానమైనది.  వారిచ్చునట్టి స్త్రీలు ,పల్లకీలు,గుర్రాలు,ఆభరణాలు మనస్సునకు  భాద కలిగించేవిగా ఉండును.కాన నాకు వాటిపై గల కోరిక చాలును. సంతృప్తి పొందితిని దయతో మోక్షమునకు చేర్చు జ్ఞానమును నాకు ఇమ్ము. . x

మను చరిత్రము.....................(అల్లసాని పెద్దన్న.) 25/4/15. మణిమయభవనమున నప్సరస వరూధిని....

Image
మను చరిత్రము.....................(అల్లసాని పెద్దన్న.) 25/4/15. మణిమయభవనమున నప్సరస వరూధిని.... . శా. తావుల్‌ క్రేవలఁ జల్లు చెంగలువ కేదారంబు తీరంబున న్మావుల్‌ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం, దైందవ గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబుల\న్‌, బూవుందీవెల నొప్పు నొక్క భవనంబు\న్‌, గారుడోత్కీర్ణము\న్‌. . క. కాంచి, తదీయ విచిత్రో దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి, య క్కంచన గర్భాన్వయమణి యించుక దఱియంగ నచటి కేఁగెడు వేళ\న్‌. . క. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుత మొలసె\న్‌. . మ. అతఁ డా వాత పరంపరా పరిమళ వ్యాపారలీల\న్‌ జనా న్విత మిచ్చోటని చేరఁ బోయి, కనియెన్‌ విద్యుల్లతావిగ్రహ\న్‌, శతపత్రేక్షణఁ, జంచరీకచికుర\న్‌, జంద్రాస్యఁ జక్రస్తని\న్‌ నతనాభి\న్‌, నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నము\న్‌. . తే. అమల మణిమయ నిజ మందిరాంగణస్థ తరుణ సహకార మూల వితర్దిమీఁద శీతలానిల మొలయ నాసీన యైన యన్నిలింపాబ్జముఖియు నయ్యవసరమున.  . సీ. తత నితంబాభోగ ధవళాంశుకములోని, యంగదట్టపుఁ గావి రంగువలన శశికాంతమ...

శ్రీకాళహస్తీశ్వర శతకము--దూర్జటి.! (24/4/15)

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము--దూర్జటి.! (24/4/15) . ఱాలన్ రువ్వగా చేతులాడవు,కుమా  రా రమ్ము రమ్మంచునే చాలన్ చంపగ,నేత్రముల్దివియగా  శక్తుండనేగాను,నా శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు,నా భాగ్యమో శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా   శ్రీకాళాహస్తీశ్వరా! . శ్రీకాళాహస్తీశ్వరా!లక్ష్మీదేవికి భర్తయైన విష్ణుమూర్తిచే పూజింపబడిన పాద పద్మముల జంటగలవాడా! కొండరాళ్ళను నీపై విసురుటకు చేతులురావు.భక్తసిరియాళుడు తన కుమారుని రా రమ్మని పిలిచి చంపిన విధముగా నేను నీకు బలి ఇవ్వలేను.భక్త తిన్నడు తన కన్నులను పెరికి,నీ కన్నుల గల చోట అంటించినట్లు చేయలేను.ఇక ఏరీతిగా నా భక్తిని ప్రకటించుకొందును?నీ మనస్సున నాపై దయగలుగుట యేఁనా అదృష్టము అగును. .

ఎవరి కన్న ఎవరు గొప్ప!

Image
ఎవరి కన్న ఎవరు గొప్ప!  .  పద్యానవనం జగతి పుట్టించెడి వాడతడంటినా బ్రహ్మ తామరపువ్వు తనయుడాయె  .  తామర ఘనమని తర్కించి చూచిన  .  నలినాక్షి విష్ణు తా నాభినుండె విష్ణువు ఘనమని వివరించ చూచిన  .  జలరాశి కొకతెప్ప చందమాయె జలరాశి ఘనమని తర్కించి చూచిన  .  కుంభసంభవుచేత గ్రోలబడియె కుంభసంభవుండు ఘనమని చూచిన  .  భూమిలోపలను పొత్తుబడెను భూమియె ఘనమని తర్కించి చూచిన  .  శేషుండు మోసెనని చెప్పగలిగె శేషుండు ఘనమని తర్కించి చూచితె  .  ఉమకన్నె కొకవేలి ఉంగరంబు ఉమకన్నె ఘనమని వూహించి చూచిన  .  శివుని అర్థాంగమున చిక్కుబడెను శివుడె ఘనమని తర్కించి చూచిన... .  జగతిని పుట్టించిన వాడు కదా బ్రహ్మ గొప్పవాడనుకుందామంటే,  ఆయనేమో తామర పువ్వులో పుట్టాడు!  పోనీ, తామర పువ్వే గొప్పదనుకుందామన్నా, అదేమో విష్ణు నాభిలోంచి వచ్చిందాయె!  సరే, విష్ణే గొప్పోడనుకుందామా అంటే, శేషశయ్యమీద పవళించిన ఆయన సముద్రంలో ఓ చిన్న తెప్ప మాదిరి. అయ్యో! అలాగని సముద్రుడు ఘనుడనుకుందామా, అగస్త్యుడు సాంతం త...

సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.

Image
సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.  సౌందర్యాన్ని గుర్తించి, దానికి శిరసువంచి నమస్కరించి,  ఆనందించగల సంస్కారం అలవరచుకుంటే తప్ప వచ్చేది కాదు . అదే రసికత. రసికత అంటే Sensual Pleasure కాదు. దురదృష్టవశాత్తూ దానికి ఆ అర్థం రూఢి అయిపోయింది . . సౌందర్యం మనలో ప్రేమ కలిగించడమేమిటి? అని అనుకోవచ్చు. సౌందర్యం అన్నివేళలా మదనవికారాన్నే కలిగించనక్కరలేదు. ఒక ఆశ్చర్యం, ఒక విభ్రమం, ఒక ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన వాక్యసముదాయం ఏదైనా కలిగించవచ్చు. కేవలం ఊహే అయినప్పటికీ, బహుశా అటువంటి స్థితికి లోనయ్యేడేమో కాళిదాసు (సినిమాలో చూపించినట్టు) “మాణిక్య వీణాం…” అన్న శ్లోకం చదివే సందర్భంలో .  . మాణిక్య వీణా ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే! జగదేకమాతః జగదేకమాతః ...ఆ... మాతా...! మరకతశ్యామా! మాతంగీ మధుశాలినీ! కుర్యాత్కటాక్షం కల్యాణీ! కదంబ వనవాసినీ...! జయ మాతంగతనయే...!  జయ నీలోత్పలద్యుతే! ...

శ్రద్ధాంజలి - (Sraddhanjali): బాపు - ఆర్.కే.లక్ష్మణ్

శ్రద్ధాంజలి - (Sraddhanjali): బాపు - ఆర్.కే.లక్ష్మణ్ : నా పెన్సిల్ చిత్రాల్లో చరిత్ర స్రుష్టించిన నా అత్యంత  అభిమాన చిత్రకారులు/కార్టూనిస్టులుచాల. బాగుంది.. మీ చిత్రం.   కీ.శే. బాపు,  ఆర్.కే.లక్ష్మణ్

శ్రీకాళహస్తీశ్వర శతకము!..........23/4/15

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము!..........23/4/15 . నిన్నే రూపముగా భజింతు మదిలో / నీ రూపుమోకాలో స్త్రీ చన్నో కుంచమో,మేకపెంటియొ యీ / సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా / కారంబుగా జూపవే చిన్నీరేజ విహార మత్తమధుపా / శ్రీకాళహస్తీశ్వరా! . శ్రీ కాళాహస్తీశ్వరా!నీ భక్తులు కోరిన రీతిన సేవించిన చోటనే ప్రత్యక్షమగుచూ వారికి వరాల నిచ్చుచున్నాను. 1.శ్రీకృష్ణుని ఆనతి మేరకు అర్జునుడు కృష్ణుని మోకాలి చిప్పమీద శివుని పూజింపగా,అర్జునునకు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమిచ్చెను.అట్టి నిన్ను మనస్సులో ఏ రూపములో ద్యానము చేయగలను.నీవు ఒకసారి మోకాలిచిప్పరూపులోను,స్త్రీ యొక్క స్థనములోను,ద్యానము కొల్చే కుంచము రూపములోను,మేక పెంటిక రూపములోనునీ భక్తులకు దర్శనమిచ్చితివి.నీది అసలు ఏ రూపము.నా ఈ అనుమానము తీర్చి కనులారా నీ రూపమును దర్శించనిమ్ము. . 2.ఒక భక్తుడు స్త్రీలోలుడై శివరాత్రినాడు సంగమము జరుపుచున్న స్త్రీస్తనము మీద శివరూపమును ద్యానించగా శివుడు ప్రత్యక్షమై వానికి కైవల్యమిచ్చెను.అందుకే ఆయన ఆచంటేశ్వరుడు. . 3.ఒక వర్తకుడు దాన్యము కొలుచ్చుండగా దాన్యకుంచము మీద శివుని ద్యానించగా అచట ప్రత్యక్షమై వానికి...

మన హిమాలయాలు..!

Image
మన హిమాలయాలు..! . అంబరచుంబి శిఖరాలు శరఝ్ఝరీ తరంగాలు ఆ అభంగ తరంగ మృదంగ రవములకభినయమాడు తరంగాలు అహో హిమవన్నగము భరతావనికే తలమానికమూ భగీరధుడు తపియించినచోటు గగన గంగనే దింపినచోటు పరమేశుని ప్రాణేశుగబడసి గిరినందన తరియించినచోటు. (గురువుగారు సి.నా.రె)

మల్లెపూలోయ్ మల్లె పూలు..(భావన...కృష్ణ గీతం..)

Image
మల్లెపూలోయ్ మల్లె పూలు..(భావన...కృష్ణ గీతం..) . (http://kristnapaksham.blogspot.com/2010_05_30_archive.html) . మల్లెపూలు, తెల్లని మల్లెపూలు! విచ్చిన మల్లెపూలు!! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యే మాటలతో తెలపగలను.! సాయింత్రాలు స్నేహానికి చల్లని శాంతినిచ్చే మల్లెపూలు. అర్ధరాత్రులు విచ్చి జుట్టు పరిమళంతో కలిసి నిద్ర లేపి రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు వొళ్ళమధ్య చేతులమధ్య నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు రోషాలూ నవ్వులూ తీవ్రమయిన కోర్కెలతో తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూలు సన్నని వెన్నెట్లో ప్రియురాలి నుదిటి కన్న తెల్లగా యేమి చెయ్యాలో తెలీని ఆనందంతో గుండెపట్టి చీలికలు చేశే మల్లెపూలు తెల్లారకట్ట లేచి చూసినా యింకా కొత్త పరిమళాలతో రాత్రి జ్ఞాపకాల తో ప్రశ్నించే మల్లెపూలు ఒక్క స్వర్గం లో తప్ప ఇలాంటి వెలుగు తెలుపు లేదేమో - అనిపించే మల్లెపూలు అలిసి నిద్రించే రసికత్వానికి జీవనమిచ్చే ఉదయపు పూలు రాత్రి సుందర స్వప్నానికి సాక్షులు గా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు.... !!!

మను చరిత్రము .!.....(అల్లసాని పెద్దన్న.) . (హిమనగర సౌందర్యములఁగని ప్రవరుని యానందము.)

Image
మను చరిత్రము .!.....(అల్లసాని  పెద్దన్న.) . (హిమనగర సౌందర్యములఁగని ప్రవరుని యానందము.) . చ. అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలము\న్‌, గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్‌. . వ. కాంచి యంతరంగంబునఁ దరంగితం బగు హర్షోత్కర్షంబున. . క. నరనారాయణ చరణాం బురుహద్వయ భద్రచిహ్న ముద్రిత బదరీ తరుషండ మండలాంతర సరణిన్‌ ధరణీసురుండు చనఁ జన నెదుటన్‌. . క. ఉల్లల దలకాజలకణ పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ హల్లోహల మద బంభర మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్‌. . సీ. తొండముల్‌ సాఁచి యందుగుఁజిగుళ్ళకు నిక్కు, కరుల దంతచ్ఛాయ గడలుకొనఁగ సెలవుల వనదంశములు మూఁగి నెఱెవెట్టఁ, గ్రోల్పులుల్‌ పొదరిండ్ల గుఱక లిడఁగ సెలయేటి యిసుకలంకల వరాహంబులు, మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త నడ్డంబు నిడుపు నాపడ్డలగతి మనుఁ, బిళ్ళు డొంకలనుండి క్రేళ్లుదాఁటఁ   . . తే. బ్రబల భల్లుక నఖభల్ల భయదమథన శిథిల మధుకోశ విసర విశీర్ణ మక్షి కాంతరాంతర దంతురితాతపమునఁ బుడమి తిలతండులన్యాయమున వె...

శ్రీకాళహస్తీశ్వర శతకము.!...................(.ధూర్జటి.).21/4/15.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము.!...................(.ధూర్జటి.).21/4/15. . ఏ వేదంబు పఠించెలూత,భుజగం బే శాస్త్రముల్సూచె దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి,చెం చేమంత్రమూహించె, బో ధావిర్భావ నిధానముల్ చదువుల య్యా? కావు,మీ పాదసం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళాహస్తీశ్వరా! . శ్రీకాళాహస్తీశ్వరా!నిన్ను కొల్చిన సాలెపురుగు ఏ వేదమును చదువలేదు .నిన్ను పూజించిన సర్పము ఏ శాస్త్రమును అభ్యసింపలేదు .నిన్ను భుజించిన ఏనుగు ఏ విద్యను నేర్వలేదు. బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును నిన్ను అర్చించుటకై నేర్చుకొనలేదు .నీ పూజ చేయవలెనను జ్ఞాన్ము పొందుటకు సమస్త ప్రాణులకు ఏ చదువులు అక్కరలేదు. కేవలము నీ పాదములను అర్చించవలెనను కోరికయే అందుకు మూలకారణము.

పసరు మహిమచేఁ బ్రవరుఁడు హిమాద్రి కేఁగుట..5....మను చరిత్రము.!

Image
పసరు మహిమచేఁ బ్రవరుఁడు హిమాద్రి కేఁగుట..5....మను చరిత్రము.! (అల్లసాని పెద్దన్న..) . క. ఆ మం దిడి యతఁ డరిగిన భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్ష\న్‌. . శా. గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా రంగాంకాంక! నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా! గాంగేయాచలచాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా! బంగా ళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా!  . క. మండలికతపన! శోభిత కుండలపతిశయన! కర్ణకుండలిత రసా ఖండకవికావ్య! దిగ్వే దండ శ్రుతిదళన కలహ తాడిత పటహా!  . ఉత్సాహ. కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు బా హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి ప్రకర పాణిఘటిత రత్న పాదుకా కలాచికా ముకుర వీటికాకరండ ముఖ్య రాజలాంఛనా!

విద్యా ధన బలముల ప్రభావము:-

Image
విద్యా ధన బలముల ప్రభావము:- . విద్యా ధన బలములను మంచి కొరకు ఉపయోగించుకొనువాడు సజ్జనుడు.  వీటిని అకారణ వివాదములకు, గర్వ పడుటకు , ఇతరులను బాధ పెట్టుతకూ ఉపయోగించుకొనువాడు దుర్జనుడు.  మనం అపు రూపమయిన పై మూడూ పొంద గలిగితే తప్పక మంచి కొరకే,  పరుల కుపకారము చేయుట కొరకే ఉపయోగించి సజ్జనుల జాబితాలో చేరుదామా మరి! . . శ్లో:- విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం ఖలు పీడనాయ. ఖలస్య సాధోః విపరీతమేతత్ జ్ఞానాయ దానాయచ రక్షణాయ. . చ:- వరలెడి విద్య మూర్ఖపు వివాదపు ప్రౌఢిమ, విత్తమున్ మదం బరయగ శక్తి నన్యులను బాధలు పెట్టుగ మూర్ఖు లందునన్, పరులకు జ్ఞానమున్ గొలుప, భక్తిని పంచగ పేదవారికిన్ సరగున రక్ష సేయగను సజ్జనులందున నొప్పు నెల్లెడన్. . భావము:- . విద్య, ధనము, బలము అను యీ మూడూ మూర్ఖులందు వివాదము కొరకును, గర్వ పడుటకును, పరులను హింసించుటకునూ ఉపయోగ పడుచుండగా, సజ్జనులయందు ఇతరులకు జ్ఞాన బోధ కలిగించుటకు, పేదలకు కష్టములలో సహాయము చేయుట కొరకూ, బాధలలో నున్న వారిని రక్షించుట కొరకునూ ఉపయోగ పడుచున్నది కదా!

మను చరిత్రము (4).!........(.అల్లసాని.)

Image
మను చరిత్రము (4).!........(.అల్లసాని.) . ప్రవరునికి సిద్ధుఁడు పాదలేప మొసంగుట. . (పరమంబైన రహస్య మౌ నయిన డాఁప\న్‌, జెప్పెద\న్‌ భూమిని ర్జరవంశోత్తమ! పాదలేప మను పేరం గల్గు దివ్యౌషధం పు రసం బీశ్వరసత్కృపం గలిగెఁ దద్భూరి ప్రభావంబునం జరియింతున్‌ బవమాన మానస తిరస్కారిత్వరాహంకృతిన్‌..) . చ. వెఱవక మీ కొనర్తు నొక విన్నప మిట్టివి యెల్లఁ జూచిరా నెఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టుఁ బ్రాయపుం జిఱుత తనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య! మా కెఱుఁగఁ దరంబె! మీ మహిమ లీర యెఱుంగుదు రేమిచెప్పుదు\న్‌? . క. అనినఁ బరదేశి గృహపతి కనియెన్‌ సందియముఁ దెలియ నడుగుట తప్పా? వినవయ్య! జరయు రుజయును జెనకంగా వెఱచు మమ్ము సిద్ధుల మగుట\న్‌.  . మ. పరమంబైన రహస్య మౌ నయిన డాఁప\న్‌, జెప్పెద\న్‌ భూమిని ర్జరవంశోత్తమ! పాదలేప మను పేరం గల్గు దివ్యౌషధం పు రసం బీశ్వరసత్కృపం గలిగెఁ దద్భూరి ప్రభావంబునం జరియింతున్‌ బవమాన మానస తిరస్కారిత్వరాహంకృతిన్‌.. క. దివి బిసరుహబాంధవ సైం ధవ సంఘం బెంత దవ్వు దగ లే కరుగు\న్‌ భువి నంత దవ్వు నేమును ఠవఠవ లే కరుగుదుము హుటాహుటి నడల\న్‌...

అల వైకుంఠపురంబులో..

Image
అల వైకుంఠపురంబులో.. . భాగవత రచనలో ముఖ్యంగా ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది . . గజేంద్రుడు పిలిచినప్పుడు వైకుంటం లో ఉన్న విష్ణుమూర్తి ని వర్ణించాలి ..  . అసలు వైకుంటం లో విష్ణుమూర్తి ఎలా ఉండి ఉంటాడు . అక్కడ ఏమి ఉంటాయ్ . . ఎలా వర్ణించాలి అని పోతన గారు ఎంతగా ఆలోచిస్తున్న తనకి ఏమి తట్టడం లేదంటా  . పోతన గారు వాళ్ళ అమ్మాయ్ తో నేను గుడివరకు వెళ్ళిస్తాను అని చెప్పారంట..  . ఆయన వచ్చేలోపే సాక్షాత్తు వైకుంటా వాసే వచ్చి పద్యాన్ని పూర్తీ చేసి వెళ్ళాడు . . అదే ఈ పద్యం చూడండి  . అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా . పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో  . త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి  . హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై. . . (అల = అక్కడ; వైకుంఠపురంబులో - వైకుంఠ = వైకుంఠమనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరిలోనా - నగరి = రాజభవనసముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందారవనాంతరామృతసరః - మందార = మంద...

మను చరిత్రము.3 . సిద్ధాగమనము - అతిథి సత్కారము .!.

Image
మను చరిత్రము.3 . సిద్ధాగమనము - అతిథి సత్కారము . సీ. ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె, మొగముతోలు కిరీటముగ ధరించి కకపాల కేదార కటక ముద్రిత పాణిఁ, గుఱుచ లాతాముతోఁ గూర్చిపట్టి యైణేయమైన యొడ్డాణంబు లవణిచే, నక్కళించిన పొట్ట మక్కళించి యారకూటచ్ఛాయ నవఘళింపఁగఁ జాలు, బడుగుదేహంబున భస్మ మలఁది  . తే. మిట్టయురమున నిడుయోగ పట్టె మెఱయఁ జెవుల రుద్రాక్షపోఁగులు చవుకళింపఁ గావికుబుసంబు జలకుండికయును బూని చేరెఁ దద్గేహ మౌషధసిద్ధుఁడొకడు. . తే. ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రుఁ గాంచి భక్తిసంయుక్తి నెదురేఁగి ప్రణతుఁ డగుచు నర్ఘ్యపాద్యాది పూజనం బాచరించి యిష్టమృష్టాన్నకలన సంతుష్టుఁ జేసి, . క. ఎందుండి యెందుఁ బోవుచు నిందుల కేతెంచినార లిప్పుడు? విద్వ ద్వందిత! నేఁడుగదా! మ న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుఁడ నైతి\న్‌. . క. మీమాటలు మంత్రంబులు, మీమెట్టినయెడ ప్రయాగ, మీపాద పవి త్రామలతోయము లలఘు ద్యోమార్గఝరాంబు పౌనరుక్త్యము లుర్వి\న్‌ . ఉ. వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయి\న్‌ వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేఱు సేయ కె వ్వాని గృహాంతరంబున భవాదృశయోగిజనంబు పా...

జయదేవ(గీత గోవిందం) .!

Image
జయ జయ దేవ హరే ..........- జయదేవ(గీత గోవిందం) .! . శ్రిత కమలాకుచ మండలా........ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల.... జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....  ||జయ జయ||  దినమణి మండల మండనా......భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా  ||జయ జయ|| కాళియ విష ధర గంజనా..........జన రంజన........ఈ యదుకుల నళిన దినేశా  ||జయ జయ|| మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా  ||జయ జయ|| అమల కమల దళ లోచనా........భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా  ||జయ జయ|| జనక సుతా కృత భూషణా........జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా  ||జయ జయ|| అభినవ జలధర సుందరా.........ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర చకోరా  ||జయ జయ|| తవ చరణే ప్రణతావయా...........ఇతి భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ  ||జయ జయ|| శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....ఈ మంగళ ఉజ్వల గీతం  ||జయ జయ|| అర్ధ్ధం : లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము.... . ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్...

రావణ కాష్టం .....

Image
రావణ కాష్టం రగులుతోందీ అంటారు. . అసలు ఎందుకంటారు...ఆ కాష్టం ఎందుకు ఇంకా రగులుతూ ఉంది??? . రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా.. మహా పతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజామందిరంలో దీక్షకు కూర్చునేదట.... రావణుడి శక్తికి, ఆమె అకుంఠిత దీక్ష తోడై, అన్నీ విజయాలే సిద్ధించేవట....! రామ రావణ యుద్ధ సమయంలోనూ, ఆమె దీక్షలో కూర్చుందట. ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణవధ జరగదని తెలిసిన దేవతలు, మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారట....మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్షకు భగ్నమైందట. దాంతో, రాముడు రావణుడిని మట్టుపెట్టగలిగాడట..... రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగులబెట్టిన తర్వాత, సతీసహగమనం చేయబోతూ.. తనను వంచించిన దేవతలను మండోదరి శపించబోయిందట. మహాసాధ్వి శాపానికి భయపడ్డ దేవతలు.. ఆమెను శాంతింప చేసేందుకు, ఆమెకు శాశ్వత సుమంగళిత్వాన్ని వరంగా ఇచ్చారట...! . భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగళిని ఎలా కాగలను అన్న ప్రశ్నకు, చితి ఆరిపోయి.. అస్తికలు, భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి, పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్లు కాదు కాబట్టి, రావణాసురుడి చితి శాశ్వతంగా ఆరిపోకుండా, రగ...

జయదేవ బృందావనం.! (అష్ట పది -చందన చర్చిత నీల కళేబర ....)

Image
జయదేవ బృందావనం.! (అష్ట పది -చందన చర్చిత నీల కళేబర ....) - చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 1 . విలాసిని=ఓ శృంగార భావాలుకల రాధా!; చందన =శ్రీ గంధం; చర్చిత=పూసిన ;నీల=నల్లనైన ;కళేబర=శరీరంలో ;పీత=పచ్చనైన ;వసన=వస్త్రము కలిగినవాడు;వనమాలీ=వనమాల కలిగినవాడు ;కేళి =ఆటలచేత ;చలత్=కదలుచున్న ;మణికుండల =రత్న కుండలములచేత ;మండిత=అలంకరించిన ;గండ యుగ =రెండు చెక్కిళ్ళ మీద ;స్మిత శాలీ=చిరునవ్వు చేత ఒప్పుచున్నవాడు ;హరిః= శ్రీ కృష్ణుడు ;ఇహ=ఈ వసంత ఋతువులో ; కేళి పరే=ఆటలలో గొప్పతనము కలిగిన ;ముగ్ధవధూనికరే= అందమైన స్త్రీల సమూహములో ; విలసతి =విహరిస్తున్నాడు ;. . ఓ శృంగార భావాలుకల రాధా! గంధం పూసిన నల్లనైన శరీరం మీద పచ్చని వస్త్రం ధరించినవాడు , పాదాలవరకు వేలాడే వనమాల ధరించినవాడు అయిన శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు. ఆయనగారు ఆటలు ఆడటం వల్ల చెవులకు పెట్టుకొన్న రత్న కుండలాలు కదులుతున్నాయి . చెక్కిళ్ళమీద ఇంకా ఏమీ ఆభరణాలు అక్కర్లేదు. ఆయన చిరునవ్వు...

మను చరిత్రము.!.... (2.)...............ప్రవరుని సౌశీల్యాది ప్రశంస...

Image
మను చరిత్రము.!.... (2.)...............ప్రవరుని సౌశీల్యాది ప్రశంస... . (అల్లసాని పెద్దన్న.) . ఉ . ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై . ఆ. వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి కాంక్షసేయు జార కామినులకు భోగబాహ్య మయ్యెఁ, బూచిన సంపెంగ పొలుపు మధుకరాంగనలకుఁ బోలె . ఉ. యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడునై కమనీయకౌతుక శ్రీవిధిఁ గూఁకటుల్‌ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియు\న్‌ దేవరవోలె నుండి యిలుదీర్పఁగఁ, గాపుర మొప్పు వానికి\న్‌ . సీ . వరణాతరంగిణీ దరవికస్వర నూత్న, కమల కషాయగంధము వహించి, ప్రత్యూషపవనాంకురములు పైకొనువేళ, వామనస్తుతి పరత్వమున లేచి, సచ్ఛాత్త్రుఁ డగుచు నిచ్చలు నేఁగి యయ్యేట, నఘమర్షణస్నాన మాచరించి, సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి, సైకతస్థలిఁ గర్మసాక్షి కెఱఁగి, తే. ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ తతియు, నుదికిన మడుఁగుదోవతులుఁ గొంచు బ్రహ్మచారులు వెంట...

గృహలక్ష్మి.!

Image
గృహలక్ష్మి.! . పురికిని బ్రాణము కోమటి వరికిని బాణంబు నీరు వసుమతి లోనం గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ !  . ఓ సుమతీ ! ఊరికి వ్యాపారి గుండెకాయ వంటి వాడు. వరి పంట కు నీరే ప్రాణాధారం. ఏనుగు నకు తొండమే ప్రధానము . ఇంటను సిరిసంపదలు వర్ధిల్లాలంటే ఇల్లాలే ప్రధాన కారణ మౌతోంది. అందుకే ఇల్లాలు ని గృహలక్ష్మి అంటారు.

సాహిత్యంలో - చాటువులు .!

Image
సాహిత్యంలో - చాటువులు .! . “ దాతృత్వం – ప్రియ వక్తృత్వం- ధీరత్వం – ఉచితజ్ఞతా/ అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజా గుణాః// ౧.దానంగుణం. ౨.మంచిగా మాటాడటం, ౩.దేనికి చలించక ధైర్యంగా ఉండడం, .౪.ఇది మంచి. ఇది చెడు అని తెలుసుకొనే జ్ఞానం కలిగి ఉండడం. అనే నాలుగు గుణాలు సహజ సిద్దమైనవి. నేర్చుకొంటే వచ్చేవి కావు. ఇటువంటి సహజ గుణాలతో కూడిన ‘రాయని భాస్కరుడు’ అనే అమాత్యుని గొప్ప దాన గుణాన్ని తెలిపే కొన్ని చాటు పద్యాలని చదివి ఆనందిద్దాం. చాటువులు హాస్యాన్నే కాదు ఆచరణని కూడా బోధిస్తాయి. . “ఏ వ్రాలైనను వ్రాయును ‘నా’ వ్రాయడు వ్రాసెనేని నవ్వులకైనన్ ‘ సి’ వ్రాసి ‘తా’ వడివ్వడు భావజ్ఞుడు రాయనార్య భాస్కరుడెలమిన్.” . ‘రాయని భాస్కరునికి’ చిన్నప్పటి నుండే దానగుణం అబ్బింది అనడానికి పైపద్యం ఒక ఉదాహరణ. ఎలాగో చూడండి--- . “గొప్పవాడైన రాయని భాస్కరుడు అక్షరాలు దిద్దేటపుడు ‘నా’ అనే అక్షరం వ్రాయడట! ఒకవేళ వ్రాసినా, దానిప్రక్కన అంటే ‘నా’ ప్రక్కన ‘సి’ వ్రాసి ‘తా’ వత్తు ( స్తి ) ఇవ్వడట! అనగా ‘నాస్తి’ అనేపదం వ్రాయడు. అని భావం. నాస్తి అంటే సంస్కృతంలో ‘లేదు’ అని అర్థం. సంస్కృతంలో ‘నాస్తి’ అని వ్రాయడు అన్నట్లే తెలుగుల...

'అస్తి, కస్చిత్, వాక్'

Image
'అస్తి, కస్చిత్, వాక్' . కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు. ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని. . కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని  . ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు  . పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఆ పదాలు అలా ఎందుకు తలలో ఆడుతున్నాయో  . తెలియలేదట. ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు.  . అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...' అంటూ కుమారసంభవం 'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం 'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు.

నిద్రలో అయిథే కలల రూపంలో ,, . మెలకువలో అయితే తలపుల రూపంలో వారికి జ్ఞప్తికి వస్తుంటారు ..!

Image
చనిపోయిన పెద్దలు మనకు మరలా కలలో కనిపిస్తే వారి ఆశీస్సులు మనకు లబిస్తున్నయి అని అర్దం... మంచిదే ..బాదపడాల్సీన పనిలేదు . పరలోకాని చేరువైనా మన పూర్వికులా ఆత్మల గత జన్మ తాలుకు జ్ఞాపకాలు వారిని వీడక ఆ జన్మలో వారికి ఎవరిపై ఎక్కువ మక్కువ కలదో వారిని ఆశ్రయిస్తూ ఉంటారు వారు నిద్రలో ఉన్నప్పుడైనా లెదా మెలకువలో అయినా .. నిద్రలో అయిథే కలల రూపంలో ,, . మెలకువలో అయితే తలపుల రూపంలో వారికి జ్ఞప్తికి వస్తుంటారు .. అప్పుడు వారు తమసంబందీకులకు అందించాల్సిన అశీర్వాదాలైనా లేద సూచనలైనా తిన్నగా మెదడుకే సంకేతాలను అందిస్తారు ..ఎందుకంటే వారి ఆత్మ అపుడు చైతన్య స్తితిలో ఉండదు కనుక సూక్ష్మ రూపంలో ఉంటుంది కనుక  . ఆత్మ తాలూకు ఆత్మీయ మిత్రులందరూ కలుసుకునేది చీకటి శూన్యంలోనే  అందుకే చీకటి అవసరం ఆత్మకి ఉంటుంది వెలుతురులో ఆత్మలు ప్రసరించలేవు ..అలా చేయడం ఒక్క దివ్యాత్మలకే సాద్యం

అరుణాస్పదపుర వర్ణనము....మను చరిత్రము......అల్లసాని పెద్దన్న.

Image
అరుణాస్పదపుర వర్ణనము....మను చరిత్రము......అల్లసాని పెద్దన్న. . మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌ బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌ . సీ. అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మది దప్పిన మొదటివేల్పు నచటి రాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన, మును సంచిమొద లిచ్చి మనుప దక్షు లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి, నాదిభిక్షువు భైక్షమైన మాన్చు   . తే. నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ గాసెకొంగున వారించి కడపఁగలరు నాట్యరేఖాకళాధురంధరనిరూఢి నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైనఁ జేవ.

ఆనందాన్వేషణ .!

Image
ఆనందాన్వేషణ .! . మనిషి జీవితం పుట్టుక నుండి చావు వరకు దుఃఖమే. అయితే అందులోనే తనకు కావలసిన ఆనందాన్ని వెతుక్కోవడానికి, పదిమందికి పంచడానికి మనిషి సాహిత్య సృష్టి చేసాడనుకోవచ్చు. ఈ ఆనందాన్వేషణ మనిషిని మిగిలిన జీవరాసులనుండి వేరు చేస్తోంది. . ఒక మహాకవి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పాడో చూడండి. “నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్ దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు . కొన్ని విష ప్రయుక్తముల్ పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖదమంబులు వ్యాఖులకున్ మహౌషధుల్. “ . జంతువులనుండి మనిషిని వేరు చేసే ‘నవ్వు’ విషపూరితం కాకుండా పువ్వుల మృదువైన ప్రేమరసాన్ని అందించి దుఃఖాన్ని, రోగాన్ని ఉపశమింప చేయాలని కవి సూచన. అలాంటి నవ్వే చిత్తవృత్తికి దివ్వె అవుతుంది. గాంధీగారు కూడా “If I had no sense of humor, I would long ago have committed suicide” అన్నారు. నవ్వగలగడం ఒక వరం. ఒక ఐశ్వర్యం. అందుకే కీ.శే.జంధ్యాల. . “నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం “ అన్నారు. . “A man is not poor if he can still laugh” అంటాడు ...