పిడుగు దేవర కథ.! . (డాక్టర్.(మహీధర నళినీమోహన్.)

పిడుగు దేవర కథ.!.........(డాక్టర్.(మహీధర నళినీమోహన్.)

.

2016 వ సంవత్సరం. ఆషాఢమాసం. మెరుపులతో, ఉరుములతో కూడిన జడివాన మొదలైంది. రాత్రి అయింది.8 యేళ్ళ (మా) పాపాయి …

పాప : (సన్నగా చలికి వణుకుతూ, దుప్పటి కప్పుకుని) “అర్జున ఫల్గుణ, పార్థ…”

నాన్న: అమ్మాయీ, ఏం చేస్తున్నావు?

పాప : ఉరుములు వస్తూంటే, “అర్జున, ఫల్గుణః పార్థ” అని అనుకోమని అమ్మమ్మ చెప్పింది నాన్నా! అందుకనే అనుకుంటున్నాను.

నాన్న: ఆ శ్లోకం ఇదీ.

“అర్జునః ఫల్గుణః పార్థః

కిరీటీ శ్వేతవాహనః

భీభత్స విజయోర్జిష్ణుః

సవ్యసాచీ ధనంజయః” .

మరేమో వర్షమొచ్చేప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటే పిడుగులు పడవుట.

పాప : పిడుగులా? అంటే ఏమిటి నాన్నా?

నాన్న: సరే. నీకు ఈ రోజు పిడుగు కథ చెపుతాను. పిడుగు అంటే వర్షంలో, మసక చీకట్లో, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ, పెద్ద శబ్దంతో, వెలుతురు ముద్ద జారిపడ్డం అన్నమాట. ఆ వేడికి, పిడుగు పడిన చోట చెట్టో, ఇల్లో కాలిపోతుంది.

పాప : అమ్మో! మరి పిడుగు పడితే ఎలాగ?

నాన్న : మరేం భయం లేదమ్మా. పిడుగు పెద్ద పెద్ద భవనాల మీద, లేదా మైదానాల్లో ఉన్న చెట్ల మీద మాత్రమే పడుతుంది. సుమారు 200 యేళ్ళ కిందట బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త, ఈ పిడుగును లొంగదీసుకున్నాడు. అంటే, పిడుగు వల్ల ఇళ్ళు, పెద్ద పెద్ద భవనాలు కాలిపోకుండా ఉపాయం కనిపెట్టాడన్నమాట.

పాప : ఏం ఉపాయం?

నాన్న : పిడుగు అంటే మేఘాలలో దాగున్న విద్యుత్తు అని, ఆ విద్యుత్తు ప్రవాహం నేలకు చేరుకునే లాగ ఇంటి పైన ఓ పిడుగు చువ్వను పెట్టేసి, ఆ చువ్వ కింది కొసన బలమైన రాగి తీగ అతికించి, ఆ తీగ రెండవ కొసను భూమిలో లోతుగా పాతిపెడితే, ఆ విద్యుత్తు మేఘాల నుండీ జారి, భూమిలోపలికి వెళ్ళిపోతుందట. అదీ ఉపాయం.

పాప : హయి. ఎంత సులభమో!!

నాన్న : ఇప్పుడు కాబట్టి సులభమేనమ్మా. అయితే, అయితే 2500 సంవత్సరాల కృషి ఉంది. అప్పట్లో థేల్స్ అనే ఆయన, ఒక రకమైన గట్టిపడిన బంక ముక్క (ఏంబర్) ను బట్టతో రుద్దితే, ఆ ముక్క గడ్డిపరకలను ఆకర్షిస్తుంది అని కనుక్కున్నాడు. ఆ ఏంబర్ నే ఎలక్ట్రాన్ అని వాళ్ళ భాషలో అన్నారట. ఆ పేరు మీదే ఎలెక్ట్రిసిటీ అన్న పేరు వచ్చింది.అలా పరిశోధన మొదలయ్యింది.

పాప : మన వాళ్ళకు ఈ విషయం తెలీలేదా నాన్నా?

నాన్న : ఎందుకు తెలియదమ్మా? ఏంబర్ మాత్రమే కాక, కొన్ని రకాల మణులకు కూడా గడ్డిని ఆకర్షించే ఆ శక్తి ఉంది. కృష్ణదేవరాయలు అన్న గొప్ప రాజు ఉండే వాడుట మనకు. ఆ రాజు, ఆముక్త మాల్యద అనే ఒక కావ్యంలో ఇలా ఒక పద్యం చెప్పాడు.

“తనరె బలిభుక్తతులు నిం

డిన గ్రామ శ్రీల కరితి నీలములగుటం

గనియె తృణ గ్రాహిత నన

గొను కసవుల జైత్యతరుల గూండ్లిడు భ్రమణన్”

అంటే,  కాకులు గూళ్ళు కట్టుకునేకి గడ్డిపరకలు ముక్కున కరుచుకుని వెళుతుంటే, ఆ కాకులు గ్రామలక్ష్మి కంఠంలో ఇంద్రనీలమణుల్లాగా, కాకుల నోట ఉన్న గడ్డిపరకలు ఆ మణులకు అంటుకున్న గడ్డిపరకల్లాగా ఉన్నాయని అందమైన పద్యం చెప్పాడుట. ఇంద్రనీల మణి అంటే, నీలపు రంగులో ఉన్న ఒక రకం మణి.

పాప : ఎంత బావుందో.

నాన్న : సరే. విషయానికి వద్దాం. ఆ తర్వాత 16 వ శతాబ్దంలో విద్యుత్తు ను “లైడెన్ జార్” అనే పాత్రలో పట్టుకోవచ్చని, ఆ పాత్ర అంచులని ముట్టుకుంటే, చిటపట శబ్దాలతో షాకు కొడుతుందని కనుక్కున్నారు. ఇవన్నీ నువ్వు చదువుకుంటావు, మీ పాఠాలలో.

పాప : మరి పిడుక్కీ, దీనికి సంబంధం ఏమిటి?

నాన్న : మేఘాల మధ్యలో మెరుపులు, ఉరుములు వస్తాయి కదా? ఆ చప్పుడు, ఇందాక చెప్పిన చిటపట శబ్దాలు ఒకలాంటివే అని, బెంజమిన్ ఫ్రాంక్లిన్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఆ తర్వాత ఆయన సిల్కు గుడ్డతో గాలిపటం తయారు చేసి, వర్షం వచ్చే ముందు గాలిపటం ఎగరేసి, గాలిపటం దారం ద్వారా జారిన విద్యుత్తు ప్రవాహాన్ని, పైన చెప్పిన లైడెన్ జారులో పట్టాడన్నమాట. అలాగ ప్రయోగాలు చేసి, ఆయన చివరకు ఉపాయం కనుక్కున్నాడు.

పాప : అసలు మేఘాలలో విద్యుత్తు ఎలా తయారవుతుంది నాన్నా?

నాన్న : నీటి రసాయన నామం H2O అని చదువుకుని ఉంటావు. మేఘాలలో కూడా నీళ్ళే కదమ్మా. ఆ నీటి కణాలు బలమైన గాలులవల్ల H – OH అని రెండుగా విడిపోయి విద్యుత్పీడనం పెరిగి, మెరుపులు ఉరుములు పుడతాయి. H అంటే ధన విద్యుత్తు, OH అంటే ఋణ విద్యుత్తు. వీటి వురించి ఇంకా వివరంగా నువ్వు నీ సామాన్య శాస్త్రం పాఠాలలో తెలుసుకుంటావు!

పాప : అలాగా?

నాన్న : అవునమ్మా. ఇంకా మెరుపులు ఎలా వస్తాయి? పిడుగులెక్కడ పడతాయి? వడగళ్ళు అంటే ఏమిటి? ఇలాంటి అనేక విషయాలు ఒక తాతయ్య పుస్తకంలో రాసి పెట్టాడు. నీకు ఆ పుస్తకం చదివితే, ఇందాక చెప్పిన విషయాలతో పాటుగా ఇంకా బోల్డన్ని విషయాలు తెలుస్తాయి. ఈ ఆదివారం ఆ పుస్తకం చదివేయాలేం?

పాప : ఆ పుస్తకం పేరేమిటి నాన్నా?

నాన్న : పిడుగు దేవర కథ. రాసిన తాతయ్య పేరు, మహీధర నళినీమోహన్.

పాప : బాగుంది నాన్న.

నాన్న : సరేనమ్మా, బాగా పొద్దుపోయింది. ఇక పడుకో!

***********************

చప్పున నిద్ర నుండీ మెలకువ వచ్చింది నాకు. మంచి కల.ఆ పుస్తకం చదువుతూ నిద్రపోయాను రాత్రి.

***********************

(మహీధర నళినీమోహన్ గారి ఈ పుస్తకం విశాలాంధ్ర ప్రచురణ. ఈయన పుస్తకాలు ఇప్పటి కాలం పిల్లలకు చదివించవలసిన అవసరం, బాధ్యత మన మీద ఉన్నాయి. ఈ పుస్తకం ప్రస్తుతం ముద్రణ నిలిపి వేసినట్టు కనపడుతుంది.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!