మను చరిత్రము.....అల్లసాని పెద్దన్న.....౩౦/4/15.

మను చరిత్రము.....అల్లసాని పెద్దన్న.....౩౦/4/15.
.
వరూధినీ నర్మగర్భ భాషణము .....ప్రవరుఁడు వరూధుని కామనను నిరాకరించుట .!
ఉ. ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే...
కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా
గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికి\న్‌?
.
వ. అని నర్మగర్భంబుగాఁ బలికి, క్రమ్మఱ నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె.
.

సీ. చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధిఁ, బొడమిన చెలువ తోఁబుట్టు మాకు
రహి పుట్ట జంత్రగాత్రముల ఱాల్‌ గరఁగించు, విమలగాంధర్వంబు విద్య మాకు
ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు, పని వెన్నతోడఁ బెట్టినది మాకు
హయమేధ రాజసూయము లనఁ బేర్వడ్డ, సవనతంత్రంబు లుంకువలు మాకుఁ
.
తే. గనకనగసీమఁ గల్ప వృక్షముల నీడఁ
బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ,
పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర!
.
క. పేరు వరూధిని విప్రకు
మార! ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
మా రంభా శశిరేఖ లు
దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్‌.
.
మ. బహురత్నద్యుతి మేదురోదర దరీ భాగంబులం బొల్చు ని
మ్మిహికాహార్యమున\న్‌ జరింతు మెపుడుం బ్రేమ\న్‌, నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబు లివి, మత్కాంతార సంతానముల్‌.
.
క. భూసుర! కైతవ కుసుమ శ
రాసన! మాయింటి విందవైతివి, గైకొ
మ్మా! సముదంచ న్మణిభవ
నాసీనత సేద దేఱి యాతిథ్యంబు\న్‌.
.
తే. కుందనమువంటి మేను మధ్యందినాత
పోష్మహతిఁ గందె, వడ దాఁకె నొప్పులొలుకు
వదన, మస్మద్గృహంబు పావనము సేసి
బడలికలు వాసి చను మన్న బ్రాహ్మణుండు.
.
ఉ. అండజయాన! నీ వొసఁగునట్టి సపర్యలు మాకు వచ్చె, నిం
దుండఁగ రాదు, పోవలయు నూరికి, నింటికి నిప్పు, డేను రా
కుండ నొకండు వచ్చి మఱియొండునె? భక్తియ చాలు, సత్క్రియా
కాండముఁ దీర్ప, వేగ చనఁగా వలయున్‌ గరుణింపు నాపయిన్‌.
.
ఉ. ఏ నిఁక నిల్లు సేరుటకు నెద్ది యుపాయము? మీ మహత్త్వము
ల్మానిని! దివ్యముల్‌; మదిఁ దలంచిన నెందును మీ కసాధ్యము
ల్గానము గానఁ దల్లి! ప్రజలన్‌ ననుఁ గూర్చు మటన్న, లేఁత న
వ్వాననసీమఁ దోఁప, ధవళాయతలోచన వాని కిట్లనున్‌.
.
ఉ. ఎక్కడియూరు? కాల్నిలువకింటికిఁ బోయెద నంచుఁ బల్కె దీ
వక్కట! మీకుటీరనిలయంబులకున్‌ సరిరాక పోయెనే
యిక్కడి రత్నకందరము! లిక్కడి నందన చందనోత్కరం!
బిక్కడి గాంగసైకతము! లిక్కడి యీ లవనీనికుంజముల్‌.
.
ఉ. నిక్కము దాఁప నేల ధరణీసురనందన! యింక నీపయిన్‌
జిక్కె మనంబు నాకు, ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో?చొక్కి మరందమద్యముల చూఱలఁ బాటలువాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో?
.
క. అనుటయుఁ బ్రవరుం డిట్లను
వనజేక్షణ! యిట్లు వలుక వరుసయె? వ్రతులై
దినములు గడపెడు విప్రులఁ
జనునే కామింప? మది విచారము వలదే?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!