మను చరిత్రము.3 . సిద్ధాగమనము - అతిథి సత్కారము .!.

మను చరిత్రము.3

.

సిద్ధాగమనము - అతిథి సత్కారము

.

సీ. ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె, మొగముతోలు కిరీటముగ ధరించి

కకపాల కేదార కటక ముద్రిత పాణిఁ, గుఱుచ లాతాముతోఁ గూర్చిపట్టి

యైణేయమైన యొడ్డాణంబు లవణిచే, నక్కళించిన పొట్ట మక్కళించి

యారకూటచ్ఛాయ నవఘళింపఁగఁ జాలు, బడుగుదేహంబున భస్మ మలఁది 

.

తే. మిట్టయురమున నిడుయోగ పట్టె మెఱయఁ

జెవుల రుద్రాక్షపోఁగులు చవుకళింపఁ

గావికుబుసంబు జలకుండికయును బూని

చేరెఁ దద్గేహ మౌషధసిద్ధుఁడొకడు.

.

తే. ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రుఁ గాంచి

భక్తిసంయుక్తి నెదురేఁగి ప్రణతుఁ డగుచు

నర్ఘ్యపాద్యాది పూజనం బాచరించి

యిష్టమృష్టాన్నకలన సంతుష్టుఁ జేసి,

.

క. ఎందుండి యెందుఁ బోవుచు

నిందుల కేతెంచినార లిప్పుడు? విద్వ

ద్వందిత! నేఁడుగదా! మ

న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుఁడ నైతి\న్‌.

.

క. మీమాటలు మంత్రంబులు,

మీమెట్టినయెడ ప్రయాగ, మీపాద పవి

త్రామలతోయము లలఘు

ద్యోమార్గఝరాంబు పౌనరుక్త్యము లుర్వి\న్‌

.

ఉ. వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయి\న్‌

వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేఱు సేయ కె

వ్వాని గృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన

స్నానవిధాన్నపానముల సంతస మందుచుఁ బోవు నిచ్చలు\న్‌. 

.

తే. మౌనినాథ! కుటుంబజంబాలపటల

మగ్న మాదృశ గృహమేధి మండలంబు

నుద్ధరింపంగ నౌషధ మొండు గలదె?

యుష్మదంఘ్రిరజోలేశ మొకటి దక్క

.

క. నా విని ముని యి ట్లను వ

త్సా! విను మావంటి తైర్థికావళి కెల్ల\న్‌

మీవంటి గృహస్థుల సుఖ

జీవనమునఁగాదె! తీర్థసేవయుఁ దలప\న్‌.

.

సీ. కెలఁకుల నున్న తంగెటిజున్ను గృహమేధి, యజమానుఁ దంకస్థితార్థపేటి

పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు, దొడ్డిఁ బెట్టిన వేల్పుగిడ్డి కాఁపు

కడలేని యమృతంపు నడబావి సంసారి, సవిధమేరునగంబు భవనభర్త

మరుదేశపథ మధ్యమప్రప కులపతి, యాఁకటి కొదవు సస్యము కుటుంబి 

తే. బధిర పంగ్వంధ బిక్షుక బ్రహ్మచారి

జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ

ధూత కాపాలికా ద్యనాథులకుఁ గాన

భూసురోత్తమ! గార్హస్థ్యమునకు సరియె?

.

క. నావుఁడు బ్రవరుం డి ట్లను

దేవా! దేవర సమస్త తీర్థాటనము\న్‌

గావింపుదు రిలపై నటు

గావున విభజించి యడుగఁ గౌతుక మయ్యె\న్‌.

.

.

శా. ఏ యే దేశముల\న్‌ జరించితిరి, మీ రే యే గిరుల్‌ చూచినా,

రే యే తీర్థములందుఁ గ్రుంకిడితి, రే యే ద్వీపముల్‌ మెట్టినా,

రే యే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి, రే యే తోయధుల్‌ డాసినా

రాయా చోటులఁ గల్గు వింతలు మహాత్మా! నా కెఱింగింపరే!

.

.

తే. పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ

మహిమ వినుటయు నఖిల కల్మష హరంబ

కాన వేఁడెద ననిన న మ్మౌనివర్యుఁ

డాదరాయత్తచిత్తుఁడై యతని కనియె.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!