కంచికి పోతావా కృష్ణమ్మా” – పల్లవికి అర్థం ఏంటమ్మా? 🌹🌹

కంచికి పోతావా కృష్ణమ్మా” – పల్లవికి అర్థం ఏంటమ్మా?


🌹🌹


“శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే – “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నార


బాలభాష 🌹

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ


కంచికామాక్షమ్మ


కంచికి పోతావా కృష్ణమ్మా!

ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?

కంచిలో ఉన్నది అవ్వ;

ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.

బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,

నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?

కోమటి యింటిది అప్పు;

ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.

పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,

నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?

దొడ్లోను ఉన్నది బీర;

ఆ - బీర నాకు పెట్టు కూర.

కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;

నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?

కోమటి అక్కెమ్మ చెయ్యి;

ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.

నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;

నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?

ఉన్నయింటి యిరుగుపొరుగు,

ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.

బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;

నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?

అక్కడ ఉన్నది అమ్మ,

నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.


ఇలా ప్రశ్నోత్తరాలతో సాగుతుంది పాట. 

ఇక్కడ సమాధానంలో అవ్వ-బువ్వ బదులు బొమ్మా-ముద్దుగుమ్మా అనడం వేటూరి చమత్కారం.


సినిమాలో ఒకరినొకరు ఇష్టపడ్డా, ఇంకా బైటపడని 

అబ్బాయి-అమ్మాయి ఉంటారు. అమ్మాయికి వినిపించేలా ఓ బొమ్మతో మాట్లాడుతున్నట్టు పాటందుకుంటాడు అబ్బాయి. 

పల్లవిలోనే విషయం బైటపెట్టేస్తాడు – నా ధ్యాసంతా ఆ ముద్దుగుమ్మేనంటూ. ఏ ముద్దుగుమ్మో మనకీ తెలుసు, 

ఆ అమ్మాయికీ తెలుసు!


అవునవును! ప్రేమలో పడ్డవాళ్ళకి అన్నీ మంచివార్తలే!

పడనివాళ్ళ కోసం ఇదిగో ఇలా మంచిపాటలు!


https://www.youtube.com/watch?v=8fntboGbo5g

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!