వేదాంతం సత్యనారాయణ శర్మ !!


భామనే.........!

భామనే...సత్యభామనే ,

భామనే...సత్యభామనే ,

సుందరవదనం నాదేనే ,

సుందరి అంటే నేనేనే ,

పంతం అంటే నాదేనే ,

పౌరుషమంటే నేనేనే ,

చిలకల పలుకులు నావేనే ,

అలకల మొలకను నేనేనే ,

శ్రీకృష్ణుని కిష్టం నేనేనే ,

శ్రీకృష్ణసత్యను నే...నే...నే ,

భామనే...సత్యభామనే ,

భామనే...సత్యభామనే .

******

ఉషాకన్యగా పేరుగాంచిన వేదాంతం సత్యనారాయణ శర్మ 1934 సెప్టెంబరు 9న

కూచిపూడిలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు. వేదాంతం ప్రహ్లాదశర్మ, వీరరాఘవయ్య ఈయన సోదరులు. సత్యనారాయణ శర్మకు 18వ ఏట 1952లో పసుమర్తి కొండలరాయుడు కనిష్ట పుత్రిక లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సత్యనారాయణ శర్మ చిన్ననాటనే జావళీలు, రామదాసు, త్యాగరాజు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ఔపోసన పట్టారు. యక్షగానాల్లో చెలికత్తెగా అభినయించారు. వేదాంతం తన పెద్దన్న ప్రహ్లాదశర్మ, పినతండ్రి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. 

కూచిపూడి నాట్యాన్ని రక్తికట్టించేందుకు మచిలీపట్నానికి చెందిన వారణాసి బ్రహ్మయ్య వద్ద వయోలిన్ విద్యను, సంగీత కళానిధి ఏలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. చిన్ననాటనే ప్రహ్లాదునిగా, లోహితాస్యునిగా, శ్రీరాముడిగా, ధర్మాంగజుడిగా, బాల నర్తకుడిగా పలువురిని అలరింపచేశారు. సత్యనారాయణశర్మ చిన్న వయస్సులోనే కేంద్ర సంగీత నాటక అవార్డును, పద్మశ్రీ అవార్డును అందుకుని పలువురు నాట్యాచార్యులకు ఆదర్శంగా నిలిచారు. కూచిపూడి నాట్యంలోని యక్ష నృత్యాంశాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. 

కూచిపూడి నాట్య ప్రదర్శనల ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్టప్రతులు వివి గిరి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డా. శంకర్‌దయాళ్ శర్మ, డా. జకీర్ హెస్సేన్, డా. ఆర్‌కె నారాయణన్‌ల ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనను తిలకించి అభినందించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళీదాస్ సమ్మాన్ అవార్డుతో సత్కరించింది. 2005లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హంస అవార్డును అందచేసింది. సిద్ధేంద్రయోగి నర్తన అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం భరతముని అవార్డుతో సత్కరించింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!