భర్తృహరి సుభాషిత రత్నావళి (త్రిశతి) 🙏

భర్తృహరి సుభాషిత రత్నావళి (త్రిశతి)


🙏


          (నీతి,  శృంగార, వైరాగ్యముల బోధింౘునది)


                     ( ఏనుగు లక్ష్మణకవి ప్రణీతము)


                                   నీతి శతకము


                                 మానశౌర్య పద్ధతి _3


                                    


శ్లోకము ( 23 )


అవతారిక:


నీౘులయొక్కయూ నుత్తములయొక్కయూ నడవడిలోని తారతమ్యమును

సూచింౘుౘున్నాడు.


శ్లోకము :


            లాంఙ్ఞిల చాలనమధశ్చరణావఘాతం

            భూమౌ నపత్య వదనోదర దర్శనంచ,

            శ్వా పిణ్డదశ్య కురుతే గజ పుఙ్గవస్తు

            ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుఙ్క్తే !!


టీక :


శ్వా = కుక్క, పిండదశ్యం =  కూటిముద్ద వేయువాని ఎదుట,  లాంగూల

చాలనం = తోఁ కనాడింౘుటను, అధః = క్రింద , చరణ అవఘాతం = 

కాళ్ళతో కొట్టుటను,  భూమౌ = నేలయందు, నిపత్య = వెల్లకిల పడి, వదన

ఉదర దర్శనంచ = నోటిని కడుపునూ ౘూపుటను,  కురుతే = చేయును, 

గజ పుంఙ్గవ తు = మంచి ఏనుఁ గు అన్ననో, పిండదుని = ముద్ద పెట్టువానిని

ధీరం = బెట్టుగా , విలోకయతి = ౘూౘును, చాటు శతైః = వంద మంచి మాటల 

చేత, భుఙ్క్తా = తినును.


తాత్పర్యము:


కుక్క తనకు పిడికెడన్నము పెట్టు వాని ఎదుట తోఁ క నాడింౘుట, భూమిని

కాళ్ళతోఁ గొట్టుట, భూమి మీద వెల్లకిల బడి నోరు, కడుపు ౘూపుట, మొదలగు 

నీచ కృత్యము లెన్ని యో జేయును. గజ శ్రేష్టము ధైర్యముతోఁ జూౘుౘు, మావటి

వాని చేత ప్రియ వాక్యములచే లాలింపఁ బడుౘు, ఆహారమును గ్రహింౘును.



ఏనుగు లక్ష్మణకవి:


ఉ :    వాలముఁ ద్రిప్పు నేలఁ బడి వక్త్రముఁ గుక్షియుఁ జూపుఁ గ్రిందటం

         గాలిడుఁ ద్రవ్వుఁ బిండదుని , కట్టెదటన్ శునకంబు భద్ర శుం

         డాలము శాలి తండుల గుడంబులు చాటు వచశ్శతంబుచే

         నోలి భుజింౘు ధైర్యగుణ యుక్తిగఁ జూౘు, మహోన్నత స్థితిన్ !!


ఎలకూచి బాలసరస్వతి

(మల్లభూపాలీయము)


మ :    భువిపైఁ జాంగిలి తోఁ క యూఁ ౘు ,వదనంబున్బొట్టయు న్సార్ఁ జూ

           పు,  వెసఁ బట్టెడు ముద్దకై శునక, మెప్డు న్భద్ర వేదండ మా

           కవణం బల్లనఁ గైకొను న్బహుమదుల్గావింపఁ దానెంతో సొం

           పవులేఁ జూపులఁ  జూౘుౘు న్సురభిమల్లా  నీతివాచస్పతీ !!



పుష్పగిరి తిమ్మ కవి


చ :    బలువిడి తోఁ కఁ ద్రిప్పి, పతి పాదము లూనుౘు, గ్రింద వ్రాలుౘు,

         న్వెలికిల నేలపైఁ బడుౘు , వేమఱు నో రుదరంబె ౘూపుౘు,

         న్బెలుకురు కుక్క కొక్క కడిఁ బెట్టరు, ధీరతఁ జూౘుౘున్ వ దా

         వళము భుజింౘుఁ  జాటు శత వాక్కుల పెన్గవణంబు లిమ్ములన్ !!



భర్తృహరి  సుభాషిత రత్నావళి (త్రిశతి)


          (నీతి,  శృంగార, వైరాగ్యముల బోధింౘునది)


                     (


                                   నీతి శతకము


                                 మానశౌర్య పద్ధతి _3


                                    


శ్లోకము ( 24 )


అవతారిక:


 " శౌర్య మానాదులు గల  వంశోద్ధారకుఁ డే సఫలజీవితుఁ డు " అను ౘున్నాడు.



శ్లోకము :


         పరివర్తిని సంసారే  మృతః  కో వా  న జాయతే

         స  జాతో  యేన   జాతేన  యాతి   వంశస్సమున్నతిమ్ !!


టీక :


పరివర్తిని = తిరుగుౘుండు,  సంసారే = ౘావు పుట్టుకల వరుసలో, మృతః =

ౘచ్చినవాఁ డు,  కః వా = ఎవ్వడు,  న జాయతే = పుట్టఁ డు, యేనజాతేన =

 ఏ పుట్టిన వాని చేత.(ఎవడు పుట్టుట చేత), వంశః = కులము, సమున్నతిం =

గొప్పతనమును, యాతి = పొందునో, సః = వాడు, జాతః = పుట్టినవాడు.


తాత్పర్యము :


ౘావు పుట్టుక లనునవి యెప్పుడునూ గల  ఈసంసార చక్రమునఁ 

జచ్చిన వారందఱునూ బుట్టువారే.  అట్లు పుట్టిన వారిలో నశింపని వారెవరు ?

ఎవని పుట్టుక వలన వంశము కీర్త్యాదులచేత వాసిగాంౘునో, వాఁ డే

జన్మించినవాఁ డు.  వాని జన్మయే గణనీయము.  




ఏనుగు లక్ష్మణకవి:


తేగీ :    ప్రాణి లోకంబు సంసార పతిత మగుట

           వసుధపైఁ  గిట్టి పుట్టని వాఁ  గలఁ డె

           వాని జన్మంబు సఫల మెవ్వాని వలన

           వంశ మధికోన్నతి వహించి వన్నెకెక్కు !!




ఎలకూచి బాలసరస్వతి

(మల్లభూపాలీయము)


    మ :    జనఁ డెవ్వాఁ డు జనింపఁ ?  డెల్ల జనులు స్సంసార చక్రంబునన్

              జననంబెత్తెడు వారె కారె ? విను, జన్మం బెవ్వఁ డే నెత్తినన్

              దన వంశంబు ప్రకాశ మౌ నతఁ డు జన్మం బెత్తి నాతండు, పా

              లన సంతోషిత భూజనా సురభి మల్లా నీతివాచస్పతీ !!



పుష్పగిరి తిమ్మ కవి


     చ :    ఎడతెగ కిట్లు సంసరణ మెల్లప్పుడున్  బరివర్తిల్లంగ. నే

              యెడ మృతిఁ బొంది యెవ్వఁ డుదయింపఁ డు ? పుట్టుకకేమి, యెవ్వఁ డీ

              పుడమి జనింపఁ  దత్కులము భూరి సమున్నతిఁ జెందు  వానిదే

              యొడలును జన్మము, న్బురువు లొక్కొకచోఁ  బది కోట్లు పుట్టవే ?



శ్లోకము


అవతారిక:


మానవంతుని వర్తనమును జెప్పుౘున్నాడు.


శ్లోకము :


కుసుమ స్తబక స్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః, 

మూర్థ్ని వా సర్వ లోకస్య శీర్యతే వన ఏవ వా !!


టీక :


కుసుమస్తబకస్య ఇవ = పూలగుత్తి వలె, మనస్వినః = గొప్ప బుద్ధి గలవానికి

( మానము శౌర్యము గలవానికి), వృత్తిః = నడవడి, ద్వయీ = రెండు విధము

లయినది, (ఎట్లనగా). సర్వలోకస్య = సమస్త జనము యొక్క, మూర్థ్ని =

శిరస్సునందు అనగా సిగయందని అందఱకన్నా పైవాడని, ( స్థీయతే = ఉండుట)

వా = అట్లు కాదేనీ, వనే ఏవ = అరణ్యమందే, శీర్యతేవా = జీర్ణింౘుటయో.


తాత్పర్యము :


మహనీయుఁ డగు విద్వాంసునకు పుష్పగుచ్ఛమునకుఁ బోలె ఎల్లఱ చేత

శిరసావహింపఁ బడుటయో, లేక అరణ్యముననే మ్రగ్గుటయో ఈ రెండు

గతులేతప్ప వేఱు విధము లేదు.


ఏనుగు లక్ష్మణకవి:


తేగీ : కుసుమ గుచ్ఛంబునకుఁ బోలెఁ బొసఁ గు శౌర్య

మానవంతున కివి రెండు మహిత గతులు

సకల జన మస్తక ప్రదేశము లనైన

వనము నందైన జీర్ణ భావంబుఁ గనుట !!


ఎలకూచి బాలసరస్వతి

(మల్లభూపాలీయము)


మ : అలరుంగుత్తికిఁ బుణ్యశీలునకు యోగ్య స్థనముల్ రెండె సు

మ్మలరింౘు, న్మరి రెండు నెవ్వి యనిన న్బ్రాంచన్మహారణ్యమం

డలి యొండె, న్ధరణీ జన ప్రవర ౘూడా సీమ యొండెం జుమీ,

లలనా నూతన మన్మథా సురభిమల్లా నీతివాచస్పతీ !!


పుష్పగిరి తిమ్మ కవి


ఉ : మాసర వాసనైక కుసుమ స్తబకాకృతి రెండు వృత్తుల 

న్భాసిలు మానశాలి యగు ప్రాఙ్ఞుఁ , డదెట్లనఁ గాః భురంబు దాఁ

జేసిన సర్వ లోకములుఁ జెల్వుగ నౌదల దాల్ప నుండు, న

య్యాసలు బాసి న్దపసి యై వనసీమల. నుండు నెమ్మదిన్ !!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!