నాకు కొంత కాలం బతకాలని... (Sailaja గారి కవిత Nov .2012.)

నాకు కొంత కాలం బతకాలని...

(Sailaja గారి కవిత Nov .2012.)


అక్కడ మబ్బులు భయ భయంగా నిలుచున్నాయి ..

ఇక్కడ గాలులు దూర దూరంగా జరుగుతున్నాయి 

రండి.. పక్షులూ... ఎగిరి వచ్చి ఇక్కడ దాక్కోండి .

ఇప్పుడు నా గుండె, గుడిలో గూడులా మారింది..


అక్కడ విప్పారిన రెక్కలతో..నిటారైన శరీరాలతో 

కాల ప్రపంచం నుండి మాటలు వినబడుతున్నాయి 

ఇక్కడ తల్లి కొంగు చాటున దాగున్న పిల్లల్లా


సంధ్యా కాంతులు నన్ను చూసి నవ్వుతున్నాయి..

రండి..వెలుగులూ..వచ్చి నా ఒడినిండా పరుచుకోండి

ఇప్పుడు నా ఆనంద ప్రవాహాలకు తీరం కనబడుతోంది..


అక్కడ అందమయిన గులాబీలు 

ముళ్ళను కాపాడుతున్నాయి.. 

ఇక్కడ పిడికిట్లో దాగున్న సంతోష వీచికలు 

గంధం తెరల మధ్య దాగున్న విషాదాన్ని దాస్తున్నాయి 

రండి క్రీనీడలూ.. వచ్చి నా వెనుకగా దాక్కోండి 

ఇప్పుడు నా హృదయ ప్రయాణం దారి అర్థమవుతోంది...


అక్కడ ఆశా పతాకాలు అరుణిమ దాల్చి 

నాకేసి ఉరిమి చూస్తూ మంచు బిందువులు రాల్చుతున్నాయి..

ఇక్కడ దిక్కులు నాలుగు అయిష్టంగానే 

మానవీయ సరస్సులో ఈత కొడుతున్నాయి 

రండి..ప్రతీకలూ... వచ్చి నా ప్రతి పనిలోనూ ఉండిపొండి 

ఇప్పుడు నా ఆత్మానుభుతుల్లో అవగాహనా స్పర్శ కనబడుతోంది


అక్కడ పూలలో మధు ధార నరాలలోకి చేరి 

శక్తి రూప మెత్తి ప్రమోద గీతాలు పాడుతున్నాయి

ఇక్కడ నా ప్రతి పుటలో కన్నీటి ధార హృదయంలో చేరి

ప్రేమ అవతారమెత్తి నా కృతి భూమికలుగా మారుతున్నాయి 

రండి.. శిలలూ..వచ్చి నా శిల్పానికి కాస్త ప్రాణం పోయండి 

ఇప్పుడు నాకు కొంతకాలం బతకాలని ఉంది...


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!