సుందరకాండ విశిష్టత:

సుందరకాండ విశిష్టత:

 ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు ఆమె వసించును కావున ఇది సుందరకాండ.మైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి - రామాయణ రహస్యములు’ అనే పుస్తకాంలో అభిప్రాయపడ్డారు. తతో రావణనీతాయహ్ సీతాయహ్ శత్రుకర్షనహ్ ఇయెష్ట పదమన్వెష్ణుం చారణచిరితె పథి సుందరకాండ ‘తత్’ అనే పదంతో కూడిన పైపద్యంతో మొదలవుతుంది. తత్ అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసనచేయాలో సుందరకాండ వివరిస్తుంది. అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు. అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము: సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము. ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!