అలుక చెందిన భార్యలకు ...


ఒకనాడు రాయలువారు అర్ధరాత్రివేళ చిన్నమదేవి అంత:పురానికి వెళ్ళేసరికి అప్పటివరకు రాయలుకోసం వేచివున్న చిన్నమదేవి నిద్రకు ఆగలేక తల్పంపైన పరుండినది. ఆమెకు నిద్రాభంగము కావించరాదని రాయలు ఆమె ప్రక్కనే ఆమె కాళ్ళవైపు పరుండెనట. నిద్రలో ఆమె కాలు జాచుకొనుసరికి ఆమె ఎడమకాలు రాయల శిరస్సుకు తగిలినది. అందుకు రాయలు కోపోద్దీపుడై విస విసా వెడలినారుట. తనకాలికేదో తగిలిందని చివుక్కున లేచిన చిన్నమదేవి వెళ్ళిపోతున్న భర్తను జూచింది. కాని అప్పటికే రాయలు ఆమె అంత:పురం దాటి వెళ్ళారుట. ఆ తరువాత రాయలు ఆమె వద్దకే రావడం మానివేసారు. పొరపాటున తన కాలు రాయలవారి శిరస్సుకు తగిలినందువల్లే ఆగ్రహించి రాయలు రావడం లేదని గ్రహించిన చిన్నమదేవి ముక్కు తిమ్మన్నగారితో చెప్పుకొని దు:ఖించింది. అప్పుడు తిమ్మన్నగారు పారిజాతాపహరణ కావ్యం రచించి ఈ పద్యంలో చిన్నమ దేవి తప్పు ఇసుమంతైనా లేదని నిగూడంగా తెలియబరిచారుట.


జలజాతాసన వాసవాది సురపూజాభాజనంబైతన 

ర్చులతాంతాయుధుకన్నతండ్రి శిరమిచ్చో వామపాదంబునం 

దొలగంద్రోచెలతాంగి;యట్లెయగు నాధుల్నేరముల్సేయ పే 

రలుకం జెందినయట్టి కాంతలుచితవ్యాపరముల్నేర్తురే


ఎలా సమర్ధించారు? ఈ పద్యంలోని భావం పరికిద్దాం... 


జలజాతాసునుడు అనగా బ్రహ్మ, ఇంద్రుడు ఇలాంటి వారితో గూడిన దేవతలచే పూజింపబడే శిరస్సును...


ఎలాంటి శిరస్సు? 


లతాంతాయుధు కన్నతండ్రి అనగా మన్మధుని కన్న తండ్రి శిరస్సును ఇక్కడ ఎడమకాలితో తొలగంద్రోచె లతాంగి ఎవరు? లతవంటి శరీరముగల సత్యభామ అలా లా పక్కకు నెట్టింది అంతే తన్నలేదు. ఎందుకు తన్నలేదు? ఆమె లతవంటి సుకుమారమైన శరీరం కలది కనుక. 


పోనీ అలా కాలితో పక్కకు నెట్టవచ్చా? తప్పుకదూ?? 


అందుకు తిమ్మన్న ఎలా సమర్ధించారంటే... 


అవునండి అట్లెయగు .. అలాగే అవుతుంది. 


ఎందుకని? 


నాధుల్ నేరముల్ చేయ పేరలుకన్ చెందిన యట్టి కాంతలు 


మొగుళ్ళు తప్పులు చేస్తే 


ఎలాంటి తప్పు? 


పారిజాత పుష్పాన్ని తనకు ప్రియమైన భార్యకు ఇమ్మంటే సత్యభామకు ఇవ్వకుండా రుక్మిణికి ఇచ్చాడుగా శ్రీకృష్ణుడు. 


(ఇక్కడ అర్ధరాత్రివరకూ భర్తకోసం కళ్ళు కాయలుకాసేలా తను వేచివుంది చివరకు నిద్రకు తాళలేక పడుక్కుంటే, ఆలశ్యంగా రావడమేగాక, పైగా ఎందుకని ఆమె కాళ్ళవైపే తలపెట్టి రాయలు పడుక్కోవాలీ?) 


పేరలుకన్ చెందిన యట్టి కాంతలుచితవ్యాపరముల్ నేర్తురే? 


అలుక చెందిన భార్యలకు ... 


భార్యలేమిటి? ఎవరికైనా ఆకోపోద్రేకంలో ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ వుంటుందా? ఇలా రాయలువారి తప్పుకూడావుంది సుమా అని అన్యాపదేసంగా శ్రీకృష్ణుని పరంగా ఎత్తి చూపడంతో తర్వాత కధ సుఖాంతమైందని ఒక చరిత్ర.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!