మృత్యుంజయా! పద్యకవితా ఖండికలు.

మృత్యుంజయా!            పద్యకవితా ఖండికలు.

( మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి  గారు.    విశ్లేషణ :కామేశ్వర రావు భైరవభట్ల  )

శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది.

పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి వినిపిస్తుందా అని. ఎందుకా అనుమానమంటే చెపుతున్నాడు కవి:

మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా

బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె

క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం

బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!

ఓ వైపు పాముల బుసబుసలు, మరోవైపు అర్థాంగితో గుసగుసలు. అది చూసి నెత్తినున్న గంగమ్మకు రుసరుసలు! ఈ గోలలో తనలాంటి భక్తుల మొఱలు ఆయనకెలా వినిపిస్తాయని కవిగారి సంశయం. "అప్పా" అన్న సంబోధనలో ఎంత ఆత్మీయత ఉంది! శివయ్య తనను కన్నతండ్రి అని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడీ కవి. ఆ చనువుతోనే ఇంకా ఏమంటాడంటే:

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు జా

లక కాబోలును సృష్టి జేసితివి యీ లంబోదరుం గూడ, దీ

గకు గాయల్ బరువౌన, కాని, కుడుముల్ గల్పించి యవ్వాని కే

లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్ మొల్పింతు మృత్యుంజయా!

"ఏమయ్యా మృత్యుంజయా! నీకు లంబోదరుడైన పుత్రుడు ముందే ఒకడున్నాడు కదా (గణపతి అన్న మాట!). అతడు చాలక కాబోలు మరో లంబోదరుడైన నన్ను పుట్టించావు! (కవిగారిది బానపొట్ట కాబోలు :-)) సరే, తీగకు కాయలు బరువా? పుట్టించావు. బాగానే ఉంది. కానీ, ఆ కుమారునికేమో చక్కగా కుడుములు పెడతావు. ఈ కోడుకుని మాత్రం యిడుములపాలు చేస్తున్నావే, ఇదేమి న్యాయం?" అంటూ నిలదీస్తాడు కవి.

ఒక గాఢమైన తాత్త్విక విషయాన్ని కూడా లేలేత నవ్వులలో ఎలా పలికించ వచ్చో యీ పద్యం చూస్తే తెలుస్తుంది:

సరిలే! మానవకోటి యీ వెలుపలన్ సంసారచక్రాననే

దొరలన్ లేకిటులుండ, లో నొకటి రెండున్ గావె షడ్చక్రముల్

వరుసన్ జేర్చి బిగించినావుగద అబ్బా! నాగపాశాలతో

దరియింపన్ దరమౌనె నీ కరుణచేతన్ గాక మృత్యుంజయా!

"సరిసరి! మేము బయటనున్న సంసారమనే ఒకే ఒక చక్రంలో పడి అందులోనుంచే బయటపడలేక సతమతమవుతూంటే, అది చాలదన్నట్టు, మా లోపల ఒకటికాదు రెండుకాదు ఆరు చక్రాలను నాగపాశాలతో బిగించేసావు కదా! అబ్బా! నీ కరుణ లేకుండా వీటిని భేదించడం మాకు సాధ్యమవుతుందా చెప్పు!" అంటున్నాడు. మాట్లాడే భాషలోని కాకువు, నుడికారంలోని సొగసు, అవలీలగా పద్యంలో నిబంధించడం ఈ కవిగారికి బాగా తెలిసిన విద్య అనిపిస్తుంది యీ పద్యాలు చూస్తే.

వీరి పద్యాలలో హాస్యమొక్కటే కాదు, గాఢమైన అనుభూతీ ఆర్తీ కూడా ఉన్నాయి.

ఏ బైకిన్ దెగపండితుండనను పేరే గాని నాలోని కే

బో బోవంగను జెప్ప లజ్జయయిపోవున్ నేను నా బుద్ధికే

యే బొడ్డూడని బిడ్డనో యగుదు తండ్రీ! నిక్క మీపాటిదే

నా బండారము, త్రోవ నీవిడక యున్నంగాదు మృత్యుంజయా!

నిజమైన ఆత్మవిమర్శా ఆత్మావలోకనమూ చేసుకున్నప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోతుందనడాన్ని యీ పద్యం చెపుతోంది. "పైకి నేను తెగ పండితుడనన్న పేరుంది కానీ, నిజంగా లోలోపల తొంగిచూసుకుంటే నా మీద నాకే సిగ్గువేస్తుంది. నేను నాకే ఒక బొడ్డూడని బిడ్డలాగా కనిపిస్తాను. నా బండారం నిజంగా అంతే! అంచేత నువ్వే నాకు తోవ చూపించాలి" అంటున్నాడు కవి. లోలోపలకి తొంగి చూసుకుంటే మన పరిమితులు మనకి స్పష్టంగా బోధపడతాయి. అనంతమైన ఈ విశ్వంలో విస్తరించిన శక్తి ముందు మన శక్తి ఎంత అల్పమైనదో మనకి తెలిసివస్తుంది.

శివునికీ వెన్నెలకీ ఉన్న విడదీయలేని సంబంధం మనకీ కవి పద్యాలలో కూడా కనిపిస్తుంది:

ఎల్లన్ నీవయిపోయి నీవు తలపై ఏ చిన్నిపువ్వట్లొ జా

బిల్లిం దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే

వెల్లింగొల్పెడునట్టులున్నయవి యీ వేళా విశేషమ్ముచే

వెళ్ళంబుచ్చకు మింక దీని మనసే వేఱయ్యె మృత్యుంజయా!

లోకమ్మందునగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న

య్యాకాశమ్మున నున్న జాబిలియు నాయందున్న డెందమ్ము ని

ట్లేకాకారత నొంద నేమి కతమో! యీ యాత్మ సంబంధమున్

నీ కారుణ్యముచేత నేర్పడుటగానే తోచు మృత్యుంజయా!

జగత్తంతా శివమయమయ్యింది. ఆతని తనుకాంతి విశ్వమంతా వెన్నెలలై విరాజిల్లింది. మామూలు మనిషికి వెన్నెల బయట లోకంలో మాత్రమే కనిపిస్తుంది. అంతా శివుడే అయిన భక్తునికి తనలోపల కూడా వెన్నలలు విరబూస్తాయి. ఆకాశంలోని జాబిలి తనలోని మనస్సూ ఒకటే అయిపోతాయి(చంద్రుడు మనసుకి అధిపతని అనేది ఇందుకేనేమో!). అప్పుడా కరుణామయుడైన పరమేశ్వరుడు ఆ భక్తుని మనస్సునే తలపూవుగా ధరిస్తాడు కాబోలు!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!