ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు         

 By - Kameswara Sarma Sriadibhatla


  బడికెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది ఏ చిన్న తప్పిదం జరిగినా కొట్టేవారు మేష్టర్లు.భాస్కర శర్మగారైతే మరీనూ, ఆతను మాకు తెలుగు చెప్పేవారు ఈ రోజు చెప్పిన పద్య భాగంలో పువ్వుగుర్తున్న పద్యాలనీ మరుసటి రోజుకు అప్పచెప్పాలి, చెప్పలేకపోయేమో మొట్టికాయలతో బుర్ర రామకీర్తన పాడేవారు.చెపుతూ గనక తడబడ్డానో, భట్టూ భెక్కుతావేమిరా అంటూ మరో రెండు మొట్లు మొట్టేవారు. శనివారం వచ్చిందంటే చచ్చేంత భయంగా ఉండేది.ఆ రోజు అటు ఇంగ్లీషులోనూ ఇటు తెలుగులోనూ వ్యాకరణం చెప్పేవారు. భాస్కర శర్మగారి మొట్టికాయలకు తోడుగా ఇంగ్లీషు మేష్టారి బెత్తం. మిగతా మేష్టర్లేమన్నా తక్కువ తిన్నారా, గోడకుర్చీ వేయించేవారు ఒకరూ, మోకాళ్ళమీద కూర్చేపెట్టేవారు మరొకరూనూ. దాన్నా దీన్నా బడి అంటే అదో భయం. 


         ఎంత త్వరగా బళ్ళో చదువు పూర్తి చేసుకుని కాలేజీకి వెళిపోతానా అనుకుంటూ ఉండేవాడిని. నాకంటే పెద్దవాళ్ళు చెప్పేవారు, కాలేజీలో స్టూడెంట్లని కొట్టరుట. 


         అనుకున్న రోజు రానే వచ్చింది. టెంత్ పాసయి ఇంటర్లో చేరేను. ఏనుగెక్కినంత ఆనందంగా అనిపించిది. కాలేజీలో ఒరేయ్ అని పిలవడంకానీ కొట్టడం కానీలేవు.అదీ కాక బళ్ళో అంతా మగపిల్లలే ఉండేవారు కాలేజీలో ఆడపిల్లలు కూడా ఉన్నారు. యవ్వనారంభ దశ, ఆడపిల్లల్ని చూస్తే అదో సరదా, తెలియకుండానే నాకు నేను ఒక హీరోని అనే ఫీలుంగూ వీటన్నిటితోటీ గొప్ప సరదాగా ఉండేది కాలేజీ జీవితం. ఐతే ఆ ముచ్చట మూణ్ణాళ్ళే అయింది. ఇక్కడ కొట్టడమైతే లేదుకానీ పాఠాలు సరిగా చదవని పక్షంలో మేష్టర్లు నిలబెట్టి తిట్టేవారు. లంగా వోణీలతో ఉన్న ఆడపిల్లలముందు అలా తిట్లు తినడం మహా అవమానంగా ఉండేది. ఎంత జాగ్రత్తగా చదివినా ఎప్పుడో ఒకప్పుడు తప్పుకు దొరకడం అమ్మాయిల ముందు తిట్లూ చీవాట్లూ తినడం. ఛ ఇదేం బ్రతుకు, ఈ కాలేజీ చదువు తొందరగా పూర్తయితే బాగుణ్ణు హాయిగా యూనివర్సిటీకి వెళితే ఈ తిట్ల బాధ ఉండదు అనుకునేవాడిని. 


         ఆరోజు కూడా రానే వచ్చింది. యూనివర్సిటీలో స్టూడెంట్లను ఏమండీ అని మీరు అనీ పిలుస్తుంటే అమ్మో నేను పెద్దవాణ్ణి ఐపోయేను అనుకుని మురిసిపోతూ ఉండేవాడిని. ఇక్కడ కొట్టడాలూ తిట్టడాలూలేవు. క్లాస్ మేట్ అమ్మాయిలు చీరలు కట్టుకొచ్చేవారు. కాలేజిలో చిన్న హీరోనైతే యూనివర్సిటీకొచ్చి పెద్ద హీరో ఐపోయేను అనుకునే వాడిని. 

  ఇలా ఉండగా ఇక్కడ మరో సమస్య ఎదురయింది. తిట్టడం కొట్టడం చెయ్యకపోయినా, మేష్టారుకు కోపం వస్తే క్లాసులోంచి బయటకు పొమ్మనేవాడు. చీరకట్టుకొచ్చిన శ్రీదేవి ముందర అలా బయటకు పోవడం కాస్త అవమానంగానే ఉండేది. దేవుడా ఏమిటి నాకీ బాధ. ఈ తిట్లూ బయటకి పొమ్మనడాలూ అందునా ఆడపిల్లల ముందు. ఛీ చదువు త్వరగా పూర్తిచేసుకుని ఉద్యోగంలో కుదురుకుంటేగానీ ఈ బాధలు తప్పవు అనుకుంటూ ఉండేవాడిని. 



         చదువు పూర్తయింది. మంచి ఉద్యోగం వచ్చింది. పెళ్ళయింది పిల్లలు పుట్టేరు, విదేశాలు తిరిగేను,ధన కనక వస్తువాహనాలు సమృద్ధిగా సమకూర్చుకున్నాను ఇరవై ఏళ్ళ పైబడి అనుభవం సంపాదించడం వల్ల సీనియర్ పొజిషన్ కు చేరుకున్నాను ఐనా గానీ ఎందుకో కాస్త అసంతృప్తి. ఉద్యోగంలో తిట్టేవారూ, కొట్టేవారూ బయటకు పొమ్మనే వాళ్ళూ లేరు. ఐనా ఏదో వెలితి. ఏమిటా వెలితి?????????????? 



         బళ్ళో మాష్టారి చేత్తో దెబ్బలు తిన్న రోజులే ఎందుకో చాలా చాలా బాగున్నాయనిపించీ అయ్యో మళ్ళీ ఆరోజులను తిరిగి తెచ్చుకోలేను కదా అనుకున్నప్పుడు మనసులో ఏదో బాధా వెలితీనూ 

అందుకే భాస్కర శర్మగారిని( మా తెలుగు మాష్టారు) నిత్యం ఇలా తలుచుకుంటాను. 


భట్టూ భెక్కెదవేమని 

మొట్టిన భాస్కర గురునకు మ్రొక్కులనిడుచున్ 

చుట్టితి శ్రీకారమ్మును 

పట్టితి నే ఘంటమంత పదములు వ్రాయన్

         


         విదేశాల్లో పలువురు దేశీయుల మధ్య నేను వ్రాసిన ఇంగ్లీషు డ్రాఫ్ట్ కు ప్రశంశ లభించినప్పుడు మా ఇంగ్లీషు మేష్టారు కొట్టిన పేక బెత్తం దెబ్బలు గుర్తొస్తే చాలా ఆనందం కలుగుతుంది. అయ్యో మళ్ళీ బడికెళ్ళి చదువుకోగలిగితే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది. 


         అలా అనిపించినప్పుడు శ్రీ శ్రీ గుర్తొస్తాడు " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" అన్న మాట గుర్తొస్తుంది.

 


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!