Skip to main content
“ పరిహాసము లేని ప్రసంగం”
“ పరిహాసము లేని ప్రసంగం”
.
వాసనలేని పువ్వు , బుధవర్గములేని పురంబు,భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడుకాని కుమారుడున్, సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని ప్రసంగవాక్యమున్
గ్రాసము లేని కొల్వు – కోరగానివి పెమ్మయ సింగధీమణీ!”
.
పైపద్యం ‘సింగధీమణీ’ అనేశతకం నుండి గ్రహించబడినది. పనికి రాని వాటిని గూర్చి అద్భుతంగా వివరించిన శతకం యిది. తప్పక అందరు చదవతగ్గది. పైపద్యంలోని భావం సులభ గ్రాహ్యం కనుక వివరించటంలేదు. పై పద్యంలో “ పరిహాసము లేని ప్రసంగం” కొరగానిది అంటే పనికి రాదు అంటాడు కవి. మనం నవ్వుతూ, ఎదుటివారిని నవ్వించడం ఒక కళ. మనం మాటాడితే ఎదుటి వారు ‘ఇంకా,ఇంకా వినాలి’ అనేటట్టు ఉండాలి.
అందుకే మాటాడేటప్పుడు కొన్ని ‘పద్ధతులు’ ( టెక్నిక్స్) పాటించాలని పెద్దలు చెప్పారు.
స్పష్టంగా నవ్వు ముఖంతో మాటాడాలి. ( వదనం ప్రసాద సదనం)
దీర్ఘాలు తీస్తూ మాటాడకూడడు.
తల ఆడిస్తూ,తల వంచి మాటాడ కూడదు. ( శిరః కంపీ, అవనత వదనం)
ఎదుటి వారి ముఖంలోకి చూస్తూ మాటాడాలి.
నంగిరిగా, (అస్పష్టంగా) వణుకుతున్నట్లు మాటాడ కూడదు.
ఎదుటి వారిలో విసుగు కనపడినా, ( అంటే బోర్ ఫీల్ అయినా) వినే ఉత్సాహం లేకున్నా!
మాటాడటం మానేయాలి.
ముఖ్యంగా పైపద్యంలో చెప్పినట్లు పరిహాసంతో కూడిన ప్రసంగమే చేయాలి. అందుకనే ఎక్కువగా మాటాడేటప్పుడు నవ్వు తెచ్చే వాక్యాలని (జోక్స్ ని ) మధ్య,మధ్య జొప్పించాలి. కనుకనే మన పూర్వ సాహిత్యంలో హాస్యానికి పెద్ద పీట వేసారు.
Comments
Post a Comment