Skip to main content
కరుణ శ్రీ !
కరుణ శ్రీ !
.
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు...
.
గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు....
.
అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై...
.
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా!
Comments
Post a Comment