Skip to main content
రామాయణంలో వాలి వధ.....
రామాయణంలో వాలి వధ.....
శ్రీరాముడు వాలిని చంపటం గురించి కొందరు తప్పుగా మాట్లాడతారు. వాలి మరణించేముందు అడిగిన సందేహాలకు రాములవారే సమాధానాలు చెప్పి వాలి సంశయాలను తీర్చారట. అందులో కొన్ని విషయాలు....
వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.
ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.
నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు....
వాలి చివరి కోరికలు
వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.
తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.
పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.
అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.
ఈ విషయాలు అంతర్జాలంలో చదివినవే.
..............
.................
( వాలికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది...వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది.
ఇలాంటి ప్రత్యేకమైన వరాలను పొంది ఆ వరదర్పంతో ఇతరులను కష్టపెట్టే వారిని శిక్షించటంలో ప్రత్యేకంగానే వ్యవహరించటంలో అధర్మమేమీ లేదు. )
( ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. అని శ్రీరాములవారు తెలియజేసారు కదా ! )
.................
నేను వాల్మీకి వ్రాసిన మూల రామాయణం చదవలేదండి. అయితే నాకు తెలిసినంతలో వాలి, సుగ్రీవులు మొదట చాలా అన్యోన్యంగానే ఉండేవారట. ఒకసారి , వాలి యుధ్ధములో మరణించాడని సుగ్రీవుడు పొరపడిన సందర్భములో సుగ్రీవుడు రాజ్యపాలన స్వీకరించటం జరిగింది.
తరువాత వాలి తిరిగివచ్చి సుగ్రీవుని అపార్ధం చేసుకోవటం , ఆ తరువాత చాలా సంఘటనల అనంతరం వాలి వధింపబడటం వరకు విషయం వెళ్ళింది.
సుగ్రీవుడు జీవించి ఉండగానే వారి భార్యను వాలి వివాహం చేసుకోవటం తప్పే కదా !
సుగ్రీవుడు వాలి చనిపోయాడని భావించి , వాలిని చంపిన రాక్షసుడు బయటకు రాకుండా గుహను మూసి వెళ్ళిపోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు.
ఇంకా, వాలి అపార్ధం చేసుకున్నట్లు లోకంలో చాలామంది ఇతరులను అనుమానించటం కూడా జరుగుతుంటుంది..
ఇలాంటి సంఘటనల వల్లే లోకంలో ప్రజల మధ్య గొడవలు వస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీ, సంపద , సార్వభౌమాధికారం .... వంటి విషయాల వల్ల అపార్ధాలు, గొడవలు వస్తుంటాయి.
వాలి సుగ్రీవుని అర్ధం చేసుకుని క్షమించి ఉంటే సరిపోయేది. సుగ్రీవుడు తాను పొరపాటు చేసానని ఒప్పుకున్నా కూడా, వాలి సుగ్రీవుని యందు అనుమానంతో అతనిని క్షమించకుండా అతని భార్యను తాను వివాహం చేసుకోవటం, సుగ్రీవుని చంపటానికి ప్రయత్నించటం ..... అలా వ్యవహారాన్ని తెగేవరకూ లాగి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.
ఇక రాముడు చెట్టు చాటునుండి వాలిని చంపటం గురించి కొందరు తప్పుపడతారు. అందులో తప్పేముంది? ఉదాహరణకు .. ఊరిలోని వారిని చంపటానికి ప్రయత్నించే సింహాన్నో , ఎలుగుబంటునో చంపాలంటే ఏ చెట్టు చాటు నుండో లేక చెట్టు ఎక్కో తుపాకీ పేలుస్తారు కానీ, సింహానికి ఎదురుగానే నుంచుని తుపాకీ పేల్చాలని రూలేమీ లేదు కదా !
వాలి తన ఎదురుగా ఎవరు నిలబడి యుద్ధం చేసినా , వారియొక్క సగం బలం తనకు వచ్చేటట్లు వరం పొందిన వ్యక్తి. ఇలాంటి వరాలు పొందిన స్పెషల్ కేసులలో ధర్మాలు కూడా వేరేగానే ఉంటాయి మరి.
రావణ సంహారం విషయంలో వానరుల పాత్ర ఉండాలి కాబట్టి , దేవతలే వానరులుగా జన్మించారట. హనుమంతుడు సీతాన్వేషణ చేయటం, తరువాత కధ అందరికీ తెలిసిందే.
సుగ్రీవుడు రాముడు స్నేహితులు. మన స్నేహితులకు ఎవరైనా అపకారం తలపెడితే మన స్నేహితులకు మన వంతు సాయం చేస్తాం కదా ! రాముడు కూడా సుగ్రీవునికి సహాయం చేసాడు.
రాముడు , వాలిని చంపటం ద్వారా తాను రావణుని జయించగలనని ముందే రావణుని హెచ్చరించినట్లు అయింది. ( వాలి రావణుని జయించిన వాడు. తరువాత వాలి, రావణులు స్నేహితులయ్యారట. )
వాలి, సుగ్రీవుల విషయంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనిస్తే,
వాలి వధానంతరం సుగ్రీవుడు రాజు అయ్యారు కదా......సుగ్రీవుని తరువాత సుగ్రీవుని సంతానం కాకుండా వాలి యొక్క కుమారుడైన అంగదుడు యువరాజయ్యాడు.
సుగ్రీవుడు మొదలైన వానరులు మానవులకు వలె నాగరికత తెలిసిన వానరులు అనిపిస్తుంది. చీమలలోనే రాణి చీమ, శ్రామిక చీమలు , వాటి కాలనీలు .... ఇలా ఎన్నో రకాలు ఉంటాయట. మరి ఉత్తమజాతికి చెందిన వానరులలో రాజ్యాలు, రాజులు, రాణులు , సైన్యం ఉండటంలో ఆశ్చర్యం లేదు.
పురాణేతిహాసాల ద్వారా మనకు ఎన్నో విషయములు తెలుస్తాయి.
x
Comments
Post a Comment